
జీఎస్టీ రేట్ల శ్లాబ్‌లు తగ్గించడంతో రాష్ట్ర ఖజానాకు భారీ గండి
ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసిన పన్నుల శాఖఅధికారులు.. ఐరన్ అండ్ స్టీల్, ఆటోమొబైల్స్,ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల శ్లాబ్‌ల తగ్గింపు కారణంగా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రమారమి రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఆయా వస్తువుల అమ్మకాలను బట్టి సుమారు రూ.5–7 వేల కోట్లు నష్టం వస్తుందని వాణిజ్య శాఖ వర్గాలు తమ ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది.
జీఎస్టీ శ్లాబ్‌ల హేతుబద్దీకరణ కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనే వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరిన మేరకు అన్ని రంగాల్లో వస్తువుల అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను తెప్పించిన వాణిజ్య పన్నుల శాఖ ఈ మేరకు నష్ట నిర్ధారణ చేసినట్టు సమాచారం.
ఎక్కువగా ఈ రంగాల్లోనే..
కాగా, జీఎస్టీ రేట్ల శ్లాబ్‌లను హేతుబద్దీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని పలు ప్రధాన రంగాల అమ్మకాలపై ప్రభావం చూపనుంది. రాష్ట్రం నుంచి ఎక్కువగా అమ్ముడయ్యే ఐరన్‌న్‌అండ్ స్టీల్, ఆటో మొబైల్స్ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పన్నుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగాలతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాలపై వచ్చే పన్నులు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయి భారీ గండి పడుతుందని ఆ శాఖ వర్గాలంటున్నాయి.
అలాగే టెక్స్‌టైల్స్, సిమెంట్ లాంటి కీలక రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడా కుదుపునకు గురవుతుందని, కొన్ని రంగాల్లో కొంత మేర అమ్మకాలు పెరిగినప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గండి పడటం ఖాయమని ఆ వర్గాలంటున్నాయి. అయితే, జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో ధరలు పెంచాలని ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఈ రెండింటి ధరలు పెరిగే అవకాశముందని కూడా వారు అంటున్నారు.
వివరాల సేకరణకు తంటాలు
జీఎస్టీ ద్వారా ఏ డీలర్ ఏయే సరుకులు, ఎంత మేర అమ్ముతున్నారన్న వివరాలను సేకరించి అంచనాలను రూపొందించడం కష్టతరంగా మారిందని పన్నుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. గతంలో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు డీలర్ కోడ్ నమోదు చేస్తే అన్ని సరుకుల వివరాలు వచ్చేవని, ఇప్పుడు జీఎస్టీలో ఆ వివరాలు అందుబాటులోకి రావడం లేదని, ఈ నేపథ్యంలో ప్రతి డీలర్ ఏ సరుకులు అమ్ముతున్నాడనే వివరాలను క్షేత్రస్థాయి నుంచి తెప్పించి మదింపు చేయాల్సి వస్తోందని పన్నుల శాఖ వర్గాలు అంటున్నాయి.