క్లుప్తంగా
తమిళసినిమా: అందాల తార నటి రష్మిక మందన్నాకు ఏమైంది? అంటూ ఆమె అభిమానులును ఇప్పుడు కలవరపడుతున్నారు. అభిమానులు నేషనల్ క్రష్‌గా పిలుచుకుంటున్న పాన్ ఇండియా కథానాయకి ఈమె. మాతృభాష కన్నడంలో నటిగా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తరువాత తెలుగు, తమిళం దాటి బాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్నారు. ఈమె నటించిన తాజా హిందీ చిత్రం థామా చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మరిన్ని చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా ఇప్పుడు తరచూ ముఖానికి మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు. అలా శనివారం చైన్నె విమానాశ్రయంలో మాస్క్ ధరించి మెరిశారు. ముఖానికి మాస్క్ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని, అందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో మరి కొద్ది రోజులు రష్మిక మందన్నా మాస్క్‌తోనే కనిపిస్తాయని ఆమె అనుచరులు తెలిపారు. కాగా రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం(తమిళం, తెలుగు) గర్ల్ ఫ్రెండ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
తిరువొత్తియూరు: చైన్నె, అంబత్తూరులో వీధి కుక్కల దాడిలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వివరాలు.. ఓరగడం అంబత్తూరు గోవిందరాజ్ వీధికి చెందిన శరవణన్ కుమార్తె తణ్మతి, పక్క ఇంట్లో ఉండే భువనేశ్వరి కుమారుడు కవిష్ ఆడుకుంటుండగా.. వీధి కుక్క కరిచి గాయపరిచింది. కుక్క కరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా చిన్నారులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
తప్పిన ప్రమాదం
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వెళ్లే ఎయిర్ ఆసియా ప్యాసింజర్ విమానం అర్ధరాత్రి 11.50 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ విమానంలో మొత్తం 190 మంది ఉన్నారు. వారిలో 182 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. విమానం రన్‌వేపైకి టేకాఫ్ అయ్యింది. తర్వాత ఓ పక్షి విమానం ముందు భాగాన్ని ఢీకొట్టి ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించింది. దీని తర్వాత పైలట్ వెంటనే చైన్నె విమానాశ్రయ నియంత్రణ గదికి సమాచారం అందించారు. విమానం ఎగరడానికి అనుమతించకుండా, చైన్నె విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో ఇంజినీర్లు విమానాన్ని పరిశీలించారు. పక్షి ఢీకొనడం వల్ల ఇంజిన్లు దెబ్బతిన్నట్లు గుర్తించి మరమ్మతు చేశారు. అయితే విమానం పనిచేయదని తేల్చడంతో ప్రయాణికులను లగ్జరీ బస్సుల్లో ఎక్కించి హోటళ్లకు తరలించారు.
తిరువొత్తియూరు: పూందమల్లి ఉప్పు కొల్లై వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న మురుగన్ (38) ఆటో డ్రైవర్. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను అదే ప్రాంతానికి చెందిన శశికళ అనే మహిళ వద్ద రూ.6.40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా మురుగన్ వడ్డీ డబ్బులు చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో శశికళ రుణం తిరిగి అడిగింది. మురుగన్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మురుగన్, అతని భార్య, తమ్ముడు కార్తీ (30) తనను అసభ్యంగా మాట్లాడారని శశికళ పూందమల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరినీ పూందమల్లి పోలీసులు శుక్రవారం విచారణకు పిలిచారు. దీంతో శుక్రవారం ఉదయం ఇద్దరూ పూందమల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి ఇద్దరినీ విచారించి, 10 రోజుల్లో తీసుకున్న డబ్బులో సగం తిరిగి చెల్లించాలని మురుగన్ వద్ద రాయించుకుని రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరినీ పంపినట్లు సమాచారం. తరువాత మురుగన్ అకస్మాత్తుగా ఆటోలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే మురుగన్‌ను పూందమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మురుగన్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయంపై పూందమల్లి పోలీసులకు సమాచారం అందించారు. మురుగన్ మృతి చెందినట్లు తెలుసుకున్న అతని బంధువులు పూందమల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులతో మురుగన్ మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకోవడానికి వెళ్లినప్పుడు, మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.


