వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణ పనుల శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కలిసికట్టుగా కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం
ఏడాదిన్నరలోపు ఇక్కడ కృష్ణా జలాలు పారిద్దాం
ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దుదాం
కొడంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్: దశాబ్దాల తరబడి అన్యాయానికి గురైన కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అనేలా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, దేశంలోని గొప్ప గొప్ప పరిశ్రమలు కొడంగల్ బాట పట్టాయని తెలిపారు. శుక్రవారం కొడంగల్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితో కలిసి రూ.110 కోట్లతో కొడంగల్ వెంకటేశ్వరస్వామి, రూ.2 కోట్లతో కోస్గి వేణుగోపాలస్వామి, రూ.2.5 కోట్లతో దౌల్తాబాద్ వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు.
పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిఏడాదిన్నరలోపు పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తాం. దీనికి సంబంధించిన భూసేకరణ బాధ్యతలను మంత్రి శ్రీహరికి అప్పగిస్తే నెల రోజుల్లో పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకానికి ఇక ఏ అడ్డంకులూ లేవు. ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తాం. ఏడాదిన్నర లోపు పనులు పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు నీరందిస్తాం. రైల్వేలైన్ కోసం పరిగి ఎమ్మెల్యే ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. వికారాబాద్– కృష్ణా రైల్వే మంజూరు పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తయ్యాయి.
మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసి పరిగి, కొడంగల్‌లో రైలు కూత వినిపిస్తాం. సుద్ద గనులు మన దగ్గర ఉంటే సిమెంటు కంపెనీలు కర్ణాటకలో ఉండేవి. మన ఖనిజ సంపదంతా అక్కడకు తరలివెళ్లేది. ఇప్పుడు పరిస్థితి మారింది. వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గంలో సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి.
మెడికల్, ఇంజనీరింగ్, ఏటీసీ సెంటర్, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ ఇలా అన్ని విద్యా సంస్థలు ఇప్పుడు కొడంగల్‌లో ఏర్పాటు అవుతున్నాయి. ఏడాదిన్నరలోపు ఎడ్యుకేషన్ హబ్ పనులు పూర్తవుతాయి. ఉపాధి అవకాశాలు లేక పేదలు పూణే, బాంబేలకు వలసలు వెళ్లేవారు.. నేడు మన దగ్గరే పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పింస్తున్నాం.
పేదల తిరుపతిగా
కొడంగల్ వెంకటేశ్వరాలయం తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా పేదల తిరుపతిగా విరాజిల్లుతోంది. ఇప్పుడు పునరి్నర్మాణ పనులు చేపట్టి తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతానికి చెందిన ఆగమ శాస్త్ర పండితులు సుందర వరదాచార్యుల సలహా ప్రకారమే తిరుపతిలో అన్ని కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఇక్కడ భూమి పూజ కూడా ఆయన పెట్టిన ముహూర్తానికే చేశాం. కానీ ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోవటం ఎంతో లోటు. ఈ ప్రాంత ప్రజలు ఆయనను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఆలయంలోని ఓ విడిదికి వరదాచార్యుల పేరు పెడతాం.
వెనుకబాటుకు గురయ్యాం..
గురునాథ్‌రెడ్డి కొడంగల్ నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయారు. కొడంగల్ అభివృద్ధికి ఆనాడు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి గెలిచిన వారెవరూ మంత్రి కాలేకపోయారు. దీంతో అభివృద్ధిలో వెనుకబాటుకు గురయ్యాం. ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడ్డా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అన్న తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం.
అభివృద్ధిలో కలిసిసాగాలి
పార్టీలకతీతంగా నాయకులు, సర్పంచ్‌లు కలిసొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాం. రాష్ట్రంలోనే కొడంగల్ ఎత్తయిన ప్రాంతం. నీరు వచ్చే అవకాశం లేకపోయింది. కందులు తప్ప వడ్లు పండించే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి తండా, ప్రతీ పంచాయతీకి రోడ్డు నిర్మించుకున్నాం. ఇంకా ఎక్కడ ఏం అవసరం ఉన్నా చేసుకుందాం. కార్యకర్తలు, నాయకుల కష్టంతోనే నేను ఈ స్థాయికి వచ్చా.. కొడంగల్ కార్యకర్తల ఆశీర్వాదంతో ముఖ్యమంతి పదవి వచ్చింది.. దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుకుందాం.
ఏది కావాలన్నా చేసుకుందాం..
2,300 ఎకరాల్లో ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎయిర్‌పోర్టు నుంచి కోస్గి వరకు 300 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మించుకుంటున్నాం. 2009లో మీరు నాటిన మొక్క నేడు చెట్టుగా మారింది. సీఎంగా మీముందు కూర్చుంది.. ఏది కావాలన్నా కొదవ లేకుండా చేసుకుందాం’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యార్, కార్పొరేషన్ల చైర్మన్లు గురునాథ్‌రెడ్డి, కల్వ సుజాత, కలెక్టర్ దీపక్‌తివారి తదితరులు పాల్గొన్నారు.


