టార్గెట్‌ మంత్రి శేఖర్‌ బాబు | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ మంత్రి శేఖర్‌ బాబు

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

● విస్తృతంగా ఐటీ దాడులు ● ఎన్నికల వేళ చైన్నెలో కలకలం!

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్ర హిందూ ధార్మిక శాఖ మంత్రి పి.కె.శేఖర్‌ బాబును ఆదాయపు పన్ను శాఖ టార్గెట్‌ చేసింది. ఆయన కుమారులకు చెందిన సంస్థలతోపాటు సన్నిహితుల సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం ఉదయం గురి పెట్టారు. మెరుపు దాడులతో సోదాలలో నిమగ్నమయ్యారు.

కీలక ప్రాంతాల్లో సోదాలు

మంత్రి కుమారులు జయసింహన్‌, విఘ్నేష్‌లు నిర్వహిస్తున్న రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ సంస్థలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. చైన్నెలోని ప్రధాన ప్రాంతాలైన మైలాపూర్‌ (ప్రధాన కార్యాలయం), వడపళని, కీల్పాక్కం, అడయార్‌ సహా మొత్తం 5 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అలాగే, హార్బర్‌ నియోజకవర్గం పరిధిలోని మంత్రి సన్నిహితుల సంస్థలలోనూ సోదాలు జరుగుతున్నాయి.

రంగంలోకి ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌

కేవలం ఐటీ అధికారులే కాకుండా, కేంద్ర భద్రతా బలగాల పహారాతో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కూడా ఈ సోదాల్లో నిమగ్నం కావడం గమనార్హం. ఓటింగ్‌కు మరి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో భారీగా నగదు పంపిణీ జరుగుతుందన్న ఫిర్యాదు మేరకే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉదయం నుండే ప్రారంభమైన ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగిసిన తర్వాతే ఎంత నగదు లేదా ఎన్ని ఆస్తుల పత్రాలు దొరికాయనే విషయంపై స్పష్టత రానుంది. కాగా, ఎన్నికల సమయంలో అధికార పార్టీ మంత్రి కుటుంబ సభ్యులపై ఇలాంటి దాడులు జరగడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా డీఎంకే వర్గాలు అభివర్ణిస్తుండగా, పారదర్శకత కోసమే ఈ తనిఖీలని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement