సెంగోట్టయన్‌కు ఉద్వాసన
– వేటు వేసిన పళణి
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ పార్టీ నుంచి ఉద్వాసన పలికారు. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శుక్రవారం ప్రకటించారు. కొంగు మండలంలో గౌండర్ సామాజిక వర్గం బలమైన నేతగా సెంగోట్టయన్ అన్నాడీఎంకేలో ఉంటూ వస్తున్నారు. పళణి స్వామి సైతం ఇదే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ, పార్టీలో ఆయన కంటే సీనియర్ సెంగోట్టయన్. దివంగత నేత ఎంజీఆర్, జయలలితల హయాంలో కొంగు మండలంలో సెంగోట్టయన్ చక్రం తిప్పేవారు. వారు జీవించి ఉన్నంత కాలం కొంగు మండలంలోని జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నాడీఎంకేకు కంచు కోటే. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు అధికారం దూరమైనా, అత్యధిక సీట్లలో కొంగు మండలమే విజయాన్ని దరి చేర్చిందని చెప్పవచ్చు. ఈ కొంగు మండలంలో ఆది నుంచి కీలకంగా ఉంటూ వచ్చిన నేత ప్రస్తుతం పళనిస్వామికి వ్యతిరేకంగా స్వరం విప్పడం అన్నాడీఎంకేలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీ పదవుల నుంచి తప్పించారు. తాజాగా దేవర్ జయంతి వేదికగా అన్నాడీఎంకే బహిష్కృత నేతలు పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్‌తో సెంగోట్టయన్ చేతులు కలిపారు. పన్నీరు, టీటీవీ, సెంగోట్టయన్, దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళలు ఒకే వేదిక మీదకు రావడం అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీసింది. ఇక, అన్నాడీఎంకేలోని అసంతృప్తి వాదులందర్నీ తమ వైపునకు తిప్పుకుని, పళణి స్వామిని ఇరకాటంలో పెట్టే వ్యూహంతో వీరు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో సెంగోట్టయన్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ పళణిస్వామి నిర్ణయం తీసుకున్నారు. ఇది కొంగు మండలం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ప్రధానంగా గౌండర్ సామాజిక వర్గం రెండు ముక్కలయ్యే పరిస్థితి కొంగు మండలంలో నెలకొంది. తనను పార్టీ నుంచి తప్పించడం గురించి సెంగోట్టయన్ స్పందిస్తూ, ఇది ముందే ఊహించిన పరిణామం అని, తనను పార్టీ నుంచి తొలగించినా, తాను ఆనందంగానే ఉన్నట్టు వ్యాఖ్యానించారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ, దినకరన్, పన్నీరు, సెంగోట్టయన్ తదుపరి కార్యాచరణపై అన్నాడీఎంకే వర్గాలు నిశితంగా పరిశీలించే పనిలో పడ్డారు. అదే సమయంలో వీరికి బీజేపీ ఢిల్లీ పెద్దల మద్దతు అన్నది దక్కకుండా ముందు జాగ్రత్తలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా తిరునల్వేలిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను అన్నాడీఎంకే సీనియర్లు ఆర్‌బీ ఉదయకుమార్ నేతృత్వంలో వెళ్లి కలిసి రావడం గమనార్హం.


