
మా మధ్య విభేదాలు లేవు
● రాందాసు ● త్వరలో తైలాపురంకు అన్బుమణి
సాక్షి, చైన్నె: అన్భుమణితో తనకు ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేవు అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. పీఎంకేలో అధ్యక్ష పదవీ వార్ తండ్రి రాందాసు , తనయుడు అన్బుమణి మధ్య చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా తైలాపురం తోట్టంలో జరిగిన పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, యువజన నేతలు, వన్నియర్ సంఘాల నేతల భేటిని అన్బుమణి బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమావేశాలకు అన్బుమణితో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. దీనిని రాందాసు తీవ్రంగా పరిగణించినట్టు, త్వరలో అన్బుమణిని పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇది కాస్త పీఎంకేలో మరింత గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం రాందాసు మీడియా ముందుకు వచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు, విద్వేషాలు లేవు అని స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టకు అన్బుమణి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి మాట్లాడుతూ, పార్టీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు అన్ని సమసినట్టే అని వ్యాఖ్యలు చేశారు. రాందాసు తదుపరి అన్బుమణి పార్టీకి నాయకత్వం వహిస్తారని పేర్కొంటూ, త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వెళ్తారని స్పష్టం చేశారు. పీఎంకేలో అందరూ ఒక్కటేనని, అందరూ సమానంగానే, ఐక్యతతోనే ఉన్నారని, పార్టీలో కొన్ని సమస్యలు సహజమేనని, అవన్నీ సమసినట్టే అని వ్యాఖ్యానించారు.