తెలంగాణ: సర్కారీ మెడికల్‌ షాపులు!

Telangana Government To Supply Generic Medicines Through Stores - Sakshi

‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో తక్కువ ధరకే జనరిక్‌ ఔషధాలు అందించే యోచన

ప్రైవేట్‌ దుకాణాలకు పోటీగా ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం!

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల ఇష్టారాజ్య ధరలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వ జనరిక్‌ ఔషధ దుకాణాలు ఏర్పాటుకానున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో, బయట వీటిని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ మెడికల్‌ షాపుల్లో తక్కువ ధరకే ‘తెలంగాణ బ్రాండ్‌’ జనరిక్‌ మందులు లభిస్తాయి. దీనిపై ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్‌ షాపుల్లో అమ్మే మందులపై ప్రత్యేకంగా ‘తెలంగాణ ప్రభుత్వ సరఫరా’అని లేబుల్‌ అంటిస్తారు.  

ప్రైవేట్‌ మందుల దుకాణాల హవా 
రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ, బయట కొన్ని మందుల దుకాణాలదే పెత్తనం. వారు చెప్పిందే ధర. తక్కువకు దొరికే మందులనూ అధిక ధరకు రోగులకు అంటగడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇక, కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ టెండర్లు పిలిచి ప్రైవేట్‌ వ్యక్తులకే దుకాణాలను కేటాయిస్తున్నారు. వాటిల్లో కొన్ని ఏజెన్సీలు నాసిరకం మందులను సరఫరా చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చే మందులను మాత్రమే తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) సమకూరుస్తోంది. ఈ సంస్థ ప్రభుత్వాస్పత్రులకు రూ.200 కోట్లకుపైగా విలువైన 600 రకాల ఔషధాలు, ఇతరత్రా సర్జికల్‌ పరికరాలను సరఫరా చేస్తోంది. వీటిలో 300 రకాల మందులు అత్యవసరమైనవి. గ్లోబల్‌ టెండర్ల ద్వారా ఖరారవుతున్న ఈ ఔషధాల ధర ఎక్కువ కావడంతో ప్రజలు నష్టపోతున్నారు.  (చదవండి: మార్చి వరకు ఉచిత బియ్యం!)

సహకరించని కంపెనీలు 
రాష్ట్రంలో 800 ఫార్మా, బయోటిక్, మెడికల్‌ టెక్నాలజీ కంపెనీలున్నాయి. అందులో ఎక్కువ కంపెనీలు అంతర్జాతీయ ప్రసిద్ధి గలవే. ఇక్కడి నుంచే ఆయా కంపెనీల ద్వారా 168 దేశాలకు  ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‌ ఫార్మా క్యాపిటల్‌గా పేరొందినా.. అనేక కంపెనీలు ఔషధాలను ప్రభుత్వానికి అమ్మడం లేదన్న, రాష్ట్రంలోని పేదలకు తమ డ్రగ్స్‌ అందుబాటులోకి తేవడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరాకు రాష్ట్రంలోని పదిలోపు ఫార్మా కంపెనీలే సహకరిస్తున్నాయని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ కంపెనీలతో పాటు జనరిక్‌ మందులు తయారుచేసే ప్రముఖ బ్రాండెడ్‌ ఫార్మా కంపెనీలతో భేటీ కావాలని సర్కారు యోచిస్తోంది. ఆయా కంపెనీల నుంచి భాగస్వామ్యం కోరాలని, ఔషధాలను మన రాష్ట్ర రేట్లకు తగ్గట్లుగా విక్రయించేలా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. 

ఎందుకు ముందుకు రావట్లేదంటే.. 
అంతర్జాతీయంగా ఎగుమతి చేసే మన ఫార్మా కంపెనీలు ప్రభుత్వాస్పత్రులకు ఔషధాలు విక్రయించకపోవడానికి.. కఠినమైన షరతులే  కారణమని చెబుతున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెడితే అంతర్జాతీయంగా వ్యాపారం దెబ్బతింటుందన్న భయం అనేక ఫార్మా కంపెనీల్లో ఉంది. ఒకసారి టెండర్లకు ఒప్పుకుంటే బకాయిలు పేరుకుపోతున్నా మందులు సరఫరా చేయాలి. బకాయిలు చెల్లించలేదని సరఫరా నిలిపివేసినా జరిమానాలు విధించే పరిస్థితి ఉంది. దీంతో తమకు రావాల్సిన డబ్బులు రాకపోగా, ఎదురు జరిమానాలు విధిస్తే ఎలా అనే అభిప్రాయంతో ఇవి ఉన్నాయి. ఇందుకే ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరాకు ఫార్మా కంపెనీలు ముందుకు రావట్లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఫార్మా కంపెనీల సలహాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే కొన్ని మార్పులుచేర్పులు చేయాలని యోచిస్తోంది. 

ఆలోచన ఉంది: ఈటల
ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్‌ షాపులు పెట్టాలనే ఆలోచన ఉంది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఇతర వర్గాల నుంచి సైతం దీనిపై ప్రతిపాదనలు అందుతున్నాయి. అయితే  కసరత్తు మొదలుకాలేదు.
–ఈటల రాజేందర్, వైద్య. ఆరోగ్యశాఖ మంత్రి 

జనరిక్‌.. బ్రాండెడ్‌.. ఏంటీ తేడా?
ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు పరిశోధనలు, పరీక్షలు చేసి దాన్ని మార్కెట్లోకి తెస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీపై ఆ కంపెనీకి నిర్ణీతకాలం పాటు పేటెంట్‌ హక్కులు ఉంటాయి. అలా తయారుచేసిన మందులను బ్రాండెడ్‌ డ్రగ్స్‌ లేదా స్టాండర్డ్‌ డ్రగ్స్‌ అంటారు. పేటెంట్‌ ఉన్నంతవరకు ఇతరులు తయారు చేయకూడదు. మొదట తయారుచేసిన కంపెనీ పేటెంట్‌ కాలం ముగిసిన తర్వాత, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపెనీ అయినా తయారుచేసి, మార్కెట్లోకి విడుదల చేయొచ్చు. అలా తయారు చేసిన మందులను జనరిక్‌ మందులంటారు. జనరిక్‌ డ్రగ్స్‌ తయారీకి ఎటువంటి పరిశోధనలు, క్లినికల్‌ ట్రయల్స్‌ అవసరం లేదు. మార్కెటింగ్‌ ఖర్చులూ ఉండవు. దీంతో బ్రాండెడ్‌ ఔషధాల ధరలతో పోలిస్తే జనరిక్‌ డ్రగ్స్‌ 30 నుంచి 80 శాతం తక్కువకే లభిస్తాయి.  

అదే జరిగితే మా పొట్టకొట్టినట్టే..
రాష్ట్ర ప్రభుత్వమే మందుల దుకాణాలను ఏర్పాటుచేస్తే.. చిన్న ప్రైవేటు మందుల దుకాణాదారుల పొట్టగొట్టినట్టే. ప్రభుత్వం జనరిక్‌ మందుల షాపులను నడపాలనుకున్నా చాలామంది డాక్టర్లు సహకరించే పరిస్థితి ఉండదు. చాలామంది డాక్టర్లు బ్రాండెడ్‌ మందులనే రాస్తున్నారు.
–వేణుగోపాల్‌ శర్మ, రాష్ట్ర ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల సంఘం ప్రతినిధి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top