రైతులంటే బీజేపీకి చిన్నచూపే: హరీశ్‌

Telangana: Minister Harish Rao Comments On BJP - Sakshi

అన్నదాతలపై కారు ఎక్కించినా కేసులేదు    

మెదక్‌జోన్‌: రైతులంటే బీజేపీకి చిన్నచూపు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేసిన అన్నదాతల మీదికి కారు ఎక్కించి వారి మృతికి కారణమైన కేంద్రమంత్రిపై కేసు నమోదు చేయలేదని, అతడిని పదవి నుంచి తొలగించలేదని విమర్శించారు. మంగళవారం ఆయన మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ నాయకులు వడ్లు కొనుగోలు చేయబోమంటే, గల్లీ నాయకులు కేంద్రం కొనుగోలు చేస్తుందని పొంతనలేని మాటలు చెబుతూ రైతుల్ని అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు.

యాసంగి వడ్ల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక్కడ రబీ సీజన్‌లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల క్వింటాల్‌ వడ్లు మిల్లుకు వేస్తే 40 కిలోల నూకలు, 25 కిలోల బియ్యం వస్తాయని, బాయిల్డ్‌ రైస్‌ అయితే క్వింటాల్‌కు 60 కిలోల బియ్యం వస్తాయన్నారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా బాయిల్డ్‌ రైస్‌ కొనబోమంటూ కేంద్రం మొఖం చాటేయడం విచారకరమని అన్నారు.

యాసంగిలో దొడ్డురకం పంట దిగుబడి మాత్రమే వస్తున్నందున దాన్ని బాయిల్డ్‌ రైస్‌గా మార్చి కేంద్రం కొనుగోలు చేయాలన్నారు. యాసంగి ధాన్యం మిల్లుల్లో నిండుగా ఉందని, వాటిని తరలిస్తే ప్రస్తుతం వచ్చే ధాన్యం భద్రపరుచుకోవటానికి వీలు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top