రోగం వచ్చిందా.. మూడు రోజులు ‘ఓపి’క పట్టు!

NIMS Outpatient Services Are Late Patients Suffering With Negligence - Sakshi

ఓపీ టు ఐపీ బీపీనే

నిమ్స్‌లో అన్ని సేవలూ ఆలస్యమే

చీటీ ఆలస్యమే..రిపోర్టులూ జాప్యమే 

చికిత్స మాట దేవుడెరుగు.. తిప్పించుకోవడమే ఆస్పత్రి నైజం 

నైట్‌ షెల్టర్లలో రోగుల నిరీక్షణ 

సిబ్బంది నిర్లక్ష్యంతో అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు

సాక్షిరిపోర్ట్‌

న్యూరో సంబంధిత సమస్యతో బాధపడుతున్న స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన జనార్దన్‌ చికిత్స కోసం ఉదయం ఏడు గంటలకు నిమ్స్‌ అవుట్‌ పేషెంట్‌ విభాగానికి చేరుకున్నాడు. ఎనిమిది గంటలకు ఓపీ కార్డు తీసుకుని న్యూరో ఓపీ విభాగంలోని వైద్యుడి వద్దకు చేరుకున్నాడు. పరీక్షించిన వైద్యుడు బ్రెయిన్‌ సీటీ సూచించాడు. వైద్యుడు రాసిన ఆ చీటీ తీసుకుని ఆస్పత్రిలోని డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వెళ్లగా అప్పటికే అక్కడ పది మంది వెయింటింగ్‌లో ఉన్నారని, మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు రావాల్సిందిగా టెక్నీషియన్‌ సూచించారు. ఆ మేరకు రిజిస్ట్రర్‌లో పేరు నమోదు చేసుకుని పంపించాడు.

మెడికల్‌ రిపోర్ట్‌ వస్తే కానీ మందులు రాయలేని పరిస్థితి. అలాగని తిరిగి ఇంటికి వెళ్లలేని దుస్థితి. చేసేది లేక ఆ రోజు రాత్రంతా ఎమర్జెన్సీ ముందు ఉన్న నైట్‌షెల్టర్‌లో నిరీక్షించి.. మరుసటి రోజు ఉదయాన్నే లేచి సిటీ స్కాన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. తీరా స్కాన్‌ చేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే రిపోర్ట్‌ ఇస్తామని చెప్పడంతో చేసేది లేక మళ్లీ అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు రిపోర్ట్‌ తీసుకుని ఓపీకి వెళ్తే..తీరా అక్కడ వైద్యుడు లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది ఒక్క జనార్దన్‌కు ఎదురైన చేదు అనుభవం మాత్రమే కాదు.. తలనొప్పి, నడుం నొప్పి, కీళ్లనొప్పులు, హృద్రోగ, కిడ్నీ, కాలేయ, ఉదరకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనేక మంది రోగులకు నిమ్స్‌లో ఇదే అనుభవం ఎదురవుతోంది. 

సాక్షి, సిటీబ్యూరో/నిమ్స్‌: ప్రతిష్టాత్మక నిమ్స్‌లో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఓపీ చిట్టీల కోసం ఉదయం ఆరుగంటలకే క్యూ కట్టినా..డాక్టర్‌కు చూపించుకుని..మందులు తీసుకొని బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం ఆరవుతోంది. ఒక్కోసారి టెస్టులు రాస్తే వైద్యానికి రెండు మూడు రోజులు పడుతోంది. 1500 పడకల సామర్థ్యం ఉన్న నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అవుట్‌ పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున 1400–1600 మంది వస్తుంటారు. నగదు చెల్లింపు రోగులే కాకుండా ఆర్టీసీ, ఈఎస్‌ఐ, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఎక్కువగా వస్తుంటారు. ఉదయం 8 గంటలకు ఓపీ ప్రారంభమై 2.55 గంటలకు ముగుస్తుంది.

బాధితుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేక ఓపీ కార్డుల కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వస్తుంది. తీవ్ర నిరీక్షణ తర్వాత ఓపీ కార్డు తీసుకుని కేటాయించిన వైద్యుడి గదికి చేరు కుంటే అప్పటికే అక్కడ భారీగా క్యూలైన్‌ ఉంటుంది. వైద్యులు పరీక్షించి రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, సిటీ స్కాన్‌ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిందిగా సూచిస్తున్నారు. ఒక్కో ల్యాబ్‌ ఒక్కో భవనంలో ఉండటంతో వీటి గుర్తింపు రోగులకు కష్టంగా మారుతుంది. అటు ఇటు తిరిగి డయాగ్నోస్టిక్‌కు చేరుకుంటే అక్కడ కూడా నిరీక్షణ తప్పడం లేదు. రిపోర్టుల జారీలోనూ తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. మెడికల్‌ రిపోర్టులు చూడకుండా మందులు రాసే పరిస్థితి లేకపోవడం, తీరా రిపోర్టు తీసుకుని వెళ్లే సమయానికి ఓపీలో వైద్యులు లేకపోవడంతో రెండు మూడు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షించాల్సి వస్తుంది. అప్పటికే రోగం మరింత ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది.    

పైరవీ ఉంటేనే ఎమర్జెన్సీలో పడక కేటాయింపు 
వంద పడకల సామర్థ్యం ఉన్న అత్యవసర విభాగానికి రోజుకు సగటున 15–25 మంది వస్తుంటారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, హృద్రోగులు, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉంటారు. ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది తీరా ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత వెంటిలేటర్‌పై వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, వైద్య సిబ్బంది లేకపోవడంతో అడ్మిషన్‌ దొరకడం కష్టంగా మారుతోంది.  

► ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అధికారులతో ఫోన్‌ చేయించి ఒత్తిడి తెప్పిస్తే కానీ పడక దొరకని దుస్థితి.  
► ఇదిలా ఉంటే అత్యవసర విభాగాల్లో 36 ట్రాలీలు ఉండగా, వీటిలో 15 రిపేరులో ఉన్నాయి. 26 వెంటిలేటర్లు ఉండగా వీటిలో 6 సాంకేతిక సమస్యలతో మూలకు పడ్డాయి.   u ఒక వెంటిలేటర్‌కు ఒక స్టాఫ్‌ నర్సు అవసరం కాగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో 15 మంది ఉంటే, మొదటి అంతస్తులో తొమ్మిది మంది స్టాఫ్‌ నర్సులు మాత్రమే పని చేస్తున్నారు.  
► అంతేకాదు కన్సల్టెంట్‌ డాక్టర్లు వార్డుకు వచ్చి రౌండ్స్‌ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఫలితంగా అత్యవసర విభాగం నుంచి ఆయా వార్డులకు కేసులను తరలించడంలోనూ జాప్యం చోటు చేసుకుని పడకల సమస్య తలెత్తుతుంది. 
► ఎమర్జెన్సీ విభాగంలో పడకల సంఖ్యతో పాటు స్టాఫ్‌ నర్సులు, డ్యూటీ మెడికల్‌ డాక్టర్ల సంఖ్యను పెంచడం ద్వారా కొంత వరకు సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యుడు అభిప్రాయపడ్డారు. 

రెండు మూడు రోజులు అవుతోంది... 
నాణ్యమైన వైద్యం దొరుకుతుందనే నమ్మకంతో వచ్చా. కానీ ఇక్కడ ఓపీ కార్డు తీసుకోవడం మొదలు, వైద్యుడికి చూపించుకోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, మందులు రాయించుకుని వెళ్లడం ఇలా అన్ని చోట్ల ఆలస్యమవుతోంది. సాధారణ చికిత్సకూ రెండు మూడు రోజుల సమయం పడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లం రాత్రిపూట ఎక్కడ ఉండాలో తెలియక ఆస్పత్రి ఆవరణలోనే చలికి వణుకుతూ, తిండి తిప్పలు లేకుండా ఉన్నాం.    
– మల్లేష్, గజ్వేల్‌ 

ఇతర ఆస్పత్రులను డెవలప్‌ చేయాలి 
ప్రభుత్వం గతంలో జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని కడుతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో తెలంగాణ నలుమూలల నుంచి రోగులు ఇక్కడికే వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వైద్య సిబ్బంది లేక ఆస్పత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించలేని దుస్థితి. ఉస్మానియా, గాంధీ ఇతర ఆస్పత్రులను కూడా నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేయడం ద్వారానే రోగుల రద్దీ తగ్గుతుంది. ఖాళీలను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వచ్చిన రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించే వెసులుబాటు కలుగుతుంది.  
– డాక్టర్‌ జి.శ్రీనివాస్, రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top