Diwali: బాణసంచా కాల్చేవేళ..  జాగ్రత్తలిలా.. 

Hyderabad: Important Firecrackers Safety Precautions For Diwali - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే 2, 3 రోజులలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ స్థాయి అనుమతించదగిన పరిమితి కంటే 200 రెట్లు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల పని తీరుపై క్రాకర్స్‌ ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన కోవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం అంటున్నారు. ఆరోగ్యంపై దీపావళి క్రాకర్స్‌ ప్రతికూల ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరివైనా ఊపిరితిత్తులు ఇప్పటికే వ్యాధి తాలూకు దు్రష్పభావాలు కలిగి ఉంటే, క్రాకర్స్‌ వెలువరించే దట్టమైన విషపూరితమైన పొగకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మరింత దెబ్బతినడం సహా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయవచ్చు.  

శ్వాస కోస వ్యవస్థకు హాని... 
►‘క్రాకర్స్‌ హానికరమైన వాయు కాలుష్యాలను కలిగి ఉంటాయి  కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి వాయు పదార్థాలు  శ్వాసకోశ లైనింగ్‌ (శ్లేష్మ పొర)కు హాని కలిగిస్తాయి. ఆస్తమా, అలర్జీ రోగులకు సమస్యగా పరిణమిస్తుంది. ఇప్పుడు వీరికి మాత్రమే కాకుండా  కోవిడ్‌  నుంచి కోలుకున్న వారికి కూడా ప్రమాదకరంగా మారింది. భారీ పరిమాణంలో ఫైర్‌ క్రాకర్స్‌కు సంబంధించిన పొగ గాలిలో వ్యాపిస్తున్న సమయంలో ఈ రోగులు ఇంటి లోపలే ఉండడం శ్రేయస్కరం’ అంటున్నారు ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ రాజేష్‌ స్వర్ణాకర్‌. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. 
► ‘కోవిడ్‌ వ్యాధితో బాధపడిన కొందరు రోగుల ఊపిరితిత్తుల పనితీరులో మార్పు వచి్చంది. దీపావళి సందర్భంగా, పరిసర గాలిలో నలుసు పదార్థం ఇతర అస్థిర కర్బన సమ్మేళనాలు అపారంగా పెరుగుతాయి. దీనికి గురైనప్పుడు, దీంతో తీవ్రమైన కోవిడ్‌  బారిన పడి కోలుకున్న వారు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావచ్చు’ అని ఇంటర్వెన్షనల్‌ పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ సమీర్‌  చెప్పారు.  

పెద్దవాళ్ల పర్యవేక్షణ అవసరం.. 
►‘టపాకాయలు కాల్చే సమయంలో ప్రతి చిన్నారి వద్ద పెద్దవారు ఒకరు ఉండి తప్పనిసరిగా వారిని పర్యవేక్షించాలి. ఏవైనా కాలిన గాయాలు, ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్తలను తీసుకోవాలి’ అని ఎల్వీ ప్రసాద్‌     నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ.ఆప్తల్మాలజీ కన్సల్టెంట్, డాక్టరు అనుభా రాఠి సూచించారు.   

► టపాసును కాల్చే సమయంలో పిల్లల్ని ఒంటరిగా వదలవద్దు. రక్షణ ఇచ్చే కంటి అద్దాలను ఉపయోగించాలి. టపాసు వెలిగించే వ్యక్తి నుంచి మిగిలినవారు తగినంత దూరంలో ఉండాలి. క్రాకర్స్‌ వెలిగించడానికి  పొడవైన కొవ్వొత్తి లేదా కాకర పువ్వొత్తిని ఉపయోగించండి.

► దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఉంచుకుని. చర్మం కాలినట్లయితే, కాలినచోట ఎక్కువ నీరు పోయాలి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లండి. సొంత వైద్యం వద్దు. తీవ్రమైన కాలిన గాయాలైతే, మంట ఆరి్పన తర్వాత, ఆ వ్యక్తిని ఒక శుభ్రమైన దుప్పటిలో చుట్టి, వెంటనే ఆసుపత్రికి తరలించాలి. 

►చేతిలో పట్టుకుని టపాకాయలను వెలిగించకండి. వాటిపై వంగి టపాకాయలను వెలిగించవద్దు.  సీసా, రేకు డబ్బా లేదా బోర్లించిన కుండవంటి పాత్రలో పెట్టి టపాకాయలను వెలిగించడం  ప్రమాదకరం. వెలగని టపాకాయల దగ్గరకు వెంటనే వెళ్లకుండా, కొంతసేపు ఆగి వెళ్లండి. టపాసులను జేబులో పెట్టుకోవద్దు. ౖక్రాకర్స్‌ కాల్చే సమయంలో సింథటిక్‌ లేదా వదులుగా ఉన్న దుస్తులు కాక, మందంగా ఉన్న నూలు దుస్తులను మాత్రమే ధరించండి. 

►భారీ గాలులు వీచే సందర్భాల్లో బాణసంచా కాల్చవద్దు. కాలినచోట క్రీమ్‌ లేదా ఆయింట్‌మెంట్‌ లేదా నూనెను పూయకండి. బదులుగా వెంటనే వైద్య సహాయం పొందండి.

శ్వాసకోశ రోగులూ.. జాగ్రత్త..  
బాణసంచా కాల్చడంతో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఊపరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నవారికి  ప్రమాదకరం. శ్వాసకోస వ్యాధి రోగులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకూ ఆ పొగకు 2 రోజుల పాటు దూరంగా ఉండడం మంచిది. కోవిడ్‌ వల్ల గతంలో లంగ్స్‌ దెబ్బతిన్నవారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
 – డా.జి.వెంకటలక్ష్మి,  పల్మనాలజిస్ట్, అమోర్‌ హాస్పిటల్స్‌ 

ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ– అత్యవసర సహాయక నంబర్లు   
040 68102100, 040 68102848, 73311 29653

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top