అనుభవమే వైద్యం! | Hyderabad People Self Treatment For COVID 19 Virus | Sakshi
Sakshi News home page

అనుభవమే వైద్యం!

Aug 12 2020 8:40 AM | Updated on Aug 12 2020 8:40 AM

Hyderabad People Self Treatment For COVID 19 Virus - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘పెద్దల మాట..చద్దన్నం మూట’ అన్నారు. సామెత పాతదే కావచ్చు. కానీ ఇప్పుడుకోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఇది ఒక ఆయుధంలాపనిచేస్తుంది. పాతవాళ్ల అనుభవాలు..కొత్తవాళ్లకుమార్గనిర్దేశం చేస్తున్నాయి. వైరస్‌ను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందజేస్తున్నాయి. కరోనాబాధితులను చూడగానే బెంబేలెత్తి హడలిపోయే దశ నుంచి వారి అనుభవాలనే పాఠాలుగా స్వీకరించి స్ఫూర్తిని పొందే దశ  మొదలైంది. వైరస్‌ ఉధృతి
పెరగడం, అన్ని ప్రాంతాలకు, అన్ని కాలనీలకువిస్తరించడం సాధారణమైంది. ఇదే సమయంలో కరోనా వైరస్‌ పట్ల భయాందోళనకు గురికాకుండా అప్రమత్తత పాటిస్తున్నారు. ఇందుకోసం  ఒకవైపు టెలీమెడిసిన్‌ ద్వారా వైద్య నిపుణుల నుంచి చికిత్స, సలహాలు తీసుకొంటూనే పాత పేషెంట్‌లు వినియోగించిన మందులు, వైద్యం, పాటించిన పద్ధతులను ఆరా తీస్తున్నారు.

పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో పాటు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం భవిష్యత్తులో తమకు వైరస్‌ సోకితే ఎలా బయటపడాలో తెలుసుకొనేందుకు ఈ అనుభవాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఈ అనుభవాలు సామాజిక మాధ్యమాల్లోనూ విరివిగా వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ఇంట్లో ఒక్కరికి, ఇద్దరికి కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత తిరిగి అదే ఇంట్లో కొత్తగా ఇంకెవరికైనా వైరస్‌ సోకినప్పుడు కూడా ఇలాంటి అనుభవాలే వైరస్‌ నియంత్రణకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘సాధారణ లక్షణాలకే బెంబేలెత్తి ఆసుపత్రుల వెంట పరుగులు తీయకుండా మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. కానీ  ‘పాజిటివ్‌’ నుంచి  ‘నెగెటివ్‌’గా మారే వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవైపు సర్కార్‌ దవఖానాలు భవిష్యత్తుపై భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. నాణ్యమైన వైద్యం కొరవడుతోంది. మరోవైపు ప్రైవేట్‌ ఆసుపత్రులు నిలువునా దోచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ, మధ్యతరగతి  ప్రజలు టెలీమెడిసిన్‌ మార్గాన్ని, ఇలాంటి అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని వైరస్‌ నుంచి  బయటపడుతున్నారు.  

టెస్టులకు సైతం నో.... 
కొండాపూర్‌కు చెందిన సురేష్‌కు (పేరు మార్చాం) జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. ఒంట్లో నీరసంగా అనిపించింది. టెస్టుకు  వెళితే కచ్చితంగా పాజిటివ్‌ వస్తుందని  తెలిసిపోయింది. మరో ఆలోచనకు తావు లేకుండా కరోనా వైద్యం ప్రారంభించాడు. అప్పటికే వ్యాధి నుంచి కోలుకున్న తన స్నేహితుల అనుభవాలు  ఇందుకు దోహదం చేశాయి. వారం రోజుల్లో సాధారణ స్థితికి వచ్చాడు. ఒక్క సురేష్‌ మాత్రమే కాదు. ప్రస్తుతం చాలామంది ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. పటాన్‌చెరుకు చెందిన శ్రీనివాస్‌ ఇటీవల యాంటిజెన్‌ టెస్టుకెళ్లాడు. కానీ అతనికి అప్పటికే వైరస్‌ వచ్చి నయమైనట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్ది  రోజులుగా జలుబు, ఇతర లక్షణాల కోసం అతడు వాడిన మందులే ఈ నెగెటివ్‌ ఫలితాన్ని ఇచ్చాయి. ఆ తరువాత తమ ఇంట్లో మరో ఇద్దరికి వైరస్‌ సోకినప్పుడు ఏ మాత్రం భయాందోళనకు గురికాకుండా డాక్టర్‌ సలహాలు, సూచనలకు తన అనుభవాలను సైతం జోడించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చాడు.   

టెస్టులు అందుకే తగ్గాయా... 
కొద్ది రోజుల క్రితం వరకు నగరంలో 2000కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం సగానికి సగం తగ్గాయి. వైరస్‌ ఉధృతి తగ్గడమే కాదు. టెస్టుల కోసం వచ్చేవాళ్ల సంఖ్య కూడా తగ్గడమే ఇందుకు కారణమని పలు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల పట్ల విముఖత చూపుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానాల్లో  టెస్టుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయడం ఒక  కారణమైతే ఒంట్లో కనిపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవడం మంచిదనే భావన, తమకు తెలిసిన వాళ్లు కరోనాను జయించిన తీరు ఇందుకు కారణమవుతున్నాయి. 

సామాజిక మాధ్యమాలే వేదికలు.... 
కరోనాను జయించిన వాళ్లు తమ అనుభవాలను ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దినచర్యలతో పాటు మందులు, నియమాలను, ఆరోగ్యసూత్రాలు తెలియజేస్తున్నారు.  

ఏం తెలుసుకుంటున్నారంటే.... 
రోజువారి దినచర్య, మందులు, ఐసోలేషన్‌లో పాటించవలసిన నియమాలు..
యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతుల వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకొనే తీరు.
ఉదయం నుంచి రాత్రి వరకు తీసుకోవలసిన ఆహారం, ఇతర వ్యాయామాలు.  
టెలీ మెడిసిన్‌లో డాక్టర్‌లు ఇచ్చే సలహాలు, సూచనలకు తోడు ఇవి మరింత బలాన్నిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement