పేదోడి ఇంటి కల నిజం చేసింది వైఎస్సార్‌ | Selection of Indiramma House beneficiaries beyond politics | Sakshi
Sakshi News home page

పేదోడి ఇంటి కల నిజం చేసింది వైఎస్సార్‌

Mar 26 2026 2:14 AM | Updated on Mar 26 2026 2:14 AM

Selection of Indiramma House beneficiaries beyond politics

ఆయన హయాంలోనే 21 లక్షల ఇళ్లు : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంప్రతిష్టాత్మకం... ఏప్రిల్‌ మొదటి వారంలో 1.12 లక్షల ఇళ్లిస్తాం 

రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక... స్థానికసర్పంచ్‌లకూ పూర్తి అధికారం 

ఇళ్లలో ఉండకుంటే ఇతరులకు కేటాయింపు... ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టోల్‌ ఫ్రీ నంబర్‌

సాక్షి, హైదరాబాద్‌: పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా భావించే సొంతింటి కలను పెద్ద ఎత్తున నిజం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయన హయాంలోనే అత్యధికంగా 21 లక్షల ఇళ్లు పేదలకు కట్టించారని తెలిపారు. తిరిగి తమ ప్రభుత్వమే ఈ స్థాయిలో  ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తోందని చెప్పారు. 

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్‌ శంకర్‌ తదితరులు లేవనెత్తిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంశం సుదీర్ఘ చర్చకు దారితీసింది. అధికార, విపక్ష సభ్యులు ఈ అంశంపై పలు ప్రశ్నలు వేశారు. వీటన్నింటికీ మంత్రి పొంగులేటి బదులిచ్చారు. పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. 99 రోజుల ప్రణాళికలో దీనికే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏప్రిల్‌ మొదటి వారానికి 1.12 లక్షల ఇళ్లు అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం, పంపిణీ పూర్తి చేస్తామన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో 2,31,206 ఇళ్లు మంజూరు చేశారని, వీటిల్లో 1,62,936 ఇళ్లు కొన్ని మౌలిక వసతులు మినహా పూర్తయినట్టు తెలిపారు. నాణ్యత విషయంలో వచ్చిన ఆరోపణలపై థర్డ్‌ పార్టీ విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా వచ్చే సందేహాలను వెంటనే    నివృత్తి చేస్తామన్నారు.  

లబ్ధిదారులు నివాసం ఉండడం లేదు 
ఇళ్లు కేటాయించినా, చాలాచోట్ల లబ్ధిదారులు నివాసం ఉండడం లేదని మంత్రి తెలిపారు. అధికారులతో దీనిపై ఇటీవల సమీక్షించినట్లు చెప్పారు. దీనిపై 6,500 మందికి నోటీసులిస్తే, 4,500 మంది మాత్రమే స్పందించారని వెల్లడించారు. మరో రెండు నెలల్లో లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లకపోతే, ఆ ఇళ్లను అర్హులైన ఇతరులకు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే కేటాయించిన 12 వేల ఇళ్లలోకి లబ్ధిదారులు వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయిస్తామని, పాత కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే ఇతరులకు అప్పగిస్తామని వెల్లడించారు. 

ఇందిరమ్మ కమిటీలు వేసినా, ఆ గ్రామ సర్పంచ్, పట్టణాల్లో వార్డు కౌన్సిలర్లకు అధికారాలుంటాయని చెప్పారు. వారి సిఫారసులను కలెక్టర్‌ పరిశీలిస్తారని, అంతిమంగా ఇన్‌చార్జి మంత్రి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రాంతంలో షాపులను అమ్మడం కాకుండా, లీజుకు ఇవ్వాలన్న సభ్యుల ప్రతిపాదనను మంత్రి తోసిపుచ్చారు. 

లీజుకు తీసుకున్న వ్యక్తి అద్దె కట్టడని, ఖాళీ చేయడని, కొత్త సమస్యలు వస్తాయన్నారు. ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా అమ్మేసి, ఆ డబ్బును ఆ కాలనీ అసోసియేషన్, మున్సిపాలిటీ, లేదా గ్రామ పంచాయితీ జాయింట్‌ అకౌంట్‌లో ఉంచుతామన్నారు. వడ్డీతో అపార్ట్‌మెంట్‌ నిర్వహణ సాధ్యమవుతుందని చెప్పారు.  

వైఎస్‌ హయాంలో సంతృప్తి : స్పీకర్‌ 
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్లపై ప్రజల నుంచి పూర్తి సంతృప్తి వచ్చిందని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఇళ్ళ కేటాయింపు, నిర్మాణాలపై శాసనసభ్యులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మంత్రి పొంగులేటి బదులిస్తున్న సమయంలోనూ ‘రివ్యూ కమిటీ పెడుతున్నారా? లేదా?’అంటూ ఆయన ప్రశ్నించారు. త్వరలోనే సమీక్ష చేపడతామని మంత్రి బదులిచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement