తిరుపతి–చైన్నె హైవే నిర్మాణంలో నాణ్యతా లోపం
తిరువళ్లూరు: తిరుపతి–చైన్నె జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా ప్రారంభానికి ముందే దాదాపు రెండు కిలోమీటర్ల దూరం పగుళ్లు ఏర్పడ్డాయి. వివరాలు.. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే చైన్నె పాడి నుంచి తిరుపతి వరకు జాతీయ రహదారి నిర్మాణం చేయాలని పదేళ్లకిందట నిర్ణయించారు. అయితే పాడి నుంచి తిరునిండ్రవూర్ వరకు భూసేకరణ కష్టంగా మారడంతో పాటూ రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా వున్న దుకాణాలను తొలగిస్తే సుమారు 40 లక్షల మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం వుందని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సైతం పూర్తిగా విచారణ చేసి పాడి నుంచి తిరునిండ్రవూర్ వరకు రోడ్డు నిర్మాణం, విస్తరణ కోసం దుకాణాలను తొలగించవద్దని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు తిరునిండ్రవూర్ నుంచి తిరుపతి వరకు జాతీయ రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పనులు పూర్తయింది. దీంతో పనులు పూర్తయిన ప్రాంతాల్లో అనధికారిక రాకపోకలు సాగుతున్నాయి. ఈక్రమంలో సెవ్వాపేట నుంచి శిరుకడల్ తన్నీర్‌కుళం వరకు రోడ్డుకు ఒకవైపు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు అంచులు సైతం కోతకు గరయ్యాయి. దీంతో రోడ్డు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి కోత, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాల్లో నాణ్యతపై తనిఖీలు చేయాలని కోరుతున్నారు.


