తుమ్మిడిహెట్టి కోసం.. మళ్లీ సంప్రదింపులు | CM Revanth, Minister Uttam to visit Maharashtra | Sakshi
Sakshi News home page

తుమ్మిడిహెట్టి కోసం.. మళ్లీ సంప్రదింపులు

May 6 2026 1:53 AM | Updated on May 6 2026 1:53 AM

CM Revanth, Minister Uttam to visit Maharashtra

అపాయింట్‌మెంట్‌ కోసం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ 

వారంలో మహారాష్ట్రకు వెళ్లనున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌ 

150 మీ. ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి సమ్మతి కోసం ప్రయత్నాలు 

మహారాష్ట్ర ఒప్పుకుంటే గ్రావిటీతో ఎల్లంపల్లికి ప్రాణహిత  

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆదిలాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగిరం చేసింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 150 మీటర్లకు ఎత్తును పెంచి తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మించుకోవడానికి మహారాష్ట్ర అంగీకారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తక్షణమే సంప్రదింపులను ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వారం రోజుల్లో మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇందుకోసం ఫడ్నవీస్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మిస్తే లిఫ్టు అవసరం లేకుండానే గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్టుకి తరలించవచ్చు. దీంతో ప్రాజెక్టు వ్యయం సైతం భారీగా తగ్గనుంది.  

ఫడ్నవీస్‌ మహారాష్ట్రలో విపక్షనేతగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బరాజ్‌ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురికానున్న రైతుల ఆందోళనలకు సైతం ఆయన మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఫడ్నవీస్‌ మహారాష్ట్ర సీఎం అయ్యాక ఆయనతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. 2016 మార్చి 8న నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్రకు వెళ్లి 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణానికి ఫడ్నవీస్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మించి 165 టీఎంసీల జలాలను తరలించడానికి 2015 ఫిబ్రవరి 13న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తోపాటు పలు అనుమతులు సైతం వచ్చాయి. 

పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో బహిరంగ విచారణ నిర్వహించగా, మహారాష్ట్రలో చేపట్టలేకపోయారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న కారణంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించింది. ప్రస్తుతం ఈ మూడు బరాజ్‌లు విఫలమై కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ఎల్‌ నినో ప్రభావంతో వచ్చే 2–7ఏళ్ల పాటు తీవ్ర వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేసింది. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే గ్రావిటీతో నీళ్లను తరలించుకోవచ్చని, కనీసం 129.23 టీఎంసీల నీటి లభ్యత ఉండనుందని ప్రభుత్వం అంచనాకు వచి్చంది. ఆ మేరకు ఎత్తు పెంచినా మహారాష్ట్రలో పెద్దగా ముంపు పెరగదని భావిస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement