కాళేశ్వరం నివేదికపై కమిటీ | Committee on Kaleshwaram report | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం నివేదికపై కమిటీ

Aug 2 2025 1:24 AM | Updated on Aug 2 2025 1:24 AM

Committee on Kaleshwaram report

పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి, సీఎస్‌ రామకృష్ణారావు తదితరులు

అధ్యయనానికి ఇరిగేషన్, న్యాయ, జీఏడీ శాఖల కార్యదర్శులతో త్రిసభ్య కమిటీ

నివేదికను అధ్యయనం చేసి సారాంశాన్ని సిద్ధం చేసే బాధ్యత

4వ తేదీన ఇదే సింగిల్‌ పాయింట్‌ ఎజెండాగా మంత్రివర్గ సమావేశం 

సీఎం రేవంత్‌రెడ్డికి కమిషన్‌ నివేదిక అందించిన మంత్రి ఉత్తమ్‌

కేబినెట్‌లో చర్చ తర్వాత అసెంబ్లీలోనూ చర్చకు పెట్టే యోచన

ఆ తర్వాతే బాధ్యులపై చర్యలకు సిద్ధం కావాలని సర్కారు భావన

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవినీతిపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ (పీసీ ఘోష్‌) కమిషన్‌ సమర్పించిన నివేదికపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతిని కమిటీలో సభ్యులుగా నియమించింది. 

నివేదికను అధ్యయనం చేసి.. దాని సారాంశం (జిస్ట్‌) సిద్ధం చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నెల 4వ తేదీన ఈ నివేదికపై చర్చించడానికి సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఆ సమావేశంలో నివేదికపై విస్తృతంగా చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసే అవకాశం ఉంది. 

సీఎం చేతికి నివేదిక
జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాళేశ్వరం కమిషన్‌ నివేదికను శుక్రవారం సీల్డ్‌ కవర్లలో అందజేశారు. నివేదికను అందుకున్న వెంటనే దానిపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. 4న జరిగే మంత్రివర్గ సమావేశంలోపు నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ అందించనుంది. 

కేబినెట్‌లో చర్చించిన తర్వాత రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నివేదికను ప్రభుత్వం సభ ముందుంచే అవకాశాలు ఉన్నాయి. శాసనసభలో దీనిపై చర్చించాకే తదుపరి చర్యల దిశగా అడుగులు పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, నివేదిక అందించే సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సీఎం కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది. 

ప్రణాళిక లోపమేనా?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయిన విషయం విదితమే. ఈ నిర్మాణ లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌తో విచారణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

బరాజ్‌లకు సంబంధించి ప్రణాళిక, నమూనాలు, నాణ్యత, నిర్వహణ ప్రధాన లోపాలు కాగా, స్థల ఎంపిక కూడా ఇందుకు కారణమన్న అభిప్రాయాన్ని కమిషన్‌ తన నివేదికలో వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. ఈ బరాజ్‌ల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు, చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సహా దాదాపు 150 మందిని విచారించిన తరువాత ఈ నివేదికను నివేదిక రూపొందించారు. 

ప్రాజెక్టు నిర్మాణంలో అవకతకలు చోటు చేసుకున్నట్లు కమిషన్‌ నివేదికలో వెల్లడించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ లొకేషన్‌ మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై కమిషన్‌ స్పష్టతనిచ్చిందని అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement