ముక్క లేనిదే.. ముద్ద దిగేదేలే! | Telugu States Giving Top Priority For Meat | Sakshi
Sakshi News home page

ముక్క లేనిదే.. ముద్ద దిగేదేలే!

Published Sun, Dec 11 2022 2:58 AM | Last Updated on Sun, Dec 11 2022 2:58 AM

Telugu States Giving Top Priority For Meat - Sakshi

తెలుగింటి పాకశాలల్లో గతంలో రాజ్యమేలిన గోంగూర, ఆవకాయ ఇప్పుడు సైడ్‌ అయిపోయాయి. ‘తాజాకూరలలో రాజా ఎవరండీ.. వంకాయేనండీ..’అంటూ పాడుకున్న కూరగాయలేవీ తెలుగువారి పంటికి రుచించడం లేదు. ఇంటా బయటా, విందు వినోదం ఏదైనా సరే.. ముక్క లేనిదే ముద్ద దిగేదేలే.. అన్నట్టుగా మారిపోయింది.

మాటామంతీ జరగాలంటే మటన్‌.. చీటికీమాటికీ చికెన్‌.. ఫుల్లు జోష్‌లో ఫిష్‌.. వెరైటీగా కావాలంటే ప్రాన్స్, బర్డ్స్‌.. ఎన్ని రకాల మాంసం ఉంటే అంత సరదా. సండే లేదు మండే లేదు.. అన్నీ నాన్‌వెజ్‌డేలే అయిపోయాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.           
–సాక్షి, హైదరాబాద్‌ 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. 
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మాంసం వినియోగం ఎక్కువ. ఇందులోనూ తెలంగాణ టాప్‌లో, ఏపీ మూడో స్థానంలో ఉండటం విశేషం.  గొర్రెలు, మేక మాంసం వృద్ధిలో తెలంగా ణ.. చేపలు, రొయ్యల ఉత్పత్తితో ఏపీ ముందంజ లో ఉంది. ఇంకోవైపు చికెన్, గుడ్లు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నవి కూడా తెలుగు రాష్ట్రాలే. దమ్‌ బి ర్యానీ, పాయ, తలకాయ, కీమా, నాటు కోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల ఫ్రై, ఎండు చేప­ల వంకాయ ఇలా చెప్పుకుంటూ పోతే జిహ్వకో రుచి అన్నట్టుగా మాంసం వంటకాల జాబితా చాంతాడును మించి ఉంటోంది. ఫంక్షన్లలో అయితే ఎన్నో వెరైటీల డిష్‌లను వడ్డిస్తుండటం కనిపిస్తోంది.  

దేశంలో తెలంగాణనే టాప్‌ 
మాంసాహార వినియోగంలో దేశంలో తెలంగాణదే హవా. తినడమే కాదు ఉత్పత్తిలోనూ మన రాష్ట్రానిదే అగ్రస్థానం. ఉత్పత్తి పెరుగుతున్నా వినియోగం అధికంగా ఉండటంతో ధరలూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో మాంసం ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయింది. మరోవైపు గత నలభై ఏళ్లకాలంలో మాంసం ధరలు 30రెట్లు పెరగడం గమనార్హం.

జాతీయ వార్షిక తలసరి మాంసం వినియోగం 5.4 కేజీలుకాగా.. అదే తెలంగాణలో అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా అంటే 21.17 కిలోల మాంసం వినియోగిస్తున్నారు. గతంలో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 700–800 లారీల గొర్రెలు, మేకలు దిగుమతి అయ్యేవని.. రాష్ట్రంలో గొర్రెలు/మేకల సంఖ్య పెరగడంతో దిగుమతి చేసుకునే లారీల సంఖ్య 100 వరకు తగ్గిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం ఇలా.. 
గ్రామీణ భారతీయుల్లో 6.4% మంది మటన్, 21.7 % మంది చికెన్, 26.5 % మంది చేపలు, 29.2% మంది గుడ్లు తింటున్నట్టు నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21% మంది మటన్, 21% మంది చేపలు, 27% చికెన్, 37.6% మంది గుడ్లను వినియోగిస్తున్నారు. 

రాజస్తాన్‌లో శాకాహారులే అధికం 
రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం పురుషు లు, 76.6 శాతం మహిళలు శాకాహారులే. ఇక హరియాణాలో 68.5శాతం పురుషులు, 70 శాతం మ హిళలు.. పంజాబ్‌లో 65.5శాతం పురుషులు.. 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతుండటం విశేషం. 

రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం 
‘‘2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఉత్పత్తిలో విప్లవాత్మక మా ర్పులు వచ్చాయి. దీనికి  ముందు రాష్ట్రంలో మటన్‌ ఉత్పత్తి 5.4 లక్షల టన్నులుగా ఉంటే, ప్ర స్తుతం 10.04 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. 2014– 15లో సాలీనా తల సరి మాంసం లభ్యత 12.95 కేజీలుకాగా అదిప్పుడు 22.70 కేజీలకు చేరింది. గొర్రెల పెంపకానికి ఇ ప్పటివరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం. తద్వారా రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం.
– దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement