Kondagattu: ఔషధాల ‘కొండగట్టు’

Kondagattu Hills Have Number Herbal Medicinal Trees At Karimnagar - Sakshi

కొండగట్టు క్షేత్రం.. మూలికల నిలయం

333 ఎకరాల విస్తీర్ణంలో 300 రకాల ఔషధ మొక్కలు

మూలికలతో ఎన్నో రోగాలు నయం

శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర ఆచార్యుల పరిశోధనలో వెల్లడి

కొండగట్టు(చొప్పదండి): ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక నిలయం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండపై ఈ క్షేత్రం ఉంది. సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఆరోగ్యం బాగోలేకపోయినా, మతిస్థిమితం సరిగా లేకపోయినా కొద్దిరోజులు కొండపై నిద్రచేస్తే నయం అవుతుందని భక్తుల విశ్వాసం. అయితే కొండపై ఆధ్యాత్మికతతో పాటు ఔషధ మూలికలు ఉన్నాయని ఇటీవల శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర ఆచార్యుల పరిశోధనలో వెల్లడైంది. 333 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై 300 రకాల ఔషధ మూలికల చెట్లు ఉన్నాయని వెల్లడించారు.

ఈ చెట్టుపేరు కుమ్మరిపోనికి. ఇలాంటి మొక్కలు, చెట్లు కొండపై వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుపు రంగులో ఉంటుంది. ప్రత్యేకంగా నిర్మల్‌ కొయ్యబొమ్మల తయారీలో వాడుకోవచ్చు. ఈ మొక్కలను వెటర్నరీ మందుల తయారీకి కూడా వాడుకోవచ్చని, మొత్తంగా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని ‘కుమ్మరిపోనికి’ ఫారెస్టుగా కూడా పిలుస్తారని శాతవాహనయూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి వెల్లడించారు.

333 ఎకరాలు.. 300 రకాల మొక్కలు
కొండగట్టు గుట్ట విస్తీర్ణం 333 ఎకరాల్లో ఉంటుంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూ దాటాక కొండపైకి చేరుకునే మార్గంలో, ఘాట్‌రోడ్డు మార్గంలో, ఆలయం ఆవరణలో 300 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ కొండగట్టు అటవీప్రాంతంపై ఎస్సారార్‌ కళాశాల అధ్యాపకులు పరిశోధన చేశారు. మళ్లీ కొన్నేళ్లతరువాత శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి, విద్యార్థి బాణవత్‌ సురేశ్‌ నాయక్‌ పరిశోధనలు చేయగా.. ఔషధమొక్కల గురించి తెలిసింది. జీవవైవిధ్యపరంగా ఇవి చాలా ముఖ్యమైనవని, వస్తువుల తయారీ, మనుషులు, జంతువుల మందుల తయారీలో ఉపయోగపడతాయని వారు వెల్లడించారు.

మొక్కలు.. లాభాలు
కొండగట్టు ప్రాంతంలో ఉన్నవి గిరి అడవులు(హిల్‌ఫారెస్ట్‌). ఎక్కువగా కుమ్మరిపోనికి చెట్లు ఉంటాయి. ఇవీ తెలుపు రంగులో ఉంటాయి. వృక్షశాస్త్ర పరంగా కైరోకార్పస్‌ అమెరికాన్స్‌గా పిలవబడతాయి. ప్రధానంగా ఎడ్లపాల, పాలకొడిసె, బిల్లుడు, తపసి, ఎర్రబోరుగా, నల్లకోడిసా, అందుకు, నల్లగా, ఎక్కువశాతం కుమ్మరిపోనికి, బ్యూటియా మోనోస్పెర్మ, టేకు, పోంగా, మియాపిన్, ఏటా కానుగు, తెల్లపోనికి, టేకు, నల్లాకోడిషా చెట్లతో పాటు వందల సంఖ్యలో ఔషధమొక్కలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా కొండగట్టులోనే ఇలాంటి ఔషధమొక్కలు ఉన్నాయి. ఇవీ కొండపై ఆక్సిజన్‌ కలుషితం కాకుండా చేస్తాయి. వివిధ రకాల రోగాలు నయమయ్యేందుకు పనిచేస్తాయి. వర్షపాతం నమోదుకు దోహదపడి వర్షాలు పడేందుకు ప్రధానభూమిక పోషిస్తాయి. రామగిరి గుట్టల్లోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయి.

ఇతిహాసం చెబుతోందిదే..!
ఇతిహాసంలో రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడి ప్రాణానికి అపాయం ఏర్పడినప్పుడు హనుమంతుడు సంజీవనిని తీసుకెళ్తున్న క్రమంలో కొండనుంచి ఓ రాయి పడి.. కొండగట్టుగా వెలిసిందని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే వందలాది ఔషధమొక్కలు కొండపై పెరిగాయని, అవన్నీ ప్రాణాపాయంలో, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడేవారికి సంజీవనిగా పనిచేస్తాయని, అందుకే చాలామంది అనారోగ్యంతో బాధపడేవారు కొండపై నిద్రచేస్తే, రోగాలు నయం అవుతున్నాయని భక్తుల విశ్వాసం.

అడవి రక్షణ మనబాధ్యత 
వందలాది ఔషధమొక్కలున్న కొండప్రాంతంలోని అడవిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటికే ఇక్కడ వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. రోడ్డు, రైలుమార్గంతో ప్రజారవాణా పెరుగుతోంది. కొండపైకి వచ్చే భక్తులు విలువైన చెట్లను వంటచెరుకుగా వినియోగించడంతో అడవులు అంతరించిపోతున్నాయి. కొండగట్టు జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు మార్గాలు సిద్ధం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవవైవిధ్యమండలికి అందిస్తాం. రాబోయేకాలంలో గుట్టపై సీట్‌బాల్‌ విసిరేలా సర్కారును కోరుతాం. కొండగట్టు పరిసర ప్రాంతాల వారు, వచ్చే భక్తులకు ఈ విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. మా పరిశోధన కూడా ఇంకా పూర్తికాలేదు... కొనసాగిస్తాం.
– డాక్టర్‌ ఎలగొండ నరసింహమూర్తి, శాతవాహన విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు

మొక్కల సంరక్షణకు కృషి
చెట్లతోనే మానవ మనుగడ. అవిలేకుంటే మనమూ లేము. కొండపై ఉన్న విలువైన ఔషధమొక్కల సంరక్షణ కోసం తోటమాలిని ఏర్పాటు చేశాం. ప్రతీ మొక్కకి నిత్యం నీరు పట్టడమే కాకుండా, నిత్యం సంరక్షిస్తున్నాం. కొండకు వచ్చే భక్తులకు చెట్ల ద్వారా ప్రశాంత వాతవరణం అందుబాటులో ఉంటోంది. నిత్యం నేనూ మై లైఫ్‌.. మై ట్రీస్‌ అనే విధంగా ఉంటా. – వెంకటేశ్, ఈవో, కొండగట్టు

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top