రూ.73,360 కోట్ల పెట్టుబడికి 190 సంస్థలు
తద్వారా ప్రత్యక్షంగా లక్ష, పరోక్షంగా రెండున్నర లక్షల మందికి ఉపాధి
2026–30 మధ్య కాలంలో 2.35 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా కృషి
సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక రంగానికి లైఫ్ సైన్సెస్ వెన్నుదన్నుగా నిలవనుంది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రావడంతోపాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 190 యూనిట్లకు అనుమతులు మంజూరు చేశామని, తద్వారా రూ.73,360 కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది. తద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది.
అదీకాక.. 2026–30 మధ్య కాలంలో రూ. 2.35 లక్షల కోట్ల (25 బిలియన్ డాలర్లు) పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించింది. తద్వారా ఏకంగా 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీ లైఫ్ సైన్సెస్ రంగానికి కీలకంగా ఉంది. మరిన్ని పెట్టుబడులు రావడానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదం కానుందని సర్కార్ తెలిపింది.
ఈ ఏడాది 1,457 కర్మాగారాలు
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కొత్తగా 1,457 తయారీ కర్మాగారాలకు అనుమతులు ఇచ్చారు. తద్వారా రూ. 7,388 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. తద్వారా 36,919 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పరిశ్రమ ల అధిపతులు ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్‌లో పేర్కొన్నట్లు వెల్లడించింది. కొత్తగా తయారీ రంగంలో వస్తున్న ఈ కర్మాగారాలన్నీ కూడా మేడ్చల్– మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే వస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశ్రామిక వాడల్లోని 2,198 ఎకరాల భూములను పరిశ్రమలకు టీజీఐఐసీ కేటాయించినట్లు తెలిపింది. ఈ భూముల్లో పెట్టుబడుల కింద రూ. 88,534 కోట్లు వచ్చాయని, తద్వారా 75,008 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని వివరించింది.
తయారీ రంగంలో 13 లక్షల మంది కార్మికులు..
రాష్ట్రంలో తయారీ రంగంలోని 21,436 కర్మాగారాల్లో దాదాపు 13 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది. గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్ (జీఎస్‌వీఏ) మొత్తం రూ. 16,48,613 కోట్లు కాగా.. ఇందులో తయారీ పరిశ్రమల రంగం వాటా రూ. 3,04,217 కోట్లుగా ఉంది. ఇందులో తయారీ రంగం వాటా రూ. 1,37,229 కోట్లు (45.1 శాతం), నిర్మాణరంగం రూ. 93,404 కోట్లు (30.7 శాతం), ఎలక్ట్రిసిటీ, యుటిలిటీస్ రంగం రూ. 37,692 కోట్లు (12.4 శాతం), మైనింగ్–క్వారీయింగ్ రూ. 35,892 కోట్లు (11.8 శాతం) గా ఉన్నట్లు వివరించింది.


