దరఖాస్తుకు పరిశ్రమల యజమానుల అనాసక్తి
డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు ఎక్కువగా ఉందనే అభిప్రాయం
రియల్ ఎస్టేట్ ఆశాజనకంగా లేకపోవడమూ కారణమే..
పరిశ్రమల యజమానులతో టీజీఐఐసీ వరుస భేటీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐదారు దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడలను ‘బహుళ వినియోగ జోన్లు’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ‘హిల్ట్ పాలసీ’ముందుకు సాగడం లేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్‌ఆర్‌ఓ) రేట్ల కంటే బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపాక్ట్ డెవలప్‌మెంట్ ఫీజు ఎక్కువగా ఉండటంతో పాటు ఇతర కారణాలతో పరిశ్రమల యజమానులు హిల్ట్ పీపై ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా లేకపోవడం, ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు పరిశ్రమల తరలింపులో ఇబ్బందులు తదితరాలు కూడా ఈ పాలసీ అమలుకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడల యజమానులతో టీజీఐఐసీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తోంది.
మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు
హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం–2025 (హిల్ట్ పీ)ని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆమోదించి జీఓ నంబర్ 27 విడుదల చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల దృష్ట్యా పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలకు తరలించడం, బాలానగర్, కాటేదాన్, కూకట్‌పల్లి సహా మొత్తం 22 పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాలను మల్టీ యూజ్ జోన్లుగా మార్పిడి చేయాలన్నదే ఈ పాలసీ లక్ష్యం. దీని ద్వారా పారిశ్రామికవాడలను.. అపార్ట్‌మెంట్‌లు, సమీకృత టౌన్íÙప్‌లు, ఆఫీసులు, హోటళ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, క్రీడా కేంద్రాలు, కల్చరల్ సెంటర్లు తదితరాల కోసం వినియోగించేలా వెసులుబాటు కల్పిస్తారు.
సవాలక్ష సందేహాలు
ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అథారిటీ (ఐలా)ల ఆధ్వర్యంలో టీజీఐఐసీ నిర్వహిస్తున్న సమావేశాల్లో పరిశ్రమల యజమానులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో పాటు తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిశ్రమలను మూసివేసి హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. మల్టీ యూజ్ జోన్‌గా మార్చుకునేందుకు టీజీఐఐసీకి చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు ఎక్కువగా ఉందని కొందరు చెప్తున్నారు. పరిశ్రమలను ఉన్న ఫళంగా మూసి వేసి ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించడం సాధ్యం కాదని అంటున్నారు. ఓఆర్‌ఆర్ వెలుపల భూమి కొనుగోలు, కొత్త పరిశ్రమ ఏర్పాటు అంత సులభతరం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పరిశ్రమల తరలింపులో ఎదురయ్యే సవాళ్లు అన్నింటిలోనూ ప్రభుత్వ సహకారం ఇవ్వాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల తరలింపుతో తమ వ్యాపారం దెబ్బతినడంతో పాటు ఆధారపడిన వారు ఉపాధి కూడా కోల్పోతారనే వాదన కూడా కొందరు వినిపిస్తున్నారు. ఈ ఫీజు ఎస్‌ఆర్‌ఓ కంటే తక్కువగా ఉండాలని కొందరు పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.
పరిశ్రమల మూతకు వెనుకంజ
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి నిరాశాజనకంగా ఉండటంతో హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు పరిశ్రమల యజమానులు విముఖత చూపుతున్నారు. నడిచే పరిశ్రమ స్థానంలో మల్టీ యూజ్ జోన్ ఏర్పాటు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు లాభదాయకం అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా ఒక పారిశ్రామిక వాడలోని అన్ని పరిశ్రమలు ఏకకాలంలో తరలివెళ్తేనే మల్టీ యూజ్ జోన్‌గా మార్చడం సాధ్యమవుతుంది. అందుకే పరిశ్రమల యజమానులతో టీజీఐఐసీ సంప్రదింపులు జరుపుతోంది. వాస్తవానికి ఆరు నెలల్లోగా పాలసీ అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. మే నెలాఖరుకు ఆరు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి మార్గదర్శకాలపై స్పష్టత లేకుండా పోయింది. పరిశ్రమల యజమానుల డిమాండ్లు, రాయితీలు, ఫీజు తగ్గింపు వంటి విన్నపాలపై స్పష్టత ఇస్తూ పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వెలువరిస్తే పాలసీ ముందుకు సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


