వాట్సాప్‌ యూనివర్సిటీ వైద్యం.. వారి సలహాలు వింటే సరి.. లేదంటే ప్రాణాలు హరీ!

People Accustomed To Their Own Medicine Without Doctor Prescription - Sakshi

మందులు ఎక్కువగా వాడటంతో సమస్యలు

ప్రాణాపాయస్థితికి తెచ్చుకుంటున్నారంటున్న వైద్యులు 

సొంత వైద్యాన్ని నియంత్రించాలంటున్న ఎంఐఏ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో ‘వాట్సాప్‌ విశ్వవిద్యాలయం’లో వైద్య విధానాలు, చికిత్సపై సలహాలు వెల్లువెత్తడంతో చాలా మంది సొంత వైద్యానికి అటవాటుపడ్డారు. డాక్టర్ల సూచన లేకుండా ఇష్టానుసారం మెడికల్‌ షాపుల్లో ‘ఓవర్‌ ద కౌంటర్‌’వివిధ రకాల మందులు తీసుకోవడం చేటు తెస్తోంది. వీటిలో నిద్రమాత్రలు, సైకియాట్రీ, హాలోజినేషన్‌ తదితర మందులున్నాయి. ఇవి ప్రమాదకరంగా మారి బాధితుడిని ప్రాణాపాయస్థితికి తీసుకెళ్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు సూచించకుండా సొంతంగా ఈ మందులను వాడరాదు.

ఈ సమస్యపై వైద్య వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని నియంత్రించాలని, ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ).. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, డైరెక్టర్‌ ఆఫ్‌ కం ట్రోలర్‌ డ్రగ్స్‌కు లేఖలు కూడా రాసింది. ఏ మందు అయినా దీర్ఘకాలం వాడాల్సి వస్తే డాక్టర్ల ద్వారా నిర్ధారణ చేసుకున్నాకే తీసుకోవాలి.

నవీన జీవనశైలి అలవాట్లతో వాకింగ్, ఎక్సర్‌సైజులు, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎండ తగలకుండా ఇళ్లు, ఆఫీసుల్లోనే పరిమితం కావడం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పోషకాలిచ్చే సమతుల ఆహారం తీసుకోకపోవ డం, జంక్‌ ఫు డ్‌/ ఫాస్ట్‌ఫుడ్, మసా లాల మోతాదు ఎక్కువగా ఉండే స్పైసీ ఫుడ్, ఎండలో అరగం ట నిలబడటానికి బదులు విటమిన్‌–డి టాబ్లెట్లకు అలవాటుపడుతున్నారు. అనవసర మందుల వినియోగంపై వైద్యనిపుణులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

తోచిన మందులు ఎక్కువ మోతాదులో...
తమకు తోచిన మందులు ఎక్కువ మోతాదులో వేసుకుని తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్‌ తీవ్ర ప్రభావం చూపిన ఈ రెండేళ్లలో ఈ ధోరణి మరింత పెరిగింది. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో వచ్చిన వారిని పరిశీలిస్తే ఇతర రోగాలు బయటపడుతున్నాయి. వారానికి ఒకసారి వేసుకోవాల్సిన టాబ్లెట్‌ రోజూ వేసుకోవడంతో కాలేయం దెబ్బతిని కొందరు రోగులు వచ్చారు.

రక్తం పలుచన చేసే మందులు రెండు వారాలే వాడాలని చెబితే 6 నెలలు వాడిన మరో బాధితుడిని తీవ్ర అనారోగ్యంతో మా వద్దకు తీసుకొచ్చారు. సోరియాసిస్‌కు ఫోలిట్రాక్స్‌ అనే మెడిసిన్‌ వారానికి ఒకటి వాడాల్సి ఉండగా, రోజూ వాడటంతో ఒకరి లివర్‌ దెబ్బతింది. విటమిన్‌–డి తక్కువగా ఉన్న వారికీ కొన్ని వారాలే వాటిని వాడాలని సూచించినా సుదీర్ఘకాలం ఉపయోగించి తీవ్ర ఇబ్బందులకు గురైన వారున్నారు.     
– డా.విశ్వనాథ్‌ గెల్లా, డైరెక్టర్‌ పల్మనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్, ఏఐజీ ఆసుపత్రి 

యాంటీ బయాటిక్స్‌ అధికంగా వాడటం వల్ల...
కోవిడ్‌ కాలంలో కషాయాలు, రసాలు, పొడులు, వేడివేడి ద్రవ పదార్థాలు ఇలా రకరకాల సొంత వైద్యాలు ఎక్కువ మోతాదులో వాడిన వారు ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజీ, జీర్ణకోశ సమస్యల బారినపడుతున్నారు. ప్రతీ దానికి డోలో 650, ఇతర పారాసిటమాల్, యాంటీ బయాటిక్స్‌ అధికంగా వాడటంతో కాలేయం విషపూరితం అవడం లాంటి సమస్యలొస్తున్నాయి.

కరోనా రెండు దశల్లో అజిత్రోమైసిన్‌ వాడటంతో మూడోదశలో కొందరికి అది పనిచేయని పరిస్థితి ఏర్పడింది. మధుమేహ బాధితులు తమ 3 నెలల హెచ్‌బీ ఏఎన్‌సీ పరీక్షించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులు, ఎక్కువ డోసులు తీసుకుంటే హైపోగ్లైజేమియాతో రక్తంలో చక్కెర శాతాలు పడిపోయి కోమాలోకి వెళుతున్న వారూ ఉన్నారు. 
– డా. ప్రభుకుమార్‌ చల్లగాలి, క్రిటికల్‌కేర్‌ నిపుణులు, డయాబెటాలజిస్ట్‌  

బ్లడ్‌ థిన్నర్స్‌ అవసరం లేకపోయినా.. 
లాంగ్‌ కోవిడ్‌ సమస్యల్లో భాగంగా అలసట, నీరసం వంటివి ఉండటంతో జింక్‌తో కూడిన మల్టీవిటమిన్లు తీసుకున్నారు. శరీరంలో జింక్‌ శాతం ఎక్కువగా ఉంటే ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంది. దీంతోనే గతంలో బ్లాక్‌ ఫంగస్‌ వంటి సమస్యలొచ్చాయి. బ్లడ్‌ థిన్నర్స్‌ అవసరం లేకపోయినా.. అవి వాడటంతో గుండెపోటు వచ్చినవారున్నారు. జీర్ణకోశ సమస్యలు–కడుపుల్లో రక్తం కారడం, పైల్స్, గ్యాస్ట్రో ఇంటెస్టయిన్‌ బ్లీడింగ్‌ జరుగుతున్నాయి.  
– డా.ఎ.నవీన్‌కుమార్‌ రెడ్డి, జనరల్‌ ఫిజీషియన్, నవీన్‌రెడ్డి ఆసుపత్రి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top