ఆర్‌ఆర్‌ఆర్‌.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు 

Telangana: Center Gives Nod To 334 Km Regional Ring Road - Sakshi

హైదరాబాద్‌ చుట్టూ 338 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్‌ వే 

50–70 కి.మీ. పరిధిలోని ప్రాంతాలకు హైదరాబాద్‌తో లింక్‌ 

ఔటర్‌ రింగురోడ్డును కలుపుతూ 25 స్పైనల్‌ రోడ్లకు ప్రతిపాదన

300 గ్రామాలకు అనుసంధానం

11 వేల ఎకరాల భూ సమీకరణ.. భూసేకరణలో సగం ఖర్చు భరించనున్న రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌.. రాష్ట్రం మెడలో చేరనున్న కొత్త ఆభరణం.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే అపురూపం.. చిన్న పట్టణాలను కలుపుతూ పోయే ఓ అద్భుతం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఊహలు అతి త్వరలో నిజం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో లిఖిత పూర్వకంగా స్పష్టత ఇవ్వనుంది. హైదరాబాద్‌ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్‌ రింగు రోడ్డుకు 30 కిలోమీటర్ల ఆవల 338 కి.మీ. మేర ఆర్‌ఆర్‌ఆర్‌ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు 50–70 కి.మీ. దూరంలో ఉన్న దాదాపు 20కి పైగా చిన్న పట్టణాలను కలుపుతూ జాతీయ రహదారుల అనుసంధానంతో ఈ రింగు ఏర్పడనుంది.

జాతీయ రహదారుల ప్రాజెక్టుగా కేంద్రమే సొంత వ్యయంతో దీన్ని నిర్మించాల్సి ఉంది. అయితే దాదాపు రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ రోడ్డు వల్ల ఆర్థిక ప్రయోజనం అంతగా ఉండనందున నాట్‌ వయోబుల్‌ ప్రాజెక్టుగా కేంద్రం దీన్ని ఇటీవలి వరకు అటకెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయడం, కేంద్రం సూచించిన మార్పులు చేపట్టేం దుకు సమ్మతించటంతో కేంద్రం దీనికి ఆమోదం తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో లిఖితపూర్వకంగా స్పష్టత ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి సానుకూల సంకేతాలు అందటంతో ఇక త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కొత్త రోడ్డు ఏర్పడితే రాష్ట్రం పురోగతిలో కొత్త కోణాలను చవిచూడనుంది. ఇటీవలే కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్ని రాష్ట్రాల రోడ్లు, భవనాల శాఖ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చారు. త్వరలో సీఎంతో ఈ విషయంపై భేటీ అవుతానని చెప్పారు. 

ఓఆర్‌ఆర్‌తో మారిన రూపురేఖలు.. 
వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముందుచూపు ఇప్పుడు హైదరాబాద్‌ రూపురేఖలు మారేందుకు దోహదం చేసింది. ఇంతపెద్ద రోడ్డు అవసరమా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. దేశంలోనే 158 కి.మీ. తొలి 8 వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా ఔటర్‌ రింగు రోడ్డును ఆయన అందుబాటులోకి తెచ్చారు (ఆయన మరణానంతరం మొత్తం రోడ్డు పూర్తి). అది హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెండటంతో కీలకంగా మారింది. ఆ రోడ్డును ఆసరా చేసుకునే ఇప్పుడు హైదరాబాద్‌ చుట్టుపక్కలకు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వస్తున్నాయి. ఆ రోడ్డు ఆలంబనగా పారిశ్రామిక క్లస్టర్లు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. భారీగా ఉపాధితో పాటు రాష్ట్రానికి పన్నుల రూపంలో ఎంతో ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రం మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా ఈ రోడ్డు మీదుగా సులభంగా ముందుకు సాగుతున్నాయి. దీనివల్ల నగర ట్రాఫిక్‌పై పెను భారం తప్పింది. భవిష్యత్తులో ఈ నగరం మరింతగా పురోగమించేందుకు ఇది దోహదం చేసేందుకు సిద్ధంగా ఉంది. 

తొలుత అవునని, ఆ తర్వాత కాదని.. 
ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అది జాతీయ రహదారుల అనుసంధానంతో జరగాల్సి ఉన్నందున ఆ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరింది. ఇందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకరించారు. రెండోసారి మోదీ ప్రభుత్వం వచ్చాక మరికొన్ని ప్రాజెక్టులతో కలసి దీనిపై స్వయంగా ప్రధాని మోదీ సమీక్షించారు. ఇంత భారీ వ్యయంతో చేపట్టే రహదారి వల్ల తిరిగి ఆదాయం పెద్దగా ఉండదని తేల్చారు. టోల్‌ రూపంలో వచ్చే మొత్తం వడ్డీకి కూడా సరిపోదని లెక్కలేసి చివరకు ఈ ప్రతిపాదనను దాదాపు తిరస్కరించింది.

ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరటంతో తిరిగి పరిశీలించి, ఈ రోడ్డు వాణిజ్యపరంగా అభివృద్ధి జరిగేలా చూడాలని రాష్ట్రానికి సూచించింది. దీంతోపాటు భూసేకరణ ఖర్చులో సగం భరించాలని అడిగింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించటంతో దాని పునఃపరిశీలనకు అంగీకరించింది. తొలుత ఈ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాణిజ్యపరంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఎక్స్‌ప్రెస్‌ వేగా దీన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ఔటర్‌ రింగు రోడ్డు కూడా ఎక్స్‌ప్రెస్‌ వేగా ఉండటంతోనే మంచి ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని ఆరు వరుసలు నిర్మించాలని ప్రణాళిక మార్చారు. 

ఉపయోగాలు బోలెడు.. 
హైదరాబాద్‌కు 50–70 కి.మీ. దూరంలోనే ఉన్నప్పటికీ ఎన్నో ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. స్థానికంగా వ్యవసాయం, చిరు వ్యాపారాలు తప్ప ఉపాధి కరువైంది. ఔటర్‌ రింగు రోడ్డు ఏర్పాటైన ప్రాంతాల్లో ఈ సమస్య తీరింది. అదే తరహాలో ఎక్స్‌ప్రెస్‌ వేగా రూపుదిద్దుకునే ఈ భారీ రింగు రోడ్డుతో ఆయా ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నాయి. సరైన రోడ్‌ నెట్‌వర్క్‌ ఉంటే ఆ ప్రాంతాలకు కొత్త పెట్టుబడులు వస్తాయి. పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ రంగం కూడా పురోగమిస్తుంది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. కోల్డ్‌ స్టోరేజీలు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసే యూనిట్లు రూపొందుతాయి. హోటళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్, రీక్రియేషన్‌ జోన్లు ఏర్పాటవుతాయి. దీంతో పెద్ద ఎత్తున ఉపాధికి అవకాశం కలుగుతుంది. భూముల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ట్రాఫిక్‌ సమస్యలకూ కొంత విరుగుడు కలుగుతుంది. ఈ రోడ్డును ఔటర్‌ రింగు రోడ్డుతో అనుసంధానిస్తూ 25 స్‌పైనల్‌ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదించారు. దాదాపు 300 గ్రామాలను అనుసంధానిస్తుంది. 

ఆర్‌ఆర్‌ఆర్‌ విశేషాలు.. 
రీజినల్‌ రింగురోడ్డు నిడివి: 338 కిలోమీటర్లు 
అనుసంధానమయ్యే పట్టణాలు: సంగారెడ్డి– నర్సాపూర్‌– తూప్రాన్‌– గజ్వేల్‌– జగదేవ్‌పూర్‌– భువనగిరి– చౌటుప్పల్‌ –ఆమన్‌గల్‌– యాచారం– కందుకూరు– షాద్‌నగర్‌– చేవెళ్ల– కంది. 
మొదటి దశ: 152 కి.మీ. 
సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు ఉంటుంది. 
రెండో దశ: 186 కి.మీ. 
ఇందులో ఆమన్‌గల్‌ నుంచి కంది వరకు ఉంటుంది. 
ఈశాన్య భాగం: తూప్రాన్‌ నుంచి మల్కాపూర్‌ వరకు 
ఆగ్నేయ భాగం: మల్కాపూర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు 
నైరుతి భాగం: షాద్‌నగర్‌ నుంచి కౌలంపేట వరకు 
వాయువ్య భాగం: కౌలంపేట నుంచి తూప్రాన్‌ వరకు  
ఏయే జాతీయ రహదారులతో రింగ్‌ ఏర్పడుతుంది: ఎన్‌హెచ్‌ 65– ఎన్‌హెచ్‌ 44– ఎన్‌హెచ్‌163– ఎన్‌హెచ్‌ 765 
నిర్మాణ అంచనా: తొలుత రూ.7 వేల కోట్లు. ప్రస్తుతం రూ.12,800 కోట్లకు చేరింది.  
ఇందులో భూసేకణ వాటా రూ.3 వేల కోట్లు 
భూసేకరణలో రాష్ట్రప్రభుత్వం వాటా రూ.1,500 కోట్లు 
ఎంత భూమి అవసరం: దాదాపు 11 వేల ఎకరాలు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top