ఆ రాష్ట్రాల ఊసు లేదు

Srinivas Goud Speaks About Water Dispute In Telangana - Sakshi

జల వివాదాల చట్టం ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోవాలి 

కేంద్రం సూచనలను పట్టించుకోనందుకే కోర్టుకు వెళ్లాం 

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసులో కర్ణాటక, మహారాష్ట్ర ప్రస్తావన ఎక్కడా లేదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ కు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్‌ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శ్రీనివాస్‌గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచినప్పుడు గతంలో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తూ, ఇదే అంశంపై ఉమ్మడి ఏపీలో తాము సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

న్యాయ నిపుణుల సలహాతోనే 
రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై న్యాయ నిపుణుల సలహాతోనే ముందుకు వెళ్తున్నామని, తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌ మాత్రమే కొట్లాడుతుందని శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం సూచనలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించు కోనందునే సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. అపెక్స్‌ కమిటీ సమావేశంలోపే 2, 3 రోజుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు తెచ్చేందుకు యత్నిస్తున్నామని వెల్లడించారు. కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉన్నా స్పందించడం లేదని, ఏపీ వినని పక్షంలో ఏం చేయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను పూర్తిగా చదవకుండానే కాంగ్రెస్‌ నేతలు అనవసర ఆందోళన చెందుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top