వ్యవసాయం కొనసాగాలంటే ఈ విధానం అమలు తప్పనిసరి
ఒక పంట వరి వేస్తే.. మరో పంటగా ఆరుతడి సాగు చేయించాలి
పంజాబ్, హరియాణా తరహాలో ప్రోత్సాహమిస్తే ప్రయోజనం
కేరళ, నాసిక్ తరహా కూరగాయల క్లస్టర్, ఎఫ్‌పీసీలు కీలకం..
పంటల కనీస ధరల నిర్ణయానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీ
పంట మార్పిడి దిశగా ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయం నాలుగు కాలాలపాటు కొనసాగాలంటే పంటల మార్పిడి విధానం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. ఈ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి పంటను రెండు కాలాల్లో సాగు చేయకుండా ఒక పంట వరి, మరో పంట ఆరుతడి సాగుచేసేలా రైతులను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పంటల సాగు, మార్కెటింగ్, ఇతర సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలపై దాదాపు ఏడాది కాలం పాటు అధ్యయనం చేసిన కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదికను అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం, దీని ఆధారంగానే రాష్ట్రంలో అమలు చేసే వ్యవసాయ విధానాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.
రైతు కమిషన్ చేసిన ప్రధాన సిఫారసులివి
⇒ వ్యవసాయ వాతావరణ మండలాల ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలి. పంట మార్పిడి లక్ష్యాలను సంవత్సరాలు, గ్రామాల వారీగా నిర్ణయించాలి.
⇒ ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు విస్తరణ చేయగలిగితే ఏక పంటల వల్ల కలిగే నష్టాలను తగ్గించొచ్చు.
⇒ ఉద్యాన పంటల సాగులో స్వయంవృద్ధి సాధించాలి. ఇందుకు కూరగాయల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్, మల్చిం గ్‌తోపాటు కూరగాయల పందిరికి రాయితీ ఇవ్వాలి.
⇒ కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు అత్యధిక మోతాదులో విత్తనాలు అవసరం. దీని కోసం విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలి.
⇒ ఉద్యాన పంటల సాగులో వన్యప్రాణుల బెడదను తప్పించడానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు నాబార్డు సహకారంతో రాయితీ ఇప్పించాలి.
⇒ ఆయా జిల్లాల్లో ఏ పంటల సాగు ఎక్కువగా ఉందనే అంచనాల మేరకు ఆ ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు నిజామాబాద్‌లో పసుపు, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మిరప, ఖమ్మం, జగిత్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మామిడి అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఆయా పంటలకు సంబంధించిన ప్రాసిసెంగ్ యూనిట్లు, ప్యాక్ హౌస్‌లు (గ్రేడింగ్, సారి్టంగ్, ప్యాకింగ్ కోసం), కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలి.
⇒ కేరళ తరహాలో కూరగాయల క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. మహారాష్ట్ర నాసిక్‌లోని సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్‌పీసీ) లాగానే ఇక్కడా ఏర్పాటు చేయాలి.
⇒ రైల్వే బడ్జెట్ తరహాలోనే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి.
⇒ పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల పంటలకు కూడా కనీస మద్దతు ధరతోపాటు కొనుగోలు మద్దతు కల్పించాలి.
⇒ ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు రైతుల పంటలను తప్పనిసరిగా కొనుగోలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.
⇒ పంటల మద్దతు ధర నిర్ణయించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో రైతులకు ప్రాతినిధ్యం కల్పించాలి.
⇒ కలుపు తీసే యంత్రాలు, ఇతర చిన్న వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ ఇవ్వాలి. వ్యవసాయ క్లస్టర్ల వారీగా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నుంచి ప్రోత్సాహకాలతోపాటు సహకారం తీసుకోవాలి
⇒ ఆహార పంటల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ను ఆర్థికంగా బలోపేతం చేయాలి. పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే స్థాయిలో తగిన నిధులు సమకూర్చాలి.
⇒ నీటి పొదుపునకు రెండు కాలాల్లోనూ వరికి బదులు ఓ కాలంలో వరి, రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేయించాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, క్రాప్ కాలనీల ఏర్పాటు ద్వారా రైతులు సంఘటితం కావడంతోపాటు ఆ వర్గాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తాయి.
⇒ వరి, పత్తి పంటలకే కాకుండా ఇతర ముఖ్య పంటలకు కూడా సంస్థాగత రుణాలు ఇప్పించాలి. ఇతర ముఖ్య పంటలకు పంటల బీమా సౌకర్యం కల్పించాలి.
⇒ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి సాగు నుంచి ఇతర పంటల మార్పిడికి ఇస్తున్న ప్రోత్సాహకాల మాదిరిగా, తెలంగాణలో కూడా రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి.
చెరుకు, పసుపు పంటలు... ప్రత్యేకం
సంప్రదాయ పంటలైన చెరుకు, పసుపు సాగుకు వ్యవసాయ కమిషన్ ప్రత్యేక సిఫారసులు చేసింది. ఈ నివేదిక ప్రకారం 2013–14లో పసుపు సాగు 1,52,445 ఎకరాలలో ఉండేది. ప్రస్తుతం అది 42,246 ఎకరాలకు తగ్గిపోయింది. నిజాం కాలం నుంచే నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లో చెరుకు విస్తృతంగా సాగు చేసేవారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత 95,348 ఎకరాల నుంచి 51,482 ఎకరాలకు తగ్గింది. పంటల కోత సమయంలో కూలీల కొరత తీవ్రత, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, పసుపు బోర్డుకు నిధులు లేకపోవడం, అధికసాగు ఖర్చులు, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడడం లాంటి సమస్యలతో ఈ రెండు పంటలకు సాగు విస్తీర్ణం తగ్గుతోంది.
పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు తగిన నిధులు కేటాయించాలి. అధిక కుర్కుమిన్ శాతం కలిగి, ఎగుమతులకు అనుకూలమైన ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ రకాల సాగును ప్రోత్సహించేందుకు పసుపు కొమ్ములపై సబ్సిడీపై ఇవ్వాలి. వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి. పసుపు ఉడికించడానికి బాయిలర్ల కొనుగోలుకు ప్రోత్సాహమివ్వాలి. యూపీ, పంజాబ్‌లతో తరహాలో చెరుకు సాగుకు ప్రత్యేక బోనస్ ప్రకటించాలి. చెరుకు కట్టింగ్, డ్రిప్ ఇరిగేషర్, ఆటోమేటెడ్ ప్లాంటర్లు, హార్వెస్టర్లను సబ్సిడీపై ఇవ్వాలి. పెసర వంటి అంతరపంటలను ప్రోత్సహించడంతోపాటు రాష్ట్రంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల పున:ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.


