‘మురుగు’.. తప్పితేనే మెరుగు

Drainage water into Himayat Sagar and Osman Sagar - Sakshi

హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలోకి డ్రైనేజీ నీళ్లు 

చుట్టూ ఉన్న 11 గ్రామాలు, కాలేజీల నుంచి నిత్యం చేరిక 

కాలుష్యం బారినపడుతున్న జంట జలాశయాలు 

మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుపై అధికారుల నిర్లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరానికి తాగునీరిచ్చే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట)లను మురుగు ముప్పు వెంటాడుతోంది. సమీపంలోని 11 గ్రామాల నుంచి, చుట్టూ ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి వస్తున్న మురుగునీటితో రిజర్వాయర్లు కలుషితం అవుతున్నాయి. నిత్యం గండిపేట జలాశయంలోకి 29 లక్షల లీటర్లు, హిమాయత్‌సాగర్‌లోకి 43.5 లక్షల లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నట్టు జల మండలి పరిశీలనలోనే వెల్లడైంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వచ్చే మురుగు నీటిని ఎక్కడికక్కడ శుద్ధి చేయాలని, అందుకోసం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) ఏర్పాటు చేసుకోవాలని.. గతంలోనే గ్రామ పంచాయతీలు, కాలేజీలకు జలమండలి, కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇచ్చాయి. ఎస్టీపీలను నిర్మించుకోవాలని, జలాశయాలు కలుషితం కాకుండా చూడాలని హైకోర్టు కూడా కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. అయినా ఫలితం లేదు. పంచాయతీల నిర్లక్ష్యానికితోడు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగునీటి చేరికను ఆపడం, శుద్ధి చేయడం ద్వారా జంట జలాశయాల్లో నీటి నాణ్యతను మెరుగుపర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. 

ఐదేళ్లుగా పైసా లేదు.. 
సుమారు పదివేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న జంట జలాశయాలకు సమీపంలో 11 గ్రామా లు ఉన్నాయి. వాటి నుంచి వెలువడుతున్న మురుగు నీరంతా జలాశయాల్లోకి చేరుతుండటంతో.. మురుగుశుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లను నిర్మిం చాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యా యి. అందులో రూ.27.50 కోట్లను పంచాయతీ రాజ్‌ శాఖ, మరో రూ.13 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేయాలని సూచించింది. ఇది జరిగి ఐదేళ్లయినా ఆయా విభాగాల నుంచి పైసా నిధులు విడుదల కాలేదు. మురుగు నీరు నేరుగా జలాశయాల్లో కలుస్తూ.. ఆర్గానిక్‌ కాలుష్యం పెరిగిపోతోంది. 

తాఖీదులు ఇచ్చినా.. 
జంట జలాశయాల చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలు ఎస్టీపీలు నిర్మించుకోవాలంటూ గతంలోనే తాఖీదులిచ్చామని పీసీబీ వర్గాలు తెలిపాయి. పీసీబీ తరఫున రూ.13 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కానీ పంచాయతీరాజ్‌ విభాగం నుంచి రావాల్సిన రూ.27.50 కోట్లను విడుదల చేయడం లేదని ఓ అధికారి చెప్పారు. అయితే దీనిపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా.. ఈ అంశంపై దృష్టి సారించి, సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.  

తక్షణం ఎస్టీపీలు నిర్మిస్తేనే..
జంట జలాశయాల్లో కాలుష్యం చేరకుండా తీసు కోవాల్సిన చర్యలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. 
సమీప గ్రామాల మురుగునీరు చేరకుండా తక్షణం ఎస్టీపీలు నిర్మించాలి. వాటిలో శుద్ధిచేసిన నీటిని కూడా జలాశయాల్లోకి వదలకుండా గార్డెనింగ్, పంటలకు వినియోగించాలి. రిజర్వాయర్లలోని నీటిలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు ఏరియేషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. 
వరదనీరు చేరే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. జలాశయాల ఎగువన, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా వెలిసిన ఫాంహౌజ్‌లు, ఇంజనీరింగ్‌ కాలేజీలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను తొలగించాలి. ఇసుక మాఫియాను కట్టడిచేయాలి. 
ఈచర్యల విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. 

మురుగు కాలుష్యం ప్రమాదకరం 
మురుగు చేరిక వల్ల మంచినీటి జలాశయాల్లోకి పురుగు మందుల అవశేషాలు, షాంపూలు, టాయిలెట్‌ క్లీనర్లు, సబ్బులు, ఇతర రసాయనాలు చేరుతున్నాయి. గృహ, వాణిజ్య వ్యర్థ జలా ల్లో ఉండే హానికర మూలకాలతోనూ ప్రమాదం ఉంటుంది. మానవ, జంతు వ్యర్థాలతో కూడిన మురుగులో కొలిఫాం, షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఈకొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. మురుగునీటితో యుట్రిఫికేషన్‌ చర్య జరిగి గుర్రపు డెక్క ఉద్ధృతి పెరుగుతుంది. జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గినపుడు దోమల లార్వాలు ఉద్ధృతంగా వృద్ధి చెందుతాయి. సమీప ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. 
– సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణవేత్త 

ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు, అవసరమైన సామర్థ్యం ఇదీ.. 
ఉస్మాన్‌సాగర్‌ పరిధిలో.. 
వట్టినాగులపల్లి   -     8 లక్షల లీటర్లు 
చిలుకూరు   -     7 లక్షల లీటర్లు 
ఖానాపూర్‌    -    6 లక్షల లీటర్లు 
జన్వాడ   -     6 లక్షల లీటర్లు 
హిమాయత్‌నగర్‌    -    3 లక్షల లీటర్లు 
అప్పోజిగూడ   -    లక్ష లీటర్లు 
బాలాజీ ఆలయం    -    లక్ష లీటర్లు 

హిమాయత్‌సాగర్‌ పరిధిలో.. 
ఫిరంగినాలా -   29 లక్షల లీటర్లు 
అజీజ్‌నగర్‌  -  9 లక్షల లీటర్లు 
కొత్వాల్‌గూడ  -  3 లక్షల లీటర్లు
హిమాయత్‌సాగర్‌  -  2.5 లక్షల లీటర్లు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top