
ఏర్కాడు, ఏలగిరిలో రోప్ వే
సాక్షి, చైన్నె : పర్యాటక ప్రాంతాలు ఏర్కాడు, ఏలగిరిలో రోప్ వే సేవలకు నివేదిక సిద్ధం చేయడానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. సేలం జిల్లాలోని ఏర్కాడు పేదల ఊటిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఊటిని తలపించే విధంగా ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు పర్యాటక శాఖ చర్యలు తీసుకుంది. వేలూరు జిల్లాలోని ఏలగిరి కొండలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి రమణీయతతో నిండిన ప్రదేశాలు, కొండ కోనల్లో సెలయేర్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. దీనిని కూడా అభివృద్ధి పరిచే పనులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఏర్కాడు, ఏలగిరిలలో రోప్ వే సేవలకు సిద్ధమవుతున్నారు. ఏర్కాడు కొండలు, ఏలగిరి కొండ కోనల్లో రోప్‌కార్ సేవలపై దృష్టి పెట్టిన తమిళనాడు టూరిజం డెవలప్ మెంట్ బోర్డు వివరణాత్మక నివేదికను కోరుతూ టెండర్లను ఆహ్వానించేందుకు నిర్ణయించింది. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు రోప్‌వే సేవలు చేపట్టాలి, పర్యాటకంగా ప్రాంతాలను కలిపే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాల గురించి నివేదికను కోరడం విశేషం.