తెలంగాణలో కరోనా రిస్క్‌ తక్కువే..!

Coronavirus: Low Risk For Common Healthy People Says Study Report - Sakshi

కోవిడ్‌–19 మృతుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే 

రాష్ట్రంలో దీర్ఘకాల వ్యాధులున్నవారి గృహాలు 6.12 శాతం..  

జాతీయ సగటు 9.38 శాతంగా నమోదు 

33.19 శాతంతో దేశంలో అత్యధిక రిస్క్‌లో కేరళ  

ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, గోవా, పంజాబ్‌  

రిస్క్‌ జాబితాలో కింది నుంచి 11వ స్థానంలో తెలంగాణ 

ఐఐపీఎస్‌ అధ్యయన నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణలో కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదు. కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వేగం కాస్త అటూఇటుగా ఉన్నప్పటికీ మరణాన్ని జయిస్తున్నవారే అధికం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్‌ తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండడమే. దేశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అతి తక్కువగా ఉంది’అని ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌) నివేదిక వెల్లడించింది.

జూలై 2017 నుంచి జూన్‌ 2018 మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారి గణాంకాలను ఆధారం చేసుకుని రాష్ట్రాల వారీగా కోవిడ్‌–19 బారిన పడి కోలుకున్న.., మరణించిన వారి సంఖ్యను లెక్కిస్తూ ఐఐపీఎస్‌ అధ్యయనం చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారి గృహాలను ప్రామాణికంగా తీసుకుంటూ గణాంకాలను విశ్లేషిస్తే జాతీయ స్థాయిలో 9.38 శాతం గృహాలు రిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారించింది. 

రాష్ట్రంలో రిస్క్‌ 6.12 శాతమే 
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణాంకాలను సేకరించిన ఐఐపీఎస్‌.. రాష్ట్రాల వారీగా జాతీయ సగటును పోల్చుతూ పరిశీలన చేసింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో సగటున 9.38 శాతం గృహాలు రిస్క్‌ జాబితాలో ఉన్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే రిస్క్‌ కేవలం 6.12 శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా రిస్క్‌ ఉన్న గృహాలు కేరళలో (33.19 శాతంతో) ఉన్నట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఆ తర్వాతి వరుసలో ఆంధ్రప్రదేశ్‌ 19.82 శాతం, గోవా 15.89 శాతం, పంజాబ్‌ 15.51 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌ 14.49 శాతంతో రిస్క్‌ జాబితాలో ఉన్నాయి.

ఇక రిస్క్‌ జాబితాలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 11వ స్థానంలో ఉంది. ఈ లెక్కన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్‌ తక్కువగా ఉండడం వల్లే కోవిడ్‌–19 మరణాలు తక్కువగా సంభవిస్తున్నట్లు తేల్చింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్‌–19 మరణాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు 55.04 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 44.96 శాతం మరణాల్లో అత్యధికులు సకాలంలో వైద్యం తీసుకోకపోవడం వల్లే చనిపోయినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

అరవై దాటిన వారే ఎక్కువ 
వయసు రీత్యా పరిశీలిస్తే అరవై సంవత్సరాలు దాటిన వారిలో రిస్క్‌ ఎక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్‌ పరిశీలన చెబుతోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో అరవై ఏళ్లు దాటిన వారు 52.25 శాతం ఉండగా, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవారు 40.82 శాతం ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 15 నుంచి 44 సంవత్సరాల వారుండగా.. 15 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ల సంఖ్య అతి తక్కువగా ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top