జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident In Nagar Kurnool District - Sakshi

మంటల్లో చిక్కుకున్న 9 మంది సిబ్బంది

సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే మరీ కొంతమంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్,మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్‌, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదం దురదృష్టకరం: మంత్రి జగదీష్‌రెడ్డి
శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌హౌస్‌లో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మొదటి యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్‌ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 10 మంది సురక్షితంగా బయటకొచ్చారు.. మరో 9 మంది చిక్కుకున్నారని వెల్లడించారు. ‘‘లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది లోపలికి వెళ్లారు. దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్‌ పెట్టుకుని వెళ్లినా లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి సిబ్బంది సహాయం కోరాం. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ మంత్రి వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top