ఉలిక్కిపడ్డ వెంబకోట్టై!
సాక్షి,చైన్నె : విరుదునగర్ జిల్లా వెంబకోట్టై సమీపంలో సోమవారం ఉదయం బాణాసంచా పరిశ్రమలో జరిగిన పేలుడులో ఒక కార్మికుడు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. సత్తిరపట్టిలో కన్నన్ అనే వ్యక్తికి చెందిన ఎక్సెల్ బాణాసంచా పరిశ్రమ ఉంది. సోమవారం ఉదయం 50 మందికి పైగా కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఒక గదిలో బాణాసంచా తయారీ ముడి పదార్థాల మిశ్రమం సమయంలో పేలుడు సంభవించింది. ఒక్క సారిగా ఆ పరిసరాలలో ఉత్కంఠ నెలకొంది. దీంతో వెంబకోట్టై పరిసరాల నుంచి జనం పరుగులు తీశారు. గంటకు పైగాఈ పరిసరాలలో బాంబులు పేలుతూనే ఉండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న శివకాశి అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గంటకు పైగా పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ పరిసరాలలో గంట పాటూ మోగిన బాంబుల మోత, దట్టమైన పొగ కమ్మేయడంతో మరణాల సంఖ్య పెరిగి ఉండవచ్చు అన్న కలకలం బయలుదేరింది. అయితే అక్కడున్న కార్మికులలో అనేక మంది మరో మార్గం గుండా బయటకు దూసుకెళ్లి పోయారు. అయినా ఆ మిశ్రమం తయారీ సమయంలో గదిలో ఉన్న తాయిల్పట్టికి చెందిన పాండి (38) అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పక్క పక్క గదులలో ఉన్న రాజ్‌కుమార్, సెల్వం, రమేష్, కరుప్పసామి, శాంతి (15 ఏళ్ల బాలిక), సంధ్య, ఝాన్సీ రాణి, జయ, రామలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. వీరికి శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో పక్కపక్కనే ఉన్న పదికి పైగా గదులునేలమట్టమయ్యాయి. ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక వ్యాన్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.
అధికారుల విచారణ..
శివకాశి సబ్ కలెక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్, జిల్లా ఎస్పీ శ్రీనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ పరిశ్రమ లైసెన్స్ గడువు ముగిసినా, దానిని పునరుద్ధరించకుండానే నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. కాగా సాత్తూరు ఎన్నికల ప్రచారంలో ఉన్న బిజెపి అభ్యర్థి నైనార్ నాగేంద్రన్ ప్రమాద స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులతో సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాణసంచా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


