సాక్షి, చైన్నె: డీఎంకే నుంచి కీలక నియోజకవర్గాలను రాబట్టుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది. 35 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆదివారం ఎంపిక చేశారు. డీఎంకే కమిటీతో చర్చించి ఇందులో 28 నియోజకవర్గాలను దక్కించుకునే దిశగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ముందుకెళ్తోంది. వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ బంధం కొనసాగేనా అన్న చర్చ గత వారం వరకు సాగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు తమ బంధం గట్టిదే అని రెండు పార్టీలు చాటుకున్నాయి. కాంగ్రెస్‌కు డీఎంకే 28 సీట్లను కేటాయించింది. దీంతో ఈ నియోజకవర్గాల ఎంపికపై ఆదివారం ఏఐసీసీ సీనియర్ నేతు ముకుల్ వాస్నిక్ ఆధ్వర్యంలో కీలక భేటీ చైన్నెలో జరిగింది. ఉదయం ఒక స్టార్ హోటల్‌లో పార్టీ కీలక నేతలతో ముకుల్ వాస్నిక్ సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం సత్యమూర్తి భవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై, శాసనసభాపక్ష నేత రాజేష్ కుమార్, మాజీ నేతలు తిరునావుక్కరసర్, తంగబాలు, ఎంపీలు కార్తీ చిదంబరం, విజయ్ వసంత్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ గిరిశ్ చోదన్కర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త నియోజకవర్గాలపై గురి..
2021 ఎన్నికలలో కాంగ్రెస్ 25 చోట్ల పోటీ చేయగా 18 చోట్ల గెలిచింది. ఈ సిట్టింగ్‌లో ఒకటి ఈరోడ్ తూర్పు ఇప్పటికే డీఎంకేకు చేరింది. మిగిలింది 17 స్థానాలే. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ సీట్లను ఆశిస్తుండటం, యువజన విభాగం తమకు అఽధికంగా సీట్ల ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటం వంటి పరిణామాలు వెరసి కొత్త నియోజకవర్గాలపై సైతం కాంగ్రెస్ గురి పెట్టింది. ఇందుకు అనుగుణంగా తాజాగా జరిగిన సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలువురు సిట్టింగ్‌లకు ఈసారి సీట్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అలాగే గతంలో తాము ఓటమి పాలైన స్థానాలను ఈ సారి కాంగ్రెస్ ఎంచుకోనట్టు సమాచారం. డీఎంకే 28 సీట్లు ఇవ్వగా, 35 అసెంబ్లీ నియోజక వర్గాలతో జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేయడం గమనార్హం. వీటిలో 28 నియోజకవర్గాలను కై వశం చేసుకునే దిశగా డీఎంకే కమిటీతో చర్చలకు సన్నద్దమయ్యారు. తాజా జాబితాలో అంబత్తూర్, శ్రీపెరంబుదూర్, ఎగ్మూర్, టి. నగర్. షోళింగనల్లూరు, కడలూరు , బన్రూటి, మైలాడుతురై, అరంతాంగి, కారైకుడి, శివకాశి, శ్రీవైకుంఠం, కిల్లియూరు, కుళచల్, విలవన్ కోడ్, మదురై ఉత్తరం, మదురై మేలూరు, కోయంబత్తూరు, ఈరోడ్ తూర్పు, వేదారణ్యం, తిరుప్పోరూర్ నియోజకవర్గాలను ఎలాగైనా రాబట్టుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో కొన్ని డీఎంకే, మరికొన్ని కూటమిలోని ఇతర పార్టీల సిట్టింగ్ సీట్లు ఉండటం బట్టి చూస్తే, ఈకేటాయింపు మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
కొత్తవారికి అవకాశం ఇవ్వండి..
ముకుల్ వాస్మిక్‌ముందు నేతలు, యువత కీలక డిమాండ్లను ఉంచారు. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి ఈసారి టికెట్లు ఇవ్వకూడదని ఒత్తిడి తెచ్చారు. క్రిమినల్ కేసులు ఉన్నవారికి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను దూరంగా ఉంచాలని కోరారు. నియోజకవర్గాల్లో చురుగ్గా పనిచేస్తున్న యువ నాయకులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతల కూడా అనంతరం సమావేశం నిర్వహించారు. తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారు. త్వరలోనే పుదుచ్చరిలో సీట్ల పంపకాలతో పాటుగా, నియోజకవర్గాల విషయంగా డీఎంకే చర్చల కమిటీతో కాంగ్రెస్ బృందం సమావేశం నిర్వహించాలని కోరారు.


