వాడీవేడిగా పరకాల మండల సర్వసభ్య సమావేశం 

Sarpanch Fires On IB AE In Warangal - Sakshi

సాక్షి, పరకాల(వరంగల్‌) : మండల పరిధి లక్ష్మీపురం గ్రామంలో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణం విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా బిల్లులు చేస్తున్నారు.. కనీసం సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకపోవడం ఏంత వరకు సమంజసం.. అధికారి అనే విషయం మరిచి బ్రోకర్‌గా మారావంటూ ఐబీ ఏఈపై సర్పంచ్‌ ఆముదాలపల్లి మల్లేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ స్వర్ణలత అధ్యక్షతన బుధవారం పరకాల మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా సమావేశానికి హాజరుకాని శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు కోరారు.

సర్వసభ్య సమావేశానికి వరుసగా మూడు సార్లు హాజరుకాకుండా ఉన్న ఎక్సైజ్‌ అధికారుల తీరుపై మండిపడిన సభ్యులు.. వారిపై చర్య తీసుకోవాలని, ఈ మేరకు కలెక్టర్‌కు నివేదికను పంపాలని తీర్మానం చేశారు. అలాగే.. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి కొత్తవి నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. కోవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు 16 రకాల ఐటెమ్స్‌తో పాటు రూ.2వేల నగదు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నందున మృతుల జాబితా సిద్ధం చేయాలని, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలకు విద్యుత్‌ లైన్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

కామారెడ్డిపల్లె, వెల్లంపల్లి గ్రామాల్లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీలను అరికట్టాలని సర్పంచ్‌లు రాజమౌళి, కృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు సిలువేరు మొగిళి, వైస్‌ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ నాగరాజులతో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

చదవండి: ఇంటి నుంచి పారిపోయి ... హిజ్రాగా మారి!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top