వేలూరు: విద్యార్థులు చిన్నప్పటి నుంచే పరిశోధనలపై ఆశక్తి చూపాలని రిటైర్డ్ విద్యాశాఖ అధికారి పయణి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి గాంధీనగర్‌లోని తులిర్ పాఠశాలలో 23వ వార్షికోత్సవ కార్యక్రమం హెచ్‌ఎం కనక అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులు పరిశోధనలపై ఆశక్తి చూపడం ద్వారా ఉన్నత విద్యకు వెళ్లిన సమయంలో మేధావులుగా మారే అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేటి సమాజంలో చిన్న పిల్లల వద్ద సెల్‌ఫోన్‌లు ఇవ్వడాన్ని తల్లిదండ్రులు నిషేధించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను విద్యపైనే నిమగ్నం చేయకుండా ఆటలపై కూడా దృష్టి పెట్టేటట్లు చూడాలన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. తమిళనాడు ఓకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేనా జనార్దన్, తులిర్ పాఠశాల ట్రస్ట్ చైర్మన్ పయణి, విద్యార్థులు పాల్గొన్నారు.


