ఫోర్డ్‌ పునరాగమనం | - | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ పునరాగమనం

Nov 1 2025 7:46 AM | Updated on Nov 1 2025 7:46 AM

ఫోర్డ

ఫోర్డ్‌ పునరాగమనం

● సీఎం సమక్షంలో ఒప్పందాలు ● రూ. 3,250 కోట్ల పెట్టుబడి ● చిచ్చు పెట్టొద్దు: పీఎంకు సీఎం

సీఎం స్టాలిన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న కంపెనీ ప్రతినిధులు

సాక్షి, చైన్నె : అమెరికా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ మళ్లీ తమిళనాడులోకి ప్రవేశించింది. చెంగల్పట్టు జిల్లా మరమలై నగర్‌లో నెక్ట్స్‌ జనరేషన్‌ వెహికల్‌ ఇంజిన్ల తయారీ లక్ష్యంగా రూ.3,250 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు శుక్రవారం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ సమక్షంలో జరిగాయి. తమిళనాడు భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాల్లో తయారీ, ఎగుమతుల్లో అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తున్న విషయం తెలిసిందే. 2024–25 ఆర్థిక సర్వే మేరకు పెట్టుబడులను ఆకర్షించడంలో, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడంలో, తమిళనాడు దూసుకెళుతున్నట్టు తేలింది. 2030 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడం లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించడంలో విస్తృత కార్యాచరణతో పాలకులు ముందుకెళుతున్నారు.

ఫోర్డ్‌తో అవగాహన ఒప్పందం

చెంగల్పట్టు జిల్లా మరమలైనగర్‌లో ఫోర్డ్‌ కార్ల తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు గత కొన్నేళ్లుగా కార్ల ఎగుమతి జరిగింది. అయితే, గత పాలనలో చోటు చేసుకున్న పరిణామాలతో క్రమంగా ఫోర్డు యాజమాన్యం ఉత్పత్తిని తగ్గించుకుంది.

తాజాగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఆగడంతో ఫోర్డు మూతపడే పరిస్థితి నెలకొంది. గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం స్టాలిన్‌ ఫోర్డు సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. తమిళనాడులో ఉత్పత్తికి మళ్లీ శ్రీకారం చుట్టాలని కోరారు. ఇందుకు తమ వంతుగా పూర్తి సహకారం, ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. మరమలైనగర్‌లో మళ్లీ ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని విన్నవించారు. ఇందుకు ఫోర్డ్‌ యాజమాన్యం స్పందించింది. తాజాగా పునాగమనం చేస్తూ రూ.3,250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఫోర్డు తయారీ ప్లాంట్‌లో మళ్లీ ఉత్పత్తి ప్రక్రియతోపాటుగా తాజా పెట్టుబడితో కార్ల ఇంజిన్‌ తయారీ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. తద్వారా 600 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, పరిశ్రమలు, పెట్టుబడి, వాణిజ్యశాఖ మంత్రి టీఆర్‌బీ రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌ మురుగానందం, వాణిజ్యశాఖ కార్యదర్శి వీ అరుణ్‌రాయ్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దారేస్‌ అహ్మద్‌, ఫోర్డ్‌ కార్పొరేషన్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ ఎవెరిట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మాథ్యూ కోటిలోస్కీ, థాయిలాండ్‌ ప్రాజెక్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిమోనెట్టా వెర్డి, డైరెక్టర్‌ (ప్రొడక్షన్‌) ధీరజ్‌ దీక్షిత్‌, డైరెక్టర్‌ శ్రీపత్‌ భట్‌, ఇతర సీనియర్‌ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

నాడు కార్ల కంపెనీల్లో దిగ్గజం ఫోర్డ్‌. చెంగల్పట్టు జిల్లా మరమలై నగర్‌ కేంద్రంగా విలాసవంతమైన కార్లను తయారు చేసి, విదేశాలకు సైతం ఎగుమతి చేసింది. అలాంటి కంపెనీ తమిళనాడు నుంచి నిష్క్రమణ దశకు చేరింది. అయితే సీఎం స్టాలిన్‌ ప్రత్యేక చొరవ తీసుకుని, ఫోర్డ్‌ పునరాగమనానికి కృషి చేశారు. దీంతో ఆ సంస్థ మళ్లీ తమిళనాట పెట్టుబడులకు సిద్ధమైంది. ఇందుకు సీఎం స్టాలిన్‌ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి

చిచ్చు పెట్టొద్దు: సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌ ఎన్నికల ప్రచార సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాట కొత్త చర్చకు దారి తీశాయి. బీహారీలను డీఎంకే వేధిస్తున్నట్టుగా పీఎం వ్యాఖ్యానించడాన్ని పరిగణించిన సీఎం స్టాలిన్‌ ఎక్స్‌ పేజీ వేదికగా ఎదురు దాడి చేశారు. ప్రధానమంత్రి తన బాధ్యతలను మరచిపోకూడదని హితవు పలికారు. ఇలాంటి ప్రసంగాలతో తన బాధ్యత, గౌరవాన్ని కోల్పోకూడదని సూచించారు. తమరు ఎక్కడికి వెళ్లినా, అది ఒడిశా అయినా, బిహార్‌ అయినా సరే తన రాజకీయం కోసం తమిళనాడు, తమిళ ప్రజలను వాడుకోవడం భావ్యమా? అని ప్రశ్నించారు. తమిళులపై ఎందుకు ఇంత ద్వేషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితంగా, భిన్నత్వంలో ఏకత్వాన్ని కనుగొనే గర్వించదగ్గ భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, తమిళులు, బిహార్‌ ప్రజల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేలా వ్యవహరించడం వంటి రాజకీయ కుట్రలను ఆపుకోవాలని హితవు పలికారు. దేశ సంక్షేమంపై దృష్టి పెట్టాలే గానీ, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు తగవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని చేసిన వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఉద్యోగాల్లో స్కామ్‌ వెలుగులోకి వచ్చిన దృష్ట్యా, దాన్ని డైవర్షన్‌ చేయడానికి ప్రధాని చేసిన వ్యాఖ్యలను తెర మీదకు తెచ్చారని ధ్వజమెత్తారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ స్పందిస్తూ, ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఉన్నట్టుందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కోయంబత్తూరులో తమిళులను అవమానిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి పక్ష నేత పళణిస్వామి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి కొందరు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఫోర్డ్‌ పునరాగమనం 1
1/1

ఫోర్డ్‌ పునరాగమనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement