తెలంగాణ బీజేపీలో కొత్త చేరికలేవి? నేతలు వెనకడుగు వేయడానికి కారణాలు ఇవేనా?

Telangana Inclusion Of Other Party Leaders In BJP Party - Sakshi

బీజేపీలో ఊపందుకోని ఇతర పార్టీల నేతల చేరికలు 

టికెట్‌పై హామీ, చేరికలపై విధానమేదీ లేకపోవడమే కారణం? 

ముందస్తు హామీలు ఇవ్వకుండా చేర్చుకోవాలన్న కేంద్ర నాయకత్వం  

కండువా కప్పుకునేందుకు వెనుకాడుతున్న కొందరు 

పార్టీని వీడుతున్న మరికొందరు.. ఇదే దారిలో ఇంకొందరు  

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలోకి ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం ఇంకా ఊపందుకోలేదు. టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేలా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలతోపాటు రెండు విడతల ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైనా నేతల చేరికలపై పార్టీలో సందిగ్ధ వాతావరం కొనసాగుతోంది. టికెట్‌ ఇస్తామనే హామీ ఇవ్వకపోవడం, నేతలను చేర్చుకునే అంశంలో స్పష్టమైన విధాన మంటూ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణ మని తెలుస్తోంది.  మరోవైపు ఇప్పటికే చేరిన కొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పగా ఇంకొందరు ఇదేదారిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.  

చేరుదామని తొలుత అనుకున్నా.. 
బీజేపీలో చేరేందుకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పలానా స్థానం నుంచి పోటీకి ముందస్తు హామీ, తమతో పాటు వచ్చేవారికి టికెట్లు, తమ జిల్లాలో లేదా తమ ఎంపీ పరిధిలో తాము చెప్పేవారికి అవకాశం కల్పించాలని ఇతర పార్టీల ముఖ్య నేత లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం టికెట్ల కేటాయింపుపై ఎవరికీ ముందస్తు హామీ ఇవ్వొద్దని, షరతులేం లేకుండా చేర్చుకోవాలని నిబంధన విధించిందని పలువురు అంటున్నారు. దీంతో కొందరు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు బీజేపీలో చేరేందుకు తొలుత సుముఖత వ్యక్తం చేసినా ఇప్పుడు తటపటాయిస్తున్నట్టు తెలుస్తోంది.  

కొత్త వారు చేరకుండా అడ్డుకుంటున్నారా? 
కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరికపై ఇంకా స్పష్టతనివ్వలేదు. ఆయన మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రచారం జరుగుతోంది. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నేతలతో అనేకసార్లు చర్చలు జరిపినా పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని వెనుకాడుతున్నట్టు సమాచారం.

మరోవైపు గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బీజేపీలో చేరిన వివిధ పార్టీల నేతలు కూడా కొత్తవారు చేరకుండా అడ్డుకుంటున్నారనే భావనలో పార్టీ సీనియర్లున్నారు. ఆయా స్థానాల్లో పోటీకి స్థిరపడిన పాత నాయకులు సైతం ఈ విషయంలో చొరవ తీసుకోవట్లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

చేరినవాళ్లే వీడుతున్నారు 
టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డితో పాటు చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న వంటివారు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గతంలోనే వెళ్లిపోయారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మరికొందరు కూడా బీజేపీని వదిలే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు రాహుల్‌గాంధీ వరంగల్‌ సభ విజయవంతం కావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నుంచి చేరికల పర్వం మొదలైంది. టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ వర్గ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య జెడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. 

అతి జాగ్రత్త వల్ల.. 
పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన చేరికలు, సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కొంత కసరత్తు జరిగింది. జిల్లాలవారీగా పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న వారితోపాటు ఏ ప్రాంతంలో ఎవరిని చేర్చు కుంటే పార్టీ గెలుపు ఖాయమో జాబితాను సిద్ధం చేసి నాయకత్వానికి అందజేసినట్టు సమాచారం.

అయితే పశ్చిమబెంగాల్‌లో అధికారానికి రావడం తథ్యమని భావించి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేర్చుకోవడం, వారిలో చాలా మంది కోవర్టులుగా పని చేయడంతో అక్కడ బీజేపీకి ఓటమి తప్పలేదని పార్టీ జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి లోపాలు, లోటుపాట్లు జరగకుండా అతిజాగ్రత్తగా ఉండటంతోనే ఇబ్బంది ఎదురవుతోందని నేతలు అంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top