ఒంటరితనం.. ఇరవై ఏళ్ల యువతి ఆవేదన | 45 to 50 Calls to Roshni Trust For Mental Sickness Patients | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. హెల్ప్‌ మీ!

Aug 18 2020 11:07 AM | Updated on Aug 18 2020 11:07 AM

45 to 50 Calls to Roshni Trust For Mental Sickness Patients - Sakshi

‘అమ్మా, నాన్నలను కరోనా కబళించింది. అన్నయ్య మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో ఉన్నాడు. ఇంక నేనెందుకు బతకాలి..’ ఓ ఇరవై ఏళ్ల  యువతి ఆవేదన.  

‘ఉద్యోగం పోయింది. ఎలాంటి ఉపాధి లేదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. భవిష్యత్తు మరింత భయంకరంగా కనిపిస్తోంది.’ ఒక ప్రముఖ టెక్స్‌టైల్‌ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి చుట్టూ కమ్ముకున్న భయాందోళన. 

‘ఇంట్లో అంతా ఉన్నా ఒంటరితనం వెంటాడుతోంది. ఎక్కడికైనా దూరంగా వెళ్లాలనిపిస్తోంది. ఎవరి మీదో తెలియదు. ఎందుకో అర్ధం కాదు. చాలా కసిగా, కోపంగా, అసహనంగా ఉంది.’ ఓ యువతి రోదన..    

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ స్వచ్చంద సంస్థ రోష్నికి  వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ఇవి. కోవిడ్‌ వైరస్‌ వ్యాపించి 200 రోజులైంది. ఈ కాలంలో వేలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. అనేక మంది చనిపోయారు. వైరస్‌ ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. తీవ్రమైన అనిశ్చితి  నెలకొంది. దీంతో అనేక రకాల మానసిక సమస్యలు, ఆందోళనలు పెరుగుతున్నట్లు రోష్ని నిర్వాహకులు  తెలిపారు. నిరాశా నిస్పృహలు, ఒంటరితనం, నిస్సహాయత, ఆత్మహత్యా ప్రవృత్తి వంటి సమస్యలపైన  బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి  పరిష్కారం చూపుతున్నారు. వారిలో భరోసాను, ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని పెంచుతున్నారు.

మార్చి నుంచి ఇప్పటి వరకు  ప్రతి నెలా  సగటున 950 నుంచి 1250 కి పైగా  ఫిర్యాదులు  వస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.ఉషశ్రీ తెలిపారు. ప్రతి ఫిర్యాదును నిపుణులు పరిశీలించి సహేతుకమైన పరిష్కారాన్ని చూపుతున్నట్లు చెప్పారు. సాధారణ రోజుల్లో కేవలం 15 నుంచి 20 వరకు ఫిర్యాదులు రాగా ఇప్పుడు ఆ సంఖ్య 45 నుంచి 50కి పెరిగింది. కోవిడ్‌ మహమ్మారి ఉ«ధృతి పెరగడం వల్ల   తిరిగి ఎప్పటి వరకు సాధారణ పరిస్థితులు నెలకొంటాయో తెలియని అనిశ్చితి భయాందోళనలను రెట్టింపు చేస్తోంది. ఈ  క్రమంలో రోష్ని సంస్థ ప్రత్యేకంగా   15 మంది మానసిక నిపుణులు, వివిధ రంగాలకు చెందిన  ప్రముఖులతో ఒక కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఆన్‌లైన్‌ ద్వారా పని చేస్తోంది. బాధితుల నుంచి సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి మానసిక నిపుణుల ద్వారా  పరిష్కారాలను సూచిస్తున్నారు. మానసిక చికిత్స అవసరమైన వారికి సికింద్రాబాద్‌ సింధ్‌ కాలనీలోని సంస్థ కార్యాలయంలో సైకియాట్రిస్టుల ద్వారా ఉచిత కౌన్సెలింగ్, మందులు అందజేస్తున్నారు.  

ఒక్కో నెలలో ఒక్కో రకమైన సమస్యలు.... 
ఒక్కో నెలలో ఒక్కో రకమైన సమస్యలపైన జనం ఆందోళనకు గురవుతున్నారు.  గత 6 నెలలుగా ఈ మానసిక స్థితిగతులకు అనుగుణంగానే రోష్నికి సమస్యలు  వెల్లువెత్తాయి. గృహహింస, ఒంటరితనం, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలపైన బాధితులు రోష్నిని ఆశ్రయించారు. ఇక జూలై, ఆగస్టు నెలల్లో కరోనా భయంతో పాటు భవిష్యత్తుపైన బెంగ ప్రత్యేకించి విద్యార్థులు, యువతీ యువకులు తమ కెరీర్‌పైన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వస్తే ఎలా ఎదుర్కోవాలనే  భయంపైన  ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.  

ఇప్పటి వరకు రోష్నికి వచ్చిన ఫిర్యాదులు–పరిష్కారాలు (సుమారుగా)  
మార్చి, ఏప్రిల్‌ : 975, 
మే: 1206, జూన్‌:1121, జూలై : 1220 
ఆగస్టు ఇప్పటి వరకు : 850  (సుమారుగా) 

హెల్ప్‌లైన్‌ నెంబర్‌లు  
1) 040– 66202000,   040–66202001
2) రోష్ని హెల్ప్‌లైన్‌ ఎట్‌దిరేట్‌ జీమెయిల్‌ డాట్‌కామ్‌కు కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంటాయి. పరిష్కారం లభిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement