కూతురు పెళ్లికి అప్పు పుట్టక.. | Incident In Papannapet mandal of Medak district | Sakshi
Sakshi News home page

కూతురు పెళ్లికి అప్పు పుట్టక..

Mar 30 2026 3:14 AM | Updated on Mar 30 2026 3:14 AM

Incident In Papannapet mandal of Medak district

తండ్రి ఆత్మహత్య 

వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం 

పాపన్నపేట (మెదక్‌): కూతురు పెళ్లి కోసం అప్పు పుట్టక ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ కథనం ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. వారం  క్రితం ఆయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఇంట్లో పెళ్లి పత్రిక పెట్టుకొని, సాయంత్రం పెద్దల పండుగ చేసుకోవాల్సి ఉంది. 

ఈ మేరకు చుట్టాలకు కబురందించారు. అయితే త్వరలో బిడ్డ పెళ్లి చేయాల్సి ఉండగా, డబ్బులు లేక, అప్పులు పుట్టక ఆందోళన చెందాడు. దిక్కుతోచని స్థితిలో శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు గ్రామ శివారులో వెతికారు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మూతబడిన రైస్‌ మిల్లులో ఉరివేసుకున్నాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. 

పెళ్లి పత్రిక కోసం రావాల్సిన బంధువులు, అంత్య క్రి యలకు రావాల్సి రావడంతో, ఊరంతా శోక సంద్రమైంది. కాగా, పెళ్లి కుమారుని తరపు వారు కట్నం ఆశించకుండానే పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement