నీటి నిర్వహణ కత్తిమీద సామే!

Maintenance Of Godavari Canals Very Burden To Govt - Sakshi

లష్కర్లు లేక కాల్వలను పట్టించుకునే నాథుడేలేరు 

చాలా ప్రాజెక్టుల వద్ద వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆపరేటర్, ఫిట్టర్లు కరువు

రిటైరైన వారితో నెట్టుకొస్తున్న ప్రాజెక్టు ఇంజనీర్లు

2 వేల మందిని నియమించాలని ఇరిగేషన్‌ శాఖ ప్రతిపాదించినా స్పందన కరువు

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింది కాల్వలన్నీ నిండుగా పారుతున్నా నీటి నిర్వహణ ‘కత్తిమీది సాములా’మారింది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నీటి నిర్వహణకు అవసరమైన వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఫిట్టర్లు, లష్కర్‌లు లేరు. దీంతో నీటి నిర్వహణ ఇరిగేషన్‌ ఇంజనీర్లకు అగ్ని పరీక్షలా మారింది. 

సిబ్బందిలేమి.. నీటి పంపిణీకి ఇబ్బంది 
ఎగువ నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం మొదలు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలు ఆరంభమయ్యాయి. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపంపిణీ ఆటంకాల్లేకుండా సాగా లంటే ఆపరేటర్లు, ఫిట్టర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, హెల్ప ర్లు, లష్కర్‌లు, ఎలక్ట్రీషియన్లు కీలకం. రాష్ట్రంలో మొత్తంగా ఈ తరహా సిబ్బంది 6 వేల మంది అవసరముండగా ప్రస్తుతం1,700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వల పరిధిలోని మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రు, బ్రాంచ్‌ కెనాల్‌ల పరిధిలో ప్రతి 6 కిలోమీటర్లకు ఒకరు చొప్పున లష్కర్‌ ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు కూడా లేరు. మొత్తం గా 3,800 మంది లష్కర్లు అవసరముండగా, 1,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు.

కాల్వలకు గండ్లు పడుతున్నా... 
గోదావరి జలాల ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 250 కిలోమీటర్ల మేర కాల్వలు పారుతున్నాయి. దీని పరిధిలో సుమారు 400 మంది లష్కర్లు అవసరముండగా 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. కనీసం 200 మంది లష్కర్లను అత్యవసరంగా నియమించాలని ఏడాదిగా ఇంజనీర్లు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాగార్జునసాగర్‌ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ల కింద 400 మంది లష్కర్లు, 60 మంది ఆపరేటర్లు, 75 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, 20 మంది ఎలక్ట్రీషియన్లు, 15 మంది ఫిట్టర్లు కావాలని ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన సరిగాలేదు. దీంతో ఇక్కడ కాల్వలకు గండ్లు పడుతున్నా, కొన్నిచోట్ల అక్రమంగా కాల్వలను తెంచుతున్నా పట్టించుకునేవారులేరు. కిన్నెరసాని, కడెం, జూరాల, మూసీ, సింగూరు వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా సరిపడా సిబ్బంది లేరు. గత ఏడాది సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top