సాక్షి, చైన్నె: తమిళనాడును దశాబ్దాలుగా పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే వల్ల తమిళనాడుకు ఒరిగింది శూన్యమని నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సీమాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలకు ప్రజలను, దేశాన్ని బాగు చేయాలనే ఆలోచన కాస్త కూడలేదంటూ మార్పు లక్ష్యంగా ప్రజలు ఓట్లు వేయాలని పిలుపు నిచ్చారు. దిండుగల్‌జిల్లా వేదచందూర్ నియోజకవర్గం ఎన్‌టీకే అభ్యర్థి ఖాజా హుస్సేన్ అహ్మద్‌కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీమాన్ ప్రసంగించారు. భారతదేశాన్ని ఎవరు పాలించాలనే పోటీ వచ్చినప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌తో జతకడుతున్నాయని మండి పడ్డారు. అదే తమిళనాడును ఎవరు పాలించాలనే విషయానికి వచ్చేసరికి ఆ జాతీయ పార్టీలు ఈ అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు.గత 60 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకేలు మార్చి మార్చి ఈ రా ష్ట్రాన్ని పాలిస్తూ కేవలం అవినీతిని, లంచగొండితనాన్ని పెంచడంలోనే పోటీ పడ్డాయని ధ్వజమెత్తారు.
విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు
ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నిస్తూ.. ప్రభుత్వం విద్యను ఉచితంగా ఎందుకు అందించడం లేదన్నారు. ఇక్కడ విద్య, వైద్యం, నీరు కూడా వ్యాపార వస్తువులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులైన కొండలను, ఇసుకను దోచుకుంటుంటే ప్రజలు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం పార్టీలు చేసే మోసాలను వివరిస్తూ సీమాన్ ఈసందర్భంగా ఒక కథను చెప్పారు. ఒక నక్క గొర్రెల వద్దకు వెళ్లి.. తాను గెలిస్తే అందరికీ దుప్పట్లు ఇస్తానని నమ్మించి గెలిచిందిని, అయితే, గెలిచిన తర్వాత ఆ గొర్రెల చర్మాలనే ఒలిచిందన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అని గొర్రెలు అడిగితే.. మీకు దుప్పట్లు ఇస్తానని చెప్పాను కదా, అందుకే మీ చర్మం తీసుకుంటున్నాన అని సమాధానం ఇచ్చిందటా అని పేర్కొంటూ, ఇప్పుడున్న పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉందని ధ్వజమెత్తారు.
మార్పు కోసం ఓటు వేయండి
తమిళనాడులో ఆకలి, పేదరికం లేని పాలన అందించడమే తమ లక్ష్యమని, మద్యం దుకాణాలను మూసివేసి, ప్రకృతిని కాపాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీమాన్ హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా పనిచేసే తమ అభ్యర్థులను చెరకు రైతు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించారు.


