యువత సాంకేతికతను ఉపయోగించాలి
కొరుక్కుపేట: పెద్దలు, సమాజం, వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలో యువత సాంకేతికతను ఉపయోగించాలని చైన్నెలోని రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ రాచా అరిబార్గ్ పిలుపునిచ్చారు. వీఐటీ చైన్నెలో టెక్నోవిట్ 10వ వార్షిక ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది. విద్యార్థులు అనేక సాంకేతిక కార్యక్రమాల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశమంతటా, థాయిలాండ్, పోలాండ్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీనన్స్, మయన్మార్, తైవాన్, ఉజ్బెకిస్తాన్ తదితర 10 దేశాల నుంచి 10 వేల మందికి పైగా విద్యార్థులు మూడు రోజుల టెక్నో వీఐటీ 2025 కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి రాచా అరిబార్గ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. హెచ్‌సీఎల్‌టెక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రినన్స్ జయకుమార్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. వీఐటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం అధ్యక్షత వహించారు. అరిబార్గ్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ , సైన్స్ రంగాల్లో పనిచేసే యువత వృద్ధులకు, సమాజానికి సహాయం చేయడానికి , వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి కూడా దోహదపడాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు పొందిన జ్ఞానం వారు నేర్చుకున్న దానికంటే మించి ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, డిజిటల్ అంతరం తీవ్రమైన సమస్యగా ఉందని, యువకులు, వృద్ధుల మధ్య జ్ఞాన అంతరం ఉందన్నారు. దీన్ని తొలగించడానికి పెద్దలతో కొంత సమయం గడపాలని, లేకుంటే వారు వెనుకబడిపోతారని, వారి దైనందిన జీవితంలో సాంకేతికతను ఉపయోగించలేరని చెప్పారు. యువత తమ కుటుంబాల్లోని వృద్ధులతో , సమాజంలోని ఇతరులతో తరచుగా సంభాషించాలని విజ్ఞప్తి చేస్తూ, వారి జీవితాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు 150కి పైగా సాంకేతిక కార్యక్రమాలు జరుగనున్నాయన్నారు. మొత్తం బహుమతుల విలువ రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. వీఐటీ చైన్నె ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ టి.త్యాగరాజన్, వీఐటీ చైన్నె డైరెక్టర్ డాక్టర్ కె.సత్యనారాయణన్, అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ పి.కె. మనోహరన్ కూడా హాజరయ్యారు.


