కోవిడ్‌ ‘ఒమిక్రాన్‌’ వేరియెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కలవరం

Covid Omicron Variant Set Off Alarm Bells Across The World - Sakshi

భౌతికదూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి అంటున్న వైద్యులు 

తగ్గిన మాస్కులు, శానిటైజర్ల వాడకం

కరోనా నిబంధనలను పట్టించుకోని జనం

జనం గుమిగూడే చోట్ల ఇప్పటికే పెరుగుతున్న కేసులు 

కొత్త వేరియెంట్‌గానీ వస్తే మరింత డేంజర్‌ 

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం 

శంషాబాద్‌ విమానాశ్రయంలోపకడ్బందీగా స్క్రీనింగ్‌ 

వారికి సోకిన వేరియెంట్‌ను గుర్తించేందుకు శాంపిళ్ల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌  

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ కలకలం మళ్లీ మొదలైంది. కేసులు తగ్గి, సాధారణ జనజీవనం మొదలైన కొద్దినెలల్లోనే ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ రూపంలో కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతుండగా.. మన దేశంలో, రాష్ట్రంలో కూడా అదే జరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి.. అన్నిరంగాలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, వైరస్‌పై భయం తగ్గడంతో జనం మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలను పక్కనపెట్టారు.

ఫంక్షన్లు, పార్టీలు, రద్దీ ప్రదేశాల్లో గుమిగూడటం పెరిగింది. దానికితోడు విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలుచోట్ల పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వేరియెంట్‌గానీ వస్తే.. పరిస్థితి మళ్లీ దారుణంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. 
(చదవండి: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి)

పెరుగుతున్న పాజిటివిటీ రేటు 
కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్‌ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇది చాలా స్వల్పంగా ఉన్నా.. ప్రజలంతా జాగ్రత్తలు పాటించకుంటే వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వారం కింద గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 40 కరోనా కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 75కు చేరింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ స్వల్పంగా కేసులు పెరుగుతున్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 • రాష్ట్రంలో ఈ నెల 19న 31వేల కరోనా టెస్టులు చేయగా.. 137 మందికి పాజిటివ్‌ వచ్చింది. 26న 33వేల టెస్టులు చేయగా 171 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 • ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి కోవిడ్‌ విభాగంలో 55 చికిత్స పొందుతున్నారు. ఇందులో 35 మంది కోవిడ్‌ బాధితులుకాగా.. మరో 20 మంది బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్నవారు. టిమ్స్‌ ఆస్పత్రిలో కూడా బాధితులు పది మందిలోపే ఉన్నారు. అయితే ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్న కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు సమాచారం. 

గుమిగూడే చోట పెద్ద సంఖ్యలో కేసులు 
గుంపులుగా జనం ఉండే ప్రాంతాలు, నిత్యం రద్దీ ఉండేచోట్ల కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువ. అలాంటి చోట్లకు వెళ్లే వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. గత కొద్దిరోజులుగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇటీవల ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఒకేరోజు 30 మందికి పాజిటివ్‌గా తేలింది. సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోనూ రెండంకెల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కళాశాలలు, పాఠశాలలు పూర్తిస్థాయిలో కొనసాగుతుండటంతో భౌతికదూరాన్ని పాటించడం కష్టంగా మారిందని.. మాస్కులు, శానిటైజేషన్‌ వంటి నిబంధనలు సరిగా పాటించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. 

మాస్కులేవి.. భౌతికదూరమేదీ? 
కోవిడ్‌ నియంత్రణలో కీలకమైన కనీస నిబంధనలను జనం సరిగా పాటించడం లేదు. చాలా మంది మాస్కులు కూడా ధరించడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ సహకారంతో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. ఏకంగా 82.5శాతం మంది ఎలాంటి మాస్కు ధరించడం లేదని సర్వేలో తేలింది. మిగతా 17.5శాతం మంది మాస్కుపెట్టుకుంటున్నా.. అందులో సగం మంది సరిగా ధరించడం లేదని వెల్లడైంది. ముక్కు, నోరు పూర్తిగా కప్పేలా గాకుండా నామ్‌కేవాస్తేగా తగిలించుకుంటున్నట్టు గుర్తించారు. 

 • బహిరంగ ప్రదేశాల్లో అవసరమైతే తప్ప ఏ వస్తువును తాకవద్దని, క్రమం తప్పకుండా చేతులను హ్యాండ్‌వాష్‌తోగానీ, శానిటైజర్‌తోగానీ శుభ్రం చేసుకోవాలనే నిబంధనను చాలా మంది పాటించడం లేదని తేలింది. ఇక వ్యక్తుల మధ్య ఆరడుగుల భౌతికదూరాన్ని పాటించాలన్న నిబంధన అసలే అమలుకావడం లేదని వెల్లడైంది. 
 • ఆ సర్వే వివరాలను పరిశీలించిన వైద్యారోగ్యశాఖ.. అందరూ మాస్కులు పెట్టుకోవాలని వారం కింద ప్రకటన జారీ చేసింది. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించని పరిస్థితి ఉంది.  

నిర్లక్ష్యంగా ఉంటే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు 
దక్షిణాఫ్రికాలో కొత్తగా గుర్తించిన ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ఇంతకుముందటి డెల్టా కంటే ప్రమాదకరమైంది. వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్‌ ఈ వైరస్‌ను దీటుగా ఎదుర్కొంటాయా? లేదా అనేది ఇంకా తేలలేదు. ఇందుకు మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. చాలా మంది కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నామనే ధీమాతో మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతికదూరం పాటించడం లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల పేరుతో పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  – డాక్టర్‌ రాజారావు,  సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి 

కేసుల సంఖ్య పెరుగుతోంది 
నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. కోవిడ్‌ నిబంధనలను ఎవరూ సరిగా పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించడాన్ని దాదాపు మర్చిపోయారు. వివిధ కారణాలతో ఆస్పత్రులకు వచ్చేవారు, ఫ్రంట్‌లైన్‌లో పనిచేస్తున్న వారు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. మిగతావారిలో చాలా మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించడమే పరిష్కారం.
– డాక్టర్‌ భరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్‌  

శంషాబాద్‌ విమానాశ్రయంలో అలర్ట్‌ 
శంషాబాద్‌:  కరోనా కొత్త వేరియెంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. నిజానికి ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాల రాకపోకలు లేవు. కోవిడ్‌ లాక్‌డౌన్‌కు ముందు హాంకాంగ్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉన్నా.. ప్రస్తుతం నడవడం లేదు. అయితే ప్రయాణికులు ఇతర దేశాల మీదుగా వచ్చే అవకాశాలు ఉండటంతో.. అందరినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

పాజిటివ్‌ వస్తే.. క్వారంటైన్‌కు.. 
విదేశాల నుంచి వచ్చేవారు ఆయా దేశాల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నా కూడా.. ఇక్కడ మరోసారి పరీక్షలు చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టుల ముఖ్య వైద్యాధికారి అనురాధ తెలిపారు. ప్రయాణికుల్లో ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే.. వారిని క్వారంటైన్‌కు పంపడంతోపాటు ఏ వేరియెంట్‌ సోకిందనేది నిర్ధారించుకునే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.   

అతిగా ఆందోళన వద్దు 
ప్రస్తుతం కోవిడ్‌ పాజిటివ్‌ వస్తున్నవారిలో చాలా వరకు సాధారణ లక్షణాలే ఉంటున్నాయని.. సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు. అందులోనూ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉంటోందని అంటున్నారు. టీకా తీసుకోని వారిలో మాత్రం వైరస్‌ ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తోందని చెప్తున్నారు. అందువల్ల మరీ అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కోవిడ్‌ జాగ్రత్తలను పక్కాగా పాటించాలని సూచిస్తున్నారు.  

కరోనాకు అనుకూల సమయమిది 
ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే కరోనా వైరస్‌ విస్తరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ఇదివరకే గుర్తించారు. ప్రస్తుతం చలికాలం మొదలవడంతో కరోనాకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్‌ హాళ్లు వంటిచోట్ల గాలిలో వైరస్‌ ఉండే అవకాశాలు పెరుగుతున్నాయని.. కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకోనివారు, 18ఏళ్ల లోపు విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  

చాపకింద నీరులా.. 
దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగుచూసిన ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌.. మన దేశంలో రెండోవేవ్‌కు కారణమైన ‘డెల్టా’ కంటే 40 శాతం వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ సహా సుమారు 15 దేశాలు దక్షిణాఫ్రికా, దాని పరిసర దేశాల నుంచి విమాన రాకపోకలను నిషేధించాయి. 

కోవిడ్‌ నిబంధనలు పాటించండి: ప్రధాని 
‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై మన దేశంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హైఅలర్ట్‌ ప్రకటించాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 
కరోనా టెస్టులు చేస్తున్నాయి. మరోవైపు ఈ పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని.. అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే అంశాన్ని పునః సమీక్షించాలని ఆదేశించారు.
(చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్‌)

రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులు 
కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడంతో.. మన రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పలు కాలేజీలు, పాఠశాలల్లో పదుల కొద్దీ కేసులు బయటపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి హరీశ్‌రావు ఆదివారం పరిస్థితిని సమీక్షించనున్నారు.  

డేంజర్‌ బెల్స్‌.. 

 • ‘ఒమిక్రాన్‌’ కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగం ఎక్కువ 
 • ఐదు దేశాల్లో ఈ కేసులు గుర్తించారు 
 • రాష్ట్రంలో 82.5 శాతం మాస్కులు పెట్టుకోవట్లేదు. మిగతా 17.5% మందిలోనూ సగం మంది సరిగా ధరించడం లేదు. 
 • 90% మంది భౌతికదూరం, శానిటైజేషన్‌ పాటించడం లేదు 
 • ఫంక్షన్లు, పార్టీలు, రద్దీ ప్రదేశాల్లో గుమిగూడటం ఎక్కువైంది 

అప్రమత్తంగా ఉండాలి

 •      ‘ఒమిక్రాన్‌’తో ప్రమాదమెంతో ఇంకా తేలలేదు 
 •      వ్యాప్తి వేగంగా ఉన్నా..లక్షణాలు తక్కువే
 •      ‘సాక్షి’ఇంటర్వ్యూలో ప్రముఖ వైరాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ 

‘ఒమిక్రాన్‌’ కరోనా వేరియంట్‌ విషయంగా ఇప్పుడే అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉంటే చాలు అని ప్రముఖ వైరాలజిస్ట్, సీఎంసీ వెల్లూరు ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందే తప్ప.. లక్షణాలు తక్కువగానే ఉన్నాయని ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయని వివరించారు. టెస్టింగ్, ట్రాకింగ్, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లను పెంచడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో గగన్‌దీప్‌ కాంగ్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. 

ఇంకా పరిశీలించాల్సి ఉంది.. 
కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్నా.. ప్రభావం, ప్రమాదం తక్కువగా ఉన్నట్టు ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. కేసుల పెరుగుదల తీరు ఎలా ఉంది, తీవ్రమైన జబ్బుగా మారుతోందా అన్న దానిపై స్పష్టమైన సమాచారమేదీ లేదు. వ్యాక్సిన్‌కు లొంగుతుందా, లేదా అన్నది కూడా తెలియదు. ఇదేదో ప్రమాదకరమైనదని ముందే ఆందోళన వద్దు. ఇప్పటికైతే ఇది మైల్డ్‌ డిసీజ్‌గా (తక్కువ లక్షణాలు కలిగించేలా) ఉంది. తీవ్రత పెరిగి ప్రమాదకరంగా మారితేనే భయపడాలి. పూర్తి స్పష్టత వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవడం మంచిది. ఇప్పుడు కాకపోయినా కొంత ఆలస్యంగానైనా కొత్త వేరియెంట్‌ దేశంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. 

కోవిడ్‌ జాగ్రత్తలే కీలకం 
కరోనా వేరియంట్‌ ఏదైనా సరే.. మాస్కులు ధరించడం ద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చు. ఇతర కోవిడ్‌ నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాలి. ఒకేచోట ఎక్కువమంది గుమిగూడొద్దు. అందరూ రెండు డోసుల టీకా తీసుకోవాలి. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలి. 

మరో వేవ్‌ రాదని అనుకోలేం.. 
వైరస్‌ ఏదైనా చివరికి ఎండెమిక్‌ (అంతర్ధాన దశ)గా మారుతుంది. కానీ కొత్త వేరియెంట్లు వచ్చి.. ముందటి వేరియంట్ల కంటే పూర్తి భిన్నంగా, కొత్తగా ఉంటే మాత్రం అది మరో మహమ్మారిగా మారుతుంది. మన దేశంలో రెండోవేవ్‌ తగ్గాక ఎండెమిక్‌ పరిస్థితి కనిపించింది. అలాగని మరో వేవ్‌ రాదని కాదు. ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది తేలాల్సి ఉంది. ఎక్కువ మందికి సోకుతూ, రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా ఉంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే. 

ఇప్పుడే బూస్టర్‌ డోసు వద్దు 
కొత్త వేరియంట్‌ పేరుతో ఇప్పటికిప్పుడు టీకా బూస్టర్‌ డోసులు వేసుకోవాలని చెప్పడం సరికాదు. కొత్త వేరియంట్‌ ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం నుంచి తప్పించుకుంటుందా లేదా అన్నది తేలకముందే.. మరో డోసు వేసుకోవడం మంచిది కాదు.   
(చదవండి: ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top