● నాలుగు చోట్ల స్థలం పరిశీలన
● 2 వేల ఎకరాల ఎంపిక
● మరికొన్ని నగరాలలో కూడా
సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెకు అనుబంధంగా శివారులను కలుపుతూ గ్లోబల్ సిటీ రూపకల్పనకు అధికారులు అడుగులు వేశారు. నాలుగు చోట్ల స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సిటీ 2 వేల ఎకరాలలోరూపుదిద్దుకోనుంది. వివరాలు.. రాజధాని నగరం చైన్నెను ‘మహా’నగరం గా తీర్చిదిద్దేందుకు మూడవ మాస్టర్ ప్లాన్ అమలు వేగం పెరిగిన విషయం తెలిసిందే. ఆ మేరకు చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణి పేట జిల్లాలలోని ప్రాంతాలు ఈ పరిధిలోకి చేర్చారు. ప్రస్తుతం 1189 చ.కీమీ గా ఉన్న చైన్నె విస్తీర్ణాన్ని 5,904 చదరపు కి.మీ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. 2026లో పూర్తిగా చైన్నె రూపు రేఖలు మార్చే దిశగా కసరత్తుల వేగం పెరిగింది. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలు, రాణి పేట జిల్లా పరిధిలోని అరక్కోణం వరకు 1225 గ్రామాలు , ప్రాంతాలు చైన్నె మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చారు. ఇది వరకు నగరం, సబర్బన్ ప్రాంతాలుగా ఉన్న చైన్నె మహా మహానగరంగా రూపుదిద్దుకోనుంది.
ప్రాథమికంగా..
చైన్నె శివారులలో శాటిలైట్ టౌన్ సిఫ్ దిశగా ఐదారు ప్రదేశాలను ఎంపిక చేసిన ప్రాథమిక పనుల కసరత్తులు జరుగుతున్నాయి. అదే సమయంలో బడ్జెట్‌లో చేసిన ప్రకటన మేరకు చైన్నె శివారులను అనుసంధాంచే రీతిలో గ్లోబల్ సిటీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ సిటీలో విద్య, వైద్య, రవాణాకు పెద్ద పీట వేయడమే కాకుండా, ఇతరమౌళిక సదుపాయాల కల్పనకు కసరత్తులు జరుగుతున్నాయి. 2వేల ఎకరాలలో ఈ గ్లోబల్ సిటీ రూపకల్పనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అధికారులు జరిపిన సమగ్ర పరిశీలన మేరకు ఈ గ్లోబల్ సిటీ కోసం నాలుగు స్థలాలను పరిశీలించి ఉన్నారు. టిడ్కో నేతృత్వంలో ఈ స్థల పరిశీలన ప్రకియ జరిపి ఉన్నారు. ఇందులో ఒకటి చైన్నెకు ప్రత్యామ్నాయంగా మరో విమానాశ్రయం కోసం ఎంపిక చేసిన కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో ఉండగా, మరొకటి చెంగల్పట్టు , పూంజేరి, చైన్నె ఈసీఆర్ మార్గంలో ఉన్నట్టు పేర్కొంటున్నారు.ఈ నగరం రూపకల్పనకు సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎం స్టాలిన్‌కు సమర్పించే విధంగా అఽధికారులు ముందుకెళ్తున్నారు. త్వరలో చైన్నె గ్లోబల్ సిటీ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు. ఈ పనులు మొదలు కాగానే, మదురై, తూత్తుకుడి, నాగర్ కోయిల్‌లలో కొత్త నగరాలను అంతర్జాతీయప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా కసరత్తులు మొదలు అవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ నిర్మాణాలు ఉంటాయని ఓఅధికారి వివరించారు.