18-60 Year Olds Need At Least 7 Hours Of Sleep In Day - Sakshi
Sakshi News home page

మీరు నిద్రించే సమయం ఇదేనా? తేడా వస్తే కష్టమే! ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు

Published Fri, Jan 27 2023 1:39 AM

18 60 Year Olds Need At Least 7 Hours Of Sleep In Day - Sakshi

చిన్నా పెద్దా అని తేడా లేదు.. చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది.. పైకి తెలియకుండానే శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోంది. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు, విద్యాపరంగా ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో కెరీర్‌పై ఫోకస్‌ పెరగడంతో నెలకొన్న ఒత్తిడి వంటివి ఒకవైపు అయితే.. విపరీతంగా స్క్రీన్‌ టైమ్‌ (ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, టీవీ చూడటం వంటివి) పెరిగిపోవడం మరోవైపు దీనికి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కోవిడ్‌ కారణంగా గత మూడేళ్లుగా నెలకొన్న పరిస్థితులు, రోజువారీ జీవన విధానంలో వచ్చిన మార్పులూ సమస్య పెరగడానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, వైద్య సంస్థలు అధ్యయనం చేసి.. నిద్ర లేమి కారణాలు, దీనివల్ల తలెత్తుతున్న సమస్యలపై నివేదికలు విడుదల చేశాయి. ఆ అంశాలపై ఓ లుక్కేద్దాం.    
– సాక్షి, హైదరాబాద్‌

7 నుంచి 9 గంటల నిద్ర వల్ల ప్రయోజనాలివీ..
►18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కనీసం 7 గంటల రాత్రి నిద్ర అవసరం.
►తగినంత నిద్రతో రోగ నిరోధక శక్తి ఉత్తేజితం అవుతుంది. అనారోగ్యం బారినపడే అవకాశాలు తగ్గుతాయి.
►ఒకవేళ ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగినా వేగంగా కోలుకోగలుగుతారు.
►7 నుంచి 9 గంటల మధ్య నిద్రతో జ్ఞాపకశక్తి, సృజనాత్మకత మెరుగుపడుతుంది.
►ఏకాగ్రత కూడా పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. 
►రోజువారీ వ్యక్తిగత జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది.

సమస్యను అధిగమించేందుకు ఇలా చేయొచ్చు
► క్రమం తప్పకుండా రోజూ అరగంటకుపైగా వ్యాయామం, నడక
►రాత్రి మితంగా భోజనం చేయాలి. సాయంత్రాలు సిగరెట్లు, మద్యం, పొగాకు వంటివి తీసుకోవద్దు.      
►వీకెండ్స్, ఆదివారాలు సహా అన్నిరోజుల్లో నిద్రపోయేందుకు, పొద్దున లేచేందుకు ఒకే సమయం పాటించాలి.
►బెడ్రూంలలో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్స్‌ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్‌ పరికరాలను వినియోగించొద్దు. 
►నిద్రించే చోట తగిన ఉష్ణోగ్రత, తక్కువ వెలుతురు, శబ్దాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.

5, 6 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో సమస్యలివీ..
►ఐదారు గంటల కన్నా తక్కువ నిద్రతో రోగ నిరోధక శక్తి బలహీనంగా మారుతుంది.
►ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, కుంగుబాటు వంటివి తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. 
►5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో ఊబకాయం వచ్చే అవకాశాలు 20 శాతం పెరుగుతాయి.
►జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. కొత్త అంశాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస 40%పైగా తగ్గిపోతుంది. 
►దీర్ఘకాలం నిద్ర సమయం తక్కువగా ఉంటే మానసిక సమస్యలు తలెత్తుతాయి. చిన్న విషయానికే ఆందోళన పడటం, కుంగుబాటు, షార్ట్‌ టెంపర్, ప్రతీదానికి విసుక్కోవడం, వాహనాలు నడిపేపుడు ఏకాగ్రత కోల్పోవడం వంటివి జరుగుతాయి.
►చేసే పనుల్లో తరచూ తప్పులు దొర్లడం, పనివేగం తగ్గిపోవడం, మార్పులకు తగినట్టు సర్దుబాటుకాకపోవడం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి.

నిద్ర తగ్గితే శారీరక, మానసిక సమస్యలు
గత పదేళ్లలో భారతీయుల్లో నిద్ర అలవాట్లు, పద్ధతుల్లో బాగా మార్పులు జరిగాయి. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మెదడు పనితీరును మెరుగుపర్చుకునేందుకు, ఆ రోజంతా చేసిన పనులను ఒక క్రమపద్ధతుల్లో పెట్టుకోవడానికి, ‘మెటబాలిక్‌ రియాక్షన్‌ రిథమ్‌’లో ఉండటానికి నిద్ర తోడ్ప డుతుంది. అర్ధరాత్రి దాకా మేలుకుని ఉండటం, లేవడం వంటివాటి వల్ల ‘సర్కాడియన్‌ సైకిల్‌’ దెబ్బతింటుంది. ఐదు గంటల కంటే తక్కువ నిద్ర ఉంటే.. శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.    
– సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌

ఐటీ ఉద్యోగుల్లో తీవ్రంగా సమస్య
మూడేళ్లుగా ఐటీ కంపెనీలు, ఇతర రంగాల ఉద్యోగులు అధికంగా వర్క్‌ఫ్రం హోం పద్ధతికి మారారు. ఇప్పటికీ ఈ విధానాన్ని కొనసాగిస్తున్న వారిలో సరైన నిద్రలేకపోవడం, గురక, మధ్యలో ఉలిక్కిపడి లేవడం, పొద్దున లేచాక ఫ్రెష్‌గా అనిపించకపోవడం వంటి లక్షణాలతో కూడిన ‘అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా’ సమస్య కనిపిస్తోంది.

ఈ సమస్యలతో వస్తున్న ఐటీ ఉద్యోగులకు తగిన చికిత్స అందిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రోజుకు 7, 8 గంటల నిద్ర ఉండాలి. సాయంత్రం 5 తర్వాత టీ, కాఫీ తీసుకోకపోవడం, రాత్రి 9 తర్వాత ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం ఆపేయడం మంచిది. నిద్రవచ్చినా, రాకపోయినా రాత్రి 9.30 గంటలకల్లా బెడ్‌పైకి వెళ్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.    
– వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ ఆస్పత్రి  

Advertisement
 
Advertisement
 
Advertisement