సీబీఐ దర్యాప్తు వేగవంతం
సంఘటనా స్థలంలో విచారణ సాక్షుల వద్ద వివరాల సేకరణ
సాక్షి, చైన్నె : కరూర్ ఘటనపై వేలుస్వామిపురంలోని స్థానికుల వద్ద నుంచి సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. స్థానిక పోలీసులు, స్థానికుల వద్ద సీబీఐ అధికారులు విచారించే పనిలో పడ్డారు. కరూర్‌లో గత నెల తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. ఇందులో 41 మంది మరణించగా 160 మంది గాయపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాగే సీబీఐ ఆదేశాల మేరకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిటీ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. గత వారం విచారణ మందగించినా, గురువారం నుంచి వేగం పుంజుకుంది. సీబీఐ అధికారులు సంఘటనా స్థలంలో పలుసార్లు పరిశీలించారు. ఆ రోజు విధుల్లో ఉన్న స్థానిక పోలీసు అధికారుల నుంచి విచారణ మొదలెట్టారు. సంఘటన జరిగిన రోజున పరిస్థితి, విజయ్ వచ్చి వెళ్లినానంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి సమగ్రంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సీబీఐ బృందానికి వివరించారు. అలాగే, సంఘటన జరిగిన ప్రాంతంలోని దుకాణాలు, స్థానికులను సైతం విచారించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. వీరందర్నీ ఒకరి తర్వాత మరొకర్ని తమకు కేటాయించిన కార్యాలయానికి పిలిపించారు. తొలుత అక్కడున్న దుకాణాల యాజమానులు తమ వద్ద ఉన్న సమాచారాలు సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికులు , సంఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారి వద్ద పలు విషయాలను రాబట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా విజయ్ పార్టీ కార్యాలయానికి మళ్లీ బాంబు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్ పరుగులు తీసి పరిశోధించింది. ఇక, కరూర్ ఘటన తదుపరి తమిళగ వెట్రి కళగం కోశాధికారి వెంకట్రామన్ పార్టీకి దూరంగా ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఆయన పేరు కోర్ కమిటీలో లేదు. దీంతో ఆయన తప్పుకున్నట్టే అన్న చర్చ ఊపందుకుంది. అయితే తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని వెంకట్రామన్ స్పష్టం చేశారు.


