నో డ్యూ ఉంటేనే రిజిస్ట్రేషన్లు

A Key Provisions For Non Agricultural Property Registration - Sakshi

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు కీలక నిబంధన

ఆస్తి పన్నులు, ఇతర చార్జీలు, విద్యుత్‌ బకాయిలు ఉండరాదు 

దరఖాస్తు చేసుకున్న 4 రోజుల్లో నో డ్యూ సర్టిఫికెట్‌

పురపాలికల్లో వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్లకు నిబంధనలు జారీ 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ధరణి పోర్టల్‌ ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ముందు తప్పనిసరిగా సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు సంబంధిత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) నుంచి ‘నో డ్యూ’సర్టిఫికెట్‌ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొ చ్చింది. రిజిస్ట్రేషన్‌ దస్తావేజు ద్వారా వ్యవసాయేతర ఆస్తి యాజమాన్య హక్కుల బదిలీ చేయాలని కోరుకున్నా, విక్రయం, కానుక, తనఖా, బదిలీ చేయాలనుకున్నా ఈ నిబంధన వర్తి స్తుందని స్పష్టం చేసింది. దరఖాస్తు దారుడు తన వీలును బట్టి అందు బాటులో ఉన్న తేదీ, సమయం కోసం ధరణి పోర్టల్‌ ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఆస్తి పన్నులు, ఇతర బకాయిలేవీ లేవని మున్సిపాలిటీ/కార్పొరేషన్‌ నుంచి, విద్యుత్‌ బిల్లుల బకాయిలు ఏవీ లేవని డిస్కంల నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్న 4 రోజుల్లోగా పురపాలికలు, డిస్కంలు నో డ్యూ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో విఫలమైతే.. జారీ చేసినట్లే పరిగణిస్తారు. ధరణి పోర్టల్‌ ద్వారా మున్సిపాలిటీలు/మున్సిపల్‌ కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల మ్యూటేషన్‌ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు–2020ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. 

ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
► వ్యవసాయేతర ఆస్తుల విక్రయం, తనఖా, గిఫ్టు, మార్పిడి (ఎక్స్‌చేంజ్‌)కి జరిపే రిజిస్ట్రేషన్, హక్కుల రికార్డు(రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌)ల్లో యాజమాన్య మార్పుల ప్రక్రియ చేపట్టాలి.
► రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సబ్‌ రిజిస్ట్రార్‌ తేదీ, సమయం కేటాయించి, ఈ వివరాలను అతడికి తెలపాలి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో రిజిస్టర్‌లో పొందుపర్చాలి.
► దస్తావేజు రిజిస్ట్రేషన్‌ రోజు సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ నిర్వహించి, నిర్దేశిత మ్యుటేషన్‌ చార్జీలు తీసుకున్న తర్వాత ఈ మేరకు సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన హక్కుల రిజిస్టర్‌లో తక్షణమే యాజమాన్య హక్కులు మార్పు చేయాలి. విక్రయం, గిఫ్టు, ఎక్స్‌చేంజీ ద్వారా ఆస్తి బదిలీ చేస్తున్న వ్యక్తి ఖాతా నుంచి ఆస్తిని తొలగించి, బదిలీ చేయించుకున్న వ్యక్తి ఖాతాలో జమ చేయడం ద్వారా తక్షణ మ్యుటేషన్‌ పూర్తి చేయాలి.
► తనఖా అయితే, ధరణిలో తనఖా లావాదేవీ వివరాలను రికార్డు చేయాలి. 
► ఆస్తి రిజిస్ట్రేషన్‌లో భాగంగానే మ్యుటేషన్‌ జరగాలి. 
హక్కుల రికార్డుల్లోని వివరాలు..
► మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తులపై హక్కుల రికార్డులను ధరణి పోర్టల్‌లో డిజిటల్‌ రూపంలో తయారు చేసి నిర్వహిస్తారు. ఈ రికార్డుల్లో ఈ వివరాలుంటాయి. 
► మున్సిపాలిటీలు/మున్సిపల్‌ కార్పొరేషన్లు నిర్వహించే ఆస్తుల రిజిస్టర్‌ ప్రకారం ఆస్తి యజమాని పేరు, సదరు ఆస్తిపై వారసత్వం కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు.
► ప్రాంతం (లొకేషన్‌) వివరాలు, రకం, వినియోగం, విస్తీర్ణం
► ఆస్తి యజమాని, కుటుంబసభ్యుల గుర్తింపును రుజువు చేసేందుకు అవసరమైన ఇతర వివరాలు. 
► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్‌ కార్పొరేషన్‌ తన అధీనంలోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలి. ఇందుకు ఒకేసారి అవకాశం ఉంటుంది.
► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్‌ కార్పొరేషన్‌ జారీ చేసే ప్రతి భవన నిర్మాణ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్, ప్లాట్ల అనుమతులను నిర్దేశిత ఫార్మాట్‌లో ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలి. 
ప్రభుత్వ ఆస్తులకు వర్తించదు...
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లేదా వీటి నియంత్రణ పరిధిలో ఉన్న వ్యవసాయేతర ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top