
ఖమ్మంలో బుధవారం జరిగే బీఆర్‌ఎస్ సభకు ముస్తాబైన సభాస్థలి, ప్రధాన వేదిక
ఖమ్మం నుంచి సాక్షి ప్రతినిధి: ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి బలమైన పునాదులు వేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మంలో బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌తో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలు వేదిక పంచుకోనున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారుతుందని చెబుతూ వస్తున్న కేసీఆర్.. ఖమ్మంలో మరింత బలంగా ఈ సందేశాన్ని ఇవ్వనున్నారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, దానిని నడిపే శక్తి బీఆర్‌ఎస్‌కు ఉందనే సంకేతాలను ఈ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకుల చేరికలు, పార్టీల విలీనానికి సంబంధించిన ప్రకటన కూడా ఇక్కడ చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ సత్తా చాటేలా భారీ జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నలుగురు సీఎంలు తొలిసారిగా..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎని మిదేళ్లలో తొలిసారిగా ఖమ్మంలో విపక్ష పార్టీలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోనున్నారు. మూడేళ్లుగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్‌మాన్, నవీన్ పట్నాయక్, స్టాలిన్, పినరయి విజయన్, హేమంత్ సొరేన్‌తో పాటు శరద్‌పవార్, శంకర్‌సింగ్ వఘేలా, అఖిలేశ్ యాదవ్, గిరిధర్ గొమాంగో, ఠాక్రే లాంటి పలువురు మాజీ సీఎంలతో కేసీఆర్ భేటీ అవుతూ వస్తున్నారు. తాజాగా ఖమ్మం బహిరంగ సభకు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను రప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటుపై కేసీఆర్ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే బుధవారం జరిగే సభ ద్వారా ఈ మేరకు సంకేతాలు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. తృతీయ కూటమిని నడిపే సత్తా కేసీఆర్‌కు ఉందనే సంకేతాలు ఈ సభ ద్వారా ఇచ్చేందుకే భారీ బల ప్రదర్శనకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోందని చెబుతున్నారు. సుమారు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి రాగా, కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో బలాన్ని కోల్పోతూ వచ్చింది. ఉత్తరాదిన ఆప్, సమాజ్‌వాదీ, ఆర్‌జేడీ, జనతాదళ్ (యూ) వంటి పార్టీలు ప్రబల రాజకీయ శక్తులుగా ఉండటం, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి వస్తుండటం, దక్షిణాదిలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఏర్పాటు ద్వారా తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఖమ్మం సభ దోహదపడుతుందని భావిస్తున్నారు.
మరోవైపు ఇదే సభలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూడిన తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ సభలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, దళితబంధు లాంటి సంక్షేమ పథకాలను వివరించనున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ఆరంభంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఖమ్మం సభ నుంచే కేసీఆర్ సమరశంఖం పూరించే అవకాశముందని అంటున్నారు.
వ్యూహాత్మకంగా ఖమ్మం ఎంపిక
బహిరంగ సభ నిర్వహణకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న ఖమ్మంను కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు టీడీపీ, వైఎస్సార్‌టీపీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెక్ పెట్టేందుకే ఖమ్మంను ఎంపిక చేసినట్లు సమాచారం.