ఆర్‌ఆర్‌ఆర్‌.. భూసేకరణకు సిద్ధం!

Land Accquisition Ready To Regional Ring Road - Sakshi

రీజనల్‌ రింగ్‌ రోడ్డులో తొలిసారి క్షేత్ర సర్వేకు రెడీ

కేంద్రం సానుకూలత నేపథ్యంలో పట్టాలెక్కుతున్న తొలి భాగం

బెంగళూరుకు చెందిన కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యత

నెల రోజుల్లో తుది అలైన్‌మెంట్‌ ఖరారు

అప్పటి నుంచి ఏడాదిన్నరలో భూసేకరణ పూర్తి 

మరికొద్ది రోజుల్లో రెండో భాగానికి పచ్చజెండా 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక రీజనల్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి కసరత్తు ప్రారంభం కాబోతోంది. కేంద్రం అధికారికంగా అనుమతి మంజూరు చేయబోతోంది. ఈ నేపథ్యంలో.. తొలిసారి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి సర్వేకు సిద్ధమైంది. ఆ పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టబోతోంది. తాజాగా భూసేకరణ కసరత్తు ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ నడుం బిగించింది. ఇందుకు బెంగళూరుకు చెందిన ఫీడ్‌బ్యాక్‌ బిజినెస్‌ కన్సల్టింగ్‌ సర్వీస్‌ సంస్థను కన్సల్టెన్సీగా నియమించింది. త్వరలో ఈ సంస్థ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించనుంది.

నెలరోజుల్లో అలైన్‌మెంట్‌.. 
రోడ్డు నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం గతంలో కేంద్రానికి ప్రాథ మిక అలైన్‌మెంట్‌ను సమర్పించింది. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా.. ఏయే ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుందో మ్యాప్‌ రూపొందించింది. అప్పట్లో దానికి అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్‌ చేసింది. ఇప్పుడు ఆ రూట్‌లో భాగంగా ఏయే సర్వే నంబర్‌ భూముల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుందో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కింగ్‌ చేస్తారు. ఆ అలైన్‌మెంట్‌లో 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించనున్నారు. ఈ కసరత్తుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

భూసేకరణకు ఏడాది గడువు.. 
ఈ ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని జాతీయ రహదారిగా నిర్మితమవుతున్నందున కొత్త భూసేకణ చట్టం–2013 ప్రకారం సేకరించనున్నారు. ఇందులో కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. ఆ మేరకు అందులో ప్రతిపాదించిన విధంగా భూ పరిహారాన్ని అందిస్తారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆ చట్టంలోని అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. అభ్యంతరాల గడువు, వివాదాల పరిష్కార సంప్రదింపులు.. తదితరాల గడువు కలుపుకొంటే ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని సమాచారం. 158 కి.మీ. తొలి భాగానికి సంబంధించి దాదాపు 4,350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే చోట ప్రత్యేకంగా నిర్మించే క్లోవర్‌ లీవ్‌ ఇంటర్‌చేంజెస్‌కు అదనంగా మరింత భూమి అవసరమవుతుంది.

పరిహారం ఇలా.. 
రిజిస్ట్రేషన్‌ విలువకు 3 రెట్ల మొత్తాన్ని నిర్ధారించి పరిహారంగా అందిస్తారు. గత మూడేళ్లలో ఆ ప్రాంతంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లను పరిశీలించి ఎక్కువ మొత్తం ధరలు ఉన్న వాటిల్లోంచి 50 శాతం లావాదేవీలు పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ధరల్లోంచి సగటు ధరను తేల్చి దాన్ని పరిహార ధరగా నిర్ధారిస్తారు. నిర్మాణాలు, చెట్లకు విడిగా ధరలు నిర్ణయిస్తారు. 
గుర్తించిన పట్టణాలు/ ఊళ్లు ఇవీ.. 
సంగారెడ్డి చేరువలోని పెద్దాపూర్, శివంపేట, లింగోజీగూడ, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, నరసన్నపేట, ఎర్రవల్లి, మల్కాపూర్, రాయగిరి, ఎర్రబెల్లి, సంగెం, చౌటుప్పల్‌ 
తుర్కపల్లి మీదుగా.. 
జగదేవ్‌పూర్‌–భువనగిరి మధ్య రెండు మార్గాలను తాత్కాలికంగా రూపొందించారు. భవనగిరి-ఆలేరు మధ్య జాతీయ రహదారిని దాటేలా ఓ మార్గాన్ని, తుర్కపల్లి మీదుగా మరో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు తుర్కపల్లి మీదుగా ప్రతిపాదించిన మార్గాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. పీర్లపల్లి, తిరుమలాపురం, వాసాలమర్రి, తుర్కపల్లి మీదుగా ఉన్న ప్రస్తుత మార్గానికి చేరువగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. 
త్వరలో రెండో భాగానికి పచ్చజెండా.. 
సంగారెడ్డి–చౌటుప్పల్‌ మధ్య తొలి భాగానికి కేంద్రం అనుమతినివ్వగా, రింగులో రెండో సగం అయిన ఆమన్‌గల్‌-కంది వరకు నిర్మితమయ్యే 181.8 కి.మీ. రెండో భాగానికి కూడా త్వరలో అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత రావటంతో జరిగిన జాప్యం వల్ల దానికి అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లోనే దీనికి కూడా కేంద్రం ఓకే చెబుతుందని రాష్ట్రప్రభుత్వం ఆశాభావంతో ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top