నేరాలపై మూడో కన్ను!  | Sakshi
Sakshi News home page

నేరాలపై మూడో కన్ను! 

Published Sun, Feb 27 2022 3:52 AM

Police Department Set Up Large Number Of CCTV Cameras In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు, సైబర్‌ నేరాలు.. ఇలా నేరం ఏదైనాసరే రాష్ట్ర పోలీసుశాఖ చిటికెలో తేల్చేస్తోంది. భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు ఓవైపు, అత్యాధునిక టెక్నాలజీ మరోవైపు ఆయుధాలు చేసుకుని నేరస్తుల పని పడుతోంది. ఏటా వేలకొద్దీ కేసులను కొన్ని గంటల్లోనే ఛేదిస్తోంది. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటూ.. నేరాలు, ముందు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సాంకేతికత వినియోగంలో ఏటేటా మరింత ముందుకు వెళుతోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యాన్ని మరికొద్ది రోజుల్లో చేరుకోబోతోంది. 

ఇప్పటివరకు 8.6 లక్షల కెమెరాలు 
రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 8.60 లక్షల కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగతా వాటిని కూడా కొద్దిరోజుల్లో పూర్తిచేసి.. మొత్తం వ్యవస్థను త్వరలో అందుబాటులోకి రానున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ, ఏం జరిగినా ఈ సెంటర్‌ నుంచి అప్‌డేట్‌ చేసేలా, సమస్యను నిమిషాల్లో పరిష్కరించేలా వ్యవస్థ అందుబాటులోకి రానుందని పోలీస్‌ అధికారులు చెప్తున్నారు. మరోవైపు పోలీసు విభాగాల ఆధునీకరణ కూడా కేసుల పరిష్కారానికి మరింత వెన్నుదన్నుగా నిలుస్తోంది. 

సోషల్‌ మీడియాలోనూ 
ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా పలు వేదికల ద్వారా వచ్చే ఫిర్యాదులు, పోస్టులపైనా పోలీసుశాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 1.47 లక్షల పోస్టులపై పోలీస్‌ శాఖ స్పందించింది. అంతేకాదు ట్రాఫిక్‌ నిబంధనలు, సైబర్‌ దోపిడీ, ఇతర ముందస్తు జాగ్రత్తలు, నిబంధనలపై లక్షల మందికి అవగాహన కల్పించింది.

స్కూళ్లు, కాలేజీలు, ఇతర వేదికల ద్వారా 53.5 లక్షల మంది మహిళలు, చిన్నారులకు, సైబర్‌ నేరాలపై 2.1 లక్షల మందికి అవగాహన కల్పించినట్టు అధికారులు తెలిపారు. అటు కళా బృందాల ద్వారా కూడా లక్షల మందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించామని.. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా 10 లక్షల మందిని చేరుకున్నామని వివరించారు. 

కేసులను వేగంగా ఛేదిస్తూ.. 
ఓవైపు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు, మరోవైపు ఆధునీకరించిన విభాగాల పనితీరుతో.. నేరాల అదుపుతోపాటు కేసుల ఛేదింపు పెరుగుతోంది. 2021లో సీసీ కెమెరాల సాయంతోనే ఏకంగా 23 వేల కేసులు ఛేదించినట్టు అధికారులు చెప్తున్నారు. అదే 2020లో సీసీ కెమెరాల ద్వారా ఛేదించిన కేసులు 4,490 మాత్రమే. 
ఇక ఆధునీకరించిన ఫింగర్‌ ప్రింట్స్‌ విభాగం ద్వారా 2020లో 300 కేసులను, 2021లో 480 కేసులను ఛేదించారు. వేలిముద్రల ద్వారా 37 గుర్తుతెలియని మృతదేహాలు ఎవరివో తేల్చగలిగారు. 
మొబైల్‌ యాప్‌ ద్వారా 2020లో 3,100 అనుమానితులను గుర్తించగా.. 2021లో 5,624 మంది అనుమానితులను గుర్తించారు. 
బాధితులకు త్వరగా న్యాయం జరిగేందుకు నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్‌లూ పెరుగుతున్నాయి. 2020లో 517 జీరో ఎఫ్‌ఐఆర్‌లు చేయగా, 2021లో 838 నమోదైనట్టు అధికారులు తెలిపారు. 
బాధితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు రాకుండానే ఆన్‌లైన్‌ ద్వారా దాఖలు చేస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా పెరిగింది. ఇలా 2020లో 2,626 ఫిర్యాదులు అందగా.. 2021లో ఏకంగా 10,656 ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో అందినట్టు అధికారులు వెల్లడించారు. 
ఇక మొబైల్‌ యాప్‌ హ్యాక్‌ ఐ ద్వారా 83,355 ఫిర్యాదులు అందగా, డయల్‌ 100 ద్వారా 11.24 లక్షల కాల్స్‌ను పోలీస్‌ సిబ్బంది అందుకున్నారు. 
సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ కింద ఏర్పాటు చేసిన సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ద్వారా 808 కేసుల్లో 426 కేసులను ఛేదించారు. 
మొబైల్‌ క్లూస్‌ టీంల ద్వారా 2,969 ఘటనల్లో 1,638 కేసులను తేల్చారు.  
‘వీడియో ఎన్‌హాన్స్‌మెంట్‌ ల్యాబ్‌’ద్వారా వివిధ ఘటనలకు చెందిన 7,460 వీడియోల్లో.. 2,283 వీడియోలను బాగా మెరుగుపర్చి కేసుల దర్యాప్తులో వినియోగించారు. 
డేటా అనలిటిక్స్‌ యూనిట్‌ ద్వారా 37,563 కేసులను తేల్చారు. 
నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు వచ్చి తప్పించుకు తిరుగుతున్న 94మంది నిందితులను ‘పాపిలాన్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌’ద్వారా పట్టుకున్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement