సాక్షి, చైన్నె: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పందించిన రాహుల్‌గాంధీ, స్టాలిన్‌న్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తమిళనాడులో తమతో మాట వరుసకై నా చెప్పకుండా టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో డీఎంకే తీవ్ర ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఇండియా కూటమి సమావేశాన్ని సైతం డీఎంకే బహిష్కరించింది. లోక్‌సభలో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించే విధంగా స్పీకర్‌కు విన్నవించారు. ఇక, కాంగ్రెస్‌తో కటీఫ్ అని డీఎంకే తేల్చి చెప్పేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ‘లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ఉదయం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ జన్మదిన సందేశాన్ని పంపించారు. ఇందుకు స్టాలిన్ ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్‌గాంధీ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కలిసి పోరాడుదాం:
‘మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఇండియా అనే భావనను, రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను కాపాడడంలో మనకున్న ధృఢ సంకల్పం మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే, ‘ మన ప్రజాస్వామాన్ని రక్షించుకోవడానికి సాగుతున్న ఈ పోరాటంలో మనమంతా కలిసికట్టుగా నిలబడదాం. విజయం సాధించే వరకు మన పోరాటం కొనసాగుతుంది’ అని రాహుల్‌గాంధీ పిలుపునివ్వడం తమిళనాట హాట్ టాపీగా మారింది. డీఎంకే, కాంగ్రెస్ మధ్య తమిళనాడులో తీవ్రమైన రాజకీయ విభేదాలు సాగుతున్న తరుణంలో స్టాలిన్ శుభాకాంక్షలు తెలపడం, దానికి రాహుల్‌గాంధీ అంతే ఆత్మీయంగా స్పందిస్తూ కలిసి నడుద్దామని అనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


