
వినియోగదారుడికి దక్కిన విజయం
కారు పార్కింగ్ బదులు
రూ.10 లక్షలు చెల్లించిన ప్రతివాది
సిటీ కోర్టులు : ఓ వ్యక్తి 20 ఏళ్లుగా కారు పార్కింగ్ కోసం కోర్టులో పోరాటం చేసి విజయం సాధించాడు. దీంతో బాధితుడికి ప్రతివాది కారు పార్కింగ్‌కు బదులు రూ.10 లక్షలు చెల్లించాడు. జాతీయ స్థాయిలో కూడా పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో ఇటీవల రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం పిటిషన్‌ను ముగించింది. వివరాల్లోకి వెళితే.. కే.శివరావు అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. 2008లో కారు పార్కింగ్ విషయమై కేసు దాఖలు చేసిన అతను 20 ఏళ్ల తర్వాత విజయాన్ని సాధించాడు. 2006లో శివరావు మలేషియన్ టౌన్‌షిప్, రెయిన్ ట్రీ పార్క్ , ఏ బ్లాక్ లో ప్లాటు కొనుగోలు చేశాడు. కారు పార్కింగ్ కోసం డబ్బులు విడిగా చెల్లించినా అతడికి పైపులు లీకయ్యే చోట ఇరుకు, అసౌకర్యమైన పార్కింగ్‌ను కేటాయించారు.
తన పార్కింగ్‌ను మార్చాలని పలుమార్లు నిర్వాహకులను కోరినా పట్టించుకోలేదు. దీంతో ప్రతివాది ఏపీహెచ్ బీ. ఐజేఎమ్ టూ జాయింట్ వెంచర్ అయిన సిట్కో ప్రైవేట్ లిమిటెడ్ పై 2008 లో రంగారెడ్జి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేశాడు. జిల్లా కమిషన్ 2011 ఏప్రిల్ 21న ఫిర్యాది కి అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రతివాది రాష్ట్ర కమిషన్‌లో అప్పీలు చేయగా 2013 అక్టోబర్ 11న రూ.10 వేల జరిమానా విధిస్తూ అప్పీలు కొట్టివేయడంతో సిట్కో జాతీయ వినియోగదారుల కమిషన్ లో రివిజన్ పిటీషన్ దాఖలు చేసింది. అక్కడ కూడా 2020 అక్టోబర్ 27 న శివరావు స్వయంగా వాదించి విజయం సాధించాడు.
స్టేట్ కమిషన్ తీర్పు తర్వాత 2014 తీర్పు అమలు పిటీషన్ వేసినా రివిజన్ పిటీషన్ మూలంగా అమలు వాయిదా పడుతూ వచి్చంది. ఈ పిటీషన్ కూడా 11 ఏళ్లు నడిచి ఆగసుŠట్ 11న ముగిసింది. కారు పార్కింగ్ కేటాయించే అవకాశం లేనందున ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం గా రూ.10 లక్షలు చెల్లించేందుకు అంగీకరిస్తూ ప్రతివాది ఆ డబ్బు శివరావు ఖాతాలో జమ చేయడంతో రంగారెడ్డి కమిషన్ ప్రెసిడెంట్ లతాకుమారి, సభ్యుడు జవహర్ బాబు తీర్పు అమలు కావడంతో పిటీషన్‌ను ముగించారు.
న్యాయస్థానాలపై నమ్మకమే గెలిపించింది..
–కే.శివరావు
న్యాయస్థానాలపై నమ్మకంతోనే నేను ఇంత వరకు పోరాడి విజయం సాధించగలిగాను. నా నమ్మకం వృథా కాలేదు. నాకు జరిగినా అన్యాయానికి ఎప్పటికైనా న్యాయం దక్కుతుందని ఈ 20 ఏళ్లుగా ఒంటరిగా పోరాటం చేశాను. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి కోర్టు వరకు పోరాడ గలిగాను అంటే అది కేవలం న్యాయ స్థానాలు బాధితుల పట్ల తీసుకునే ప్రత్యేక శ్రద్ధ అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. న్యాయస్థానాలకు ప్రత్యేక కృతజ్ఞతలు.