Telangana: ‘పవర్‌’ఫుల్‌ డిమాండ్‌!

Full Power Demand In Telangana Due To Irrigation Projects - Sakshi

ఎత్తిపోతల పథకాల కింద భారీగా పెరగనున్న విద్యుత్‌ అవసరాలు 

6,520 మెగావాట్ల అవసరం ఉంటుందని అంచనా 

వానాకాలంలో కనీసం 4 నెలలపాటు మోటార్లు నడిపించేలా ప్రణాళిక 

 విద్యుత్‌ అవసరాలపై లెక్కగట్టిన ఇరిగేషన్‌ శాఖ 

విద్యుత్‌ శాఖకు నివేదిక

రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ జూన్, జూలై నాటికి అందుబాటులోకి రానుండటంతో అందుకు అనుగుణంగానే విద్యుత్‌ డిమాండ్‌ ఎన్నడూ లేనంతగా ఉండనుంది. గత ఏడాది వినియోగానికి అదనంగా 3 వేల మెగావాట్లు కలుపుకొని మొత్తంగా 6,520 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలు ఉంటాయని ఇరిగేషన్‌ శాఖ ప్రాథమిక అంచనా. కాళేశ్వరం సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోని పంప్‌హౌస్‌ల్లో కనీసం నాలుగు నెలల పాటు మోటార్లను నడపాల్సి ఉంటుందంటూ లెక్కగట్టింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే కనీసం 4,720 మెగావాట్ల విద్యుత్‌ అవసరాలుంటాయని విద్యుత్‌ శాఖకు నివేదించింది.     –సాక్షి, హైదరాబాద్‌

ప్రధాన ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది వానాకాలం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దేవాదుల, కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్లు, పాక్షికంగా డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే సిద్ధమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ వంటి ఎత్తిపోతల పథకాల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వర్షాలు ఏమాత్రం సహకరించకపోయినా, కృష్ణా, గోదావరిలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోతల పథకాల ద్వారా మళ్లించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటిని తీసుకునే రోజులు, నడపనున్న పంపులు, ఎత్తిపోసే నీళ్లు ఆధారంగా ఎంత విద్యుత్‌ అవసరాలు ఉన్నాయో లెక్కించాలని సూచించారు. ఇప్పటివరకు కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, అలీసాగర్, ఏఎంఆర్‌పీ, దేవాదుల, కోయిల్‌సాగర్‌ వంటి ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి గరిష్టంగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతోంది. అయితే ఈ ఏడాది దేవాదుల కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్కసాగర్‌ బ్యారేజీ నిండిన నేపథ్యంలో దీనికి నీటి లభ్యత పెరగనుంది.

ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో కనీసంగా 20 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఇక్కడి అన్ని ప్యాకేజీల్లో కలిపి 48 మోటార్లు ఉండగా, 500 మెగావాట్లు అవసరమని లెక్కగట్టారు. ఇక పాలమూరులోని ప్రాజెక్టుల కింద కనీసం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కృష్ణాలోకి వచ్చే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లోని 40 మోటార్లు తిరిగినా 800 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుంది. 

కాళేశ్వరం కింద పెరగనున్న డిమాండ్‌ 
ఇక కాళేశ్వరం ద్వారా గత ఖరీఫ్‌లో పెద్దగా ఎత్తిపోతలు జరగలేదు. జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు 15 టీఎంసీలు ఎత్తిపోయగా, అనంతరం మూడు నెలల్లో 35 టీఎంసీలను ఎత్తిపోశారు. దీంతో పెద్దగా విద్యుత్‌ అవసరం పడలేదు. కానీ ఈసారి మేడిగడ్డ మొదలు బస్వాపూర్‌ వరకు రిజర్వాయర్లన్నీ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్‌తో పాటు 11.39 టీఎంసీల సామర్ధ్యం ఉన్న బస్వాపూర్‌ రిజర్వాయర్‌ సిద్ధమవుతోంది.

ఇక 14 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మసాగర్‌ను ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపాలని నిర్ణయించారు. అంటే మేడిగడ్డ నుంచి బస్వాపూర్‌ వరకే కనీసంగా 120 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉంది. దీంతోపాటే ప్రధాన రిజర్వాయర్ల కింద కాల్వల పనులు పూర్తవుతున్నాయి. దీనికి తోడు ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీరందిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం ద్వారా 250–300 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోయాలంటే ఎల్లంపల్లి వరకే 71 మోటార్లను నడపాల్సి ఉంటుంది. దీనికే 3,049 మెగావాట్ల విద్యుత్‌ కావాలి. దీని దిగువన బస్వాపూర్‌ వరకు నీటిని తరలించాలంటే మరో 28 మోటార్లను నడిపించాలి. దీనికి మరో 1,672 మెగావాట్లు అవసరం.  

ఇక పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా వానాకాలంలో నీటి ఎత్తిపోతలు సాధ్యపడేలా లేవు. అయితే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్‌లను మాత్రం స్థానిక ప్రవాహాల ద్వారా వచ్చే నీటితో నింపేలా ప్రణాళికలు వేశారు. వీటితో పాటే ఏఎంఆర్‌పీ, ఐడీసీ పథకాలను కలుపుకొని మొత్తంగా వానాకాలంలో అన్ని ఎత్తిపోతల పథకాల కింద 4 నెలల పాటు 607 మోటార్లు నడుస్తాయని, వాటి సామర్థ్యాన్ని బట్టి 6,520 మెగావాట్ల అవసరం ఉంటుందని ఇరిగేషన్‌ శాఖ అంచనా వేసింది. గత ఖరీఫ్‌లో విద్యుత్‌ 2 వేల మెగావాట్లను కూడా దాటలేదు. యాసంగిలో 2,000–2,800 మెగావాట్లు వినియోగించినట్లు అంచనా. కానీ ఈ ఏడాది మాత్రం భారీగా విద్యుత్‌ అవసరాలు ఉండనున్నట్లు విద్యుత్‌ శాఖకు నివేదించింది.  

ప్రధాన పథకాల కింద అవసరాలు ఇలా..  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top