పోడు..‘గోడు’ వినే వారేరీ?

Dispute with Survey on Revenue and Forest Boundaries - Sakshi

రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దులపై సర్వేతో వివాదం 

దశాబ్దాలుగా గిరిజనులు సాగుచేస్తున్న భూములన్నీ అడవులుగా చూపుతున్న తీరు 

వాటిలో సరిహద్దులు గుర్తిస్తూ, ట్రెంచ్‌లు కొడుతున్న అధికారులు 

అడ్డుకుంటున్న గిరిజనులపై కేసులు 

ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్రామం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి. కాకతీయుల కాలం నుంచే ఉన్న ఈ గ్రామంలో సామంత రాజులు అప్పట్లోనే వేలుబెల్లి పెద్ద చెరువును తవ్వించారు. 600 కుటుం బాలు, 2 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలోని గిరిజనులు, గిరిజనేతరులు కలిసి.. 3వేల ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. అందులో 200 ఎకరాలకు 1/70 ద్వారా పట్టాలు ఇవ్వగా.. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 36 మంది గిరిజనులకు మరో 200 ఎకరాలకు హక్కుపత్రాలు ఇచ్చారు. మిగతా 2,600 ఎకరాలకు పట్టాలు లేవు. 2018 తర్వాత నిర్వహించిన రెవెన్యూ– ఫారెస్టు సరిహద్దుల గుర్తింపులో భాగంగా.. ఈ గ్రామస్తులు సాగుచేసుకుంటున్న  భూమి అడవిపరిధిలో ఉందని రికార్డుల్లో నమోదు చేశారు. అటవీశాఖ అధికారులు సరిహద్దు గుర్తులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వందల ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి అటవీశాఖదేనని అంటుండటం తో.. గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. 

 కేసులు భరించలేక వలస బాట 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో గిరిజనేతర రైతులు సుమారు 250 ఎకరాల పోడు భూముల్లో రెండేళ్ల కిందటి వరకు వ్యవసాయం చేశారు. కానీ అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకున్నారు. మొదట 22 మందిపై, తర్వాత మరో 18 మందిపై కేసులు పెట్టారు. ఆ రైతులు కోర్టు చుట్టూ తిరగలేక, కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక.. ఆ గ్రామం వదిలి జీవనోపా«ధి కోసం వలస పోయారు. అటవీశాఖ సిబ్బంది ఆ పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటారు. 

.. ఇలా ఒకటి రెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పరిస్థితి ఇది. అవి ఫారెస్టు భూములంటూ స్వాధీనం చేసుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా.. అడవినే నమ్ముకొని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై తమకు హక్కు ఉందని, వాటిని వదిలి ఎక్కడికి వెళ్లాలని గిరిజనులు వాపోతున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పోడు భూమి సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురుచూస్తున్నారు. 

గూగుల్‌ సర్వేతో.. 
ప్రభుత్వం భూప్రక్షాళన, అటవీ భూముల క్రమబద్ధీకరణ, అడవుల సంరక్షణ పేర్లతో గూగుల్‌ సర్వే నిర్వహించి.. ఆ డేటాను జీఏఆర్‌ఎస్‌ (గ్లోబల్‌ ఏరి యా రిఫరెన్స్‌ సిస్టమ్‌)కు అనుసంధానం చేసింది. వందల ఏళ్ల నాటి అడవుల సరిహద్దులను నిక్షిప్తం చేసింది. ఈ క్రమంలో గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములు కూడా అడవుల పరిధిలోనే ఉన్నాయని చూపిస్తోంది.  ఆయా ప్రాంతాల్లో ట్రెంచ్‌లు వేస్తున్నారు. ఇదేమిటంటూ గిరిజనులు ఆందోళనలో మునిగిపోతున్నారు. 

3,31,070 ఎకరాలకు పట్టాలిచ్చిన వైఎస్సార్‌ 
2004 సార్వత్రిక ఎన్నికల ముందు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోడు సమస్యను గుర్తించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2006లో తెలంగాణలో హైదరాబాద్‌ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో 99,486 మంది రైతులు సాగుచేసుకునే 3,31,070 ఎకరాల భూములకు భూమిహక్కు పత్రాలను ఇచ్చారు. 

ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు 
2006 ఏడాదిలో, ఆ తర్వాత కూడా కొందరు గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. దానికితోడు అప్పటికే పోడు చేస్తున్నా దరఖాస్తు చేసుకోని వారు కూడా  ఉన్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. వారందరికీ హక్కు పత్రాలివ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ, పలు కారణాలతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కలిపి 8 లక్షల ఎకరాల మేర పోడు భూముల సమస్య ఉందని గిరిజన సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ భూములకు హక్కుపత్రాలిచ్చి అడవుల అభివృద్ధిలో భాగంగా పండ్ల తోటలను పెంచేలా ప్రోత్సహిస్తే.. ఇటు ప్రభుత్వ లక్ష్యం, ఇటు గిరిజనులకు ఉపాధి రెండూ నెరవేరుతాయని అంటున్నారు. 
    – సాక్షి, మహబూబాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top